Telangana National Unity Vajrotsavam: విద్యుద్దీప కాంతులతో వెలుగులీనుతున్న తెలంగాణ!
Telangana National Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
Telangana National Unity Vajrotsavam: హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయి 75 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ సర్కారు భావించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు వజ్రోత్సవాలను గుర్తుండి పోయేలా నిర్వహించతలపెట్టింది. వచ్చే ఏడాది ఇదే రోజుల్లో ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్ దీపాలతో అలకరించారు. అసెంబ్లీ, బీఆర్ కే భవన్, జీహెచ్ఎంసీ, డీజీపీ ఆఫీసులు.. విభిన్న రంగుల్లో మెరిసి పోతున్నాయి.
మూడ్రోజుల పాటు వేడుకలు..
మూడు రోజుల ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థులు, యువత, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. జిల్లాల్లోనూ వజ్రోత్సవాల ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. నిజామాబాద్ లో తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కేంద్రంతో పాటు మిగతా ప్రాంతాల్లో వేడుకలపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి వేముల సమీక్ష నిర్వహించారు. ఈ నెల 16న అన్ని శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీ నిర్వహించాలని మంత్రి సూచించారు.
ముమ్మరంగా ఏర్పాట్లు..
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలకు రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఈ నెల 17న భారీ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కలిసి పర్యవేక్షించారు. ఈ సభకు లక్ష మంది హాజరు అయ్యే అవకాశం ఉందని.. ఏర్పాట్లలో ఎలాంటి లోపం జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కవులకు, కళాకారులకు సన్మానం..
సెప్టెంబర్ 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటీ, పంచాయతీ ప్రధాన కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఎన్టీఆర్ గ్రౌండ్ లో తలపెట్టిన భారీ సభకు ముందు బంజారాహిల్స్ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం నిర్మించిన బంజారా భవన్‌ను, ఆదివాసీ భవన్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. గిరిజన, ఆదివాసీ, గోండు కళారూపాలతో నెక్లెస్ రోడ్డు నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. సెప్టెంబర్ 18న అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించడమే కాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పిన కవులు, కళాకారులు, ఇతర ప్రముఖులకు సన్మానం చేయనున్నారు. తెలంగాణ స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.