సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: మొఘల్ పాలనకు ఎదురు నిలిచిన వీరుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి!
పాపన్న గౌడ్ తన మిత్రుడితో కలిసి నది సమీపాన ఉండగా, ఒక మొఘల్ సైనికుడు అతన్ని తిడుతూ కాలితో తన్నే ప్రయత్నం చేశాడు. కోపంతో పాపన్న గౌడ్ తన చేతిలోని కల్లు తీసే కత్తితో దాడి చేసి అతడిని చంపాడు.

Sardar Sarvai Papanna Goud: మొఘల్ పాలకుల అరాచకాలను ఎదిరిస్తూ, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన యోధుడు సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్. ఒక సామాన్యుడైన వ్యక్తి గొప్ప పరాక్రమవంతుడిగా ఎదిగిన అద్భుత గాథ ఆయనది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి సందర్భంగా, ఆయనను ఈ కథనం ద్వారా స్మరించుకుందాం.
మిత్రుడిని అవమానించిన మొఘల్ సైనికుడిని చంపిన పాపన్న గౌడ్
1650లో వరంగల్ జిల్లాలోని ఖిలాషాపూర్ గ్రామంలో పాపన్న గౌడ కులంలో జన్మించారు. తండ్రిని చిన్నతనంలోనే కోల్పోయిన పాపన్న గౌడ్‌ను తల్లి సర్వమ్మ పెంచి పెద్ద చేసింది. ఆనాటి సమాజంలో బహుజన వర్గాలు తీవ్ర అవమానాలకు, అణిచివేతకు గురయ్యేవారు. మరోవైపు, మొఘల్ సైనికులు సామాన్యులను విచక్షణారహితంగా బాధించేవారు, అనేక హింసలకు గురిచేసేవారు.
అలాంటి సందర్భంలో, పాపన్న గౌడ్ తన మిత్రుడితో కలిసి నది సమీపాన ఉండగా, ఒక మొఘల్ సైనికుడు అతన్ని తిడుతూ కాలితో తన్నే ప్రయత్నం చేశాడు. కోపంతో పాపన్న గౌడ్ తన చేతిలోని కల్లు తీసే కత్తితో దాడి చేసి అతడిని చంపాడు. ఈ ఘటన తర్వాత పాపన్న గౌడ్ తన గ్రామం విడిచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన అతని జీవితాన్నే మలుపు తిప్పింది. ఈ అవమానాలు, అణచివేతలకు వ్యతిరేకంగా తన మిత్రులతో కలిసి పాపన్న గౌడ్ గెరిల్లా సైన్యం ఏర్పాటు చేసి పోరాటం జరిపారు.
పాపన్న గౌడ్ ఒక వ్యూహకర్త, పోరాట యోధుడు
పాపన్న గౌడ్ తన గెరిల్లా సైన్యం నడపడంలో, పోరాటం చేయడంలో అద్భుతమైన వ్యూహకర్తగా చరిత్రకారులు చెబుతారు. ఆయన మొఘల్ పాలకులను ఎదిరిస్తూ, తన స్వంత గ్రామం ఖిలాషాపూర్‌ను రాజధానిగా చేసుకుని అక్కడ ఒక కోటను నిర్మించాడు. ఇది ఒక రకంగా ఆనాటి మొఘల్ చక్రవర్తులకు ఓ సవాలు విసిరినట్లే. ఈ కోటను తన స్థావరంగా చేసుకుని అనేక పోరాటాలను పాపన్న గౌడ్ చేశారు.
మొఘల్ పాలకుల కింద పనిచేస్తూ ప్రజలను దోచుకునే జమీందార్లు, భూస్వాములపై పాపన్న గౌడ్ దాడులు చేసి, దోచుకున్న సంపదతో తన సైన్యాన్ని పటిష్టం చేసుకున్నారు. కొంత సంపదను ప్రజలకు పంచారు. దీని ద్వారా ఆయన ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. గోల్కొండ కోట ఆక్రమణ పాపన్న గౌడ్ సాధించిన అతిపెద్ద విజయం. 1708లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మరణం తర్వాత దక్కన్ ప్రాంతంలో వారి పాలన బలహీనపడింది. ఇది అవకాశంగా తీసుకుని పాపన్న గౌడ్ వారి ఆధీనంలోని వరంగల్ కోటను, ఆ తర్వాత గోల్కొండ కోటపైన దాడి చేసి ఆక్రమించుకున్నాడు. ఇది అతని జీవితంలో అతిపెద్ద విజయంగా చరిత్రకారులు చెబుతారు. కొన్ని నెలలపాటు గోల్కొండ కోటను సర్థార్ పాపన్న గౌడ్ తన ఆధీనంలో ఉంచుకుని పాలన చేశారు. ఈ చర్య అణగారిన వర్గాలకు అతిపెద్ద ఆశాజ్యోతిగా, గొప్ప ప్రేరణగా ఆనాడు నిలిచింది.
పోరాట యోధుడే కాదు, బహుజన నాయకుడిగా పాపన్న గౌడ్
వ్యూహకర్తగా, పోరాట యోధుడిగానే కాకుండా సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు బహుజన నేతగా పేరుంది. తన సైన్యంలో 12 వేల మందికి పైగా యోధులు ఉండేవారు. వీరిలో దళిత, బహుజనులే ఎక్కువగా ఉండడం విశేషం. మొఘల్ పాలకుల పాలనకు వ్యతిరేకంగానే కాకుండా, ప్రజలను పీడించే జమీందారీ, భూస్వామ్య వ్యవస్థలపై పోరాటం జరిపి ప్రజలను కాపాడేవాడు. ప్రజా సంక్షేమం కోసం చెక్‌డ్యాంలు వంటివి నిర్మించేవాడు. ప్రజల ఆధ్యాత్మికతను గుర్తించి ఆలయాలు నిర్మించి ఇచ్చాడు.
పోరాడుతూ వీరమరణం పొందిన పాపన్న గౌడ్
గోల్కొండ కోటను ఆక్రమించి పాలన సాగిస్తున్న పాపన్న గౌడ్, మొఘల్ పాలకులకు కొరకరాని కొయ్యగా మారాడు. దీంతో మొఘల్ సుల్తాన్ బహదూర్ షా 1 ఆదేశాల మేరకు, దక్కన్ ప్రాంత గవర్నర్ రుస్తుం దిల్ ఖాన్ పెద్ద సైన్యంతో పాపన్నపై దాడికి దిగాడు. తన గెరిల్లా సైన్యంతో పాపన్న గౌడ్ వారితో పోరాడుతూ 1710లో వీరమరణం పొందారు. ఇలా అణగారిన వర్గాల ఆశాజ్యోతిగా, పేదల పక్షపాతిగా, మొఘల్ పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేసిన యోధుడిగా సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర పుటల్లో నిలిచారు.























