Adilabad News: అటవీ భూమి కబ్జా చేసి విక్రయించిన బీజేపీ నేతలపై మరో రెండు కేసులు నమోదు
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్రాలు సృష్టించి అటవీ భూమి కబ్జా చేయడంతో పాటు పలువురికి విక్రయించిన కేసులో బిజెపి నేతపై ఆదిలాబాద్ రూరల్ పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు.

Adilabad Crime News | ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్రాలు, ఫోర్జరీలతో భూ కబ్జాకు ప్రయత్నించిన బీజేపీ నేత వకుళాభరణం ఆదినాథ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై మరో 2 కేసులు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాధితుడు తులసివ స్వామికి 2007 లో సర్వే నెం.68/59 లో నకిలీ పత్రాలు సృష్టించి రూ.83,500కు ఒక ప్లాట్ ను నిందితుడు వకుళాభరణం ఆదినాథ్ అమ్మినట్లుగా బాధితుడు ఫిర్యాదు చేశాడు.
ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా, ప్లాట్లు చేసి విక్రయాలు
మరో బాధితుడు చల్లా రవీందర్ అనే వ్యక్తి 2018 లో ప్రకాష్ జైస్వాల్ అనే వ్యక్తి వద్ద నుండి సర్వే నెం.68 లో 3 ప్లాట్లను కొనుగోలు చేశాడు. ఈ 3 ప్లాట్ లను నరేందర్, ఆదినాథ్ లు కలిసి ప్లాట్లకు ఉన్న సరిహద్దును చెరిపేసి ఆ ప్లాట్లకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు ప్రయత్నం చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడని సీఐ ఫణిదర్ తెలిపారు. ఈ మేరకు వకుళాభరణం ఆదినాథ్ పై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో మరో రెండు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పలు సెక్షన్ల కింద కేసులు
ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొన్ని ప్లాట్లు, భూములు కబ్జాకు ప్రయత్నించడంతో పాటు ఫోర్జరీ సంతకాలతో కొన్ని ప్లాట్లను విక్రయించిన కేసులో వకుళాభరణం ఆదినాథ్ నిందితుడిగా ఉన్నారు. ప్రజలను మోసం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న విషయంలో బీజేపీ నేతలపై ఆదిలాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రూరల్ సీఐ ఫణిదర్ హెచ్చరించారు. అతనిపై ఇదివరకే ఐపీసీ సెక్షన్లు 420, 467, 468, 471, 290, 506, 34 కింద కేసు నమోదు చేశారు. కేసుతో సంబంధం ఉన్న వకుళాభరణం ఆదినాథ్ భార్య రజని ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
మరిన్ని చిక్కుల్లో బీజేపీ నేత
అటవీశాఖ భూములను సైతం కబ్జా చేయడంతో పాటు వాటిని అమాయకులను అంటగట్టి సొమ్ము చేసుకున్నాడని బీజేపీ నేత వకుళాభరణం ఆదినాథ్ పై కేసులు నమోదు చేసిన పోలీసులు శనివారం నాడు అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపించారు. ఆయన భార్య రజని పరారీలో ఉన్నారని, ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2010లో జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ శివారులోని ఫారెస్ట్ భూమిని ఆదినాథ్ విక్రయించారు. ఆ భూమి తనదని, ఫేక్ డాక్యుమెంట్లతో నమ్మించి ఏకంగా ప్లాట్లు చేసి విక్రయించారు. నాలుగు ప్లాట్లు సర్వే నంబర్స్ 57, 58, 59, 60ను రూ.3.30 లక్షలకు బాధితురాలు కొనుగోలు చేశారు. 2022లో ఫారెస్ట్ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకోగా, అది ఫారెస్ట్ భూమి అని ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమకు విక్రయించాడని బాధితులు గుర్తించారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, ఫారెస్ట్ భూమిని ఎలా అమ్ముతారని నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు ఒక్కొక్కరు పోలీసులను ఆశ్రయించడంతో వకుళాభరణం ఆదినాథ్ చీటింగ్, కబ్జా కేసులు బయటకు వస్తున్నాయి.






















