MLA Palvai Harish Babu: సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు హౌస్ అరెస్ట్, పోడు రైతుల ఆందోళనకు ఊతం
Kagajnagar Forest Office | నేడు కాగజ్ నగర్ అటవీ డివిజన్ కార్యాలయం ముట్టడికి పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యే హరీష్ బాబుతో పాటు బీజేపీ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.

Asifabad News | నేడు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ ఫారెస్ట్ కార్యాలయం ముట్టడి సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబుని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరోపక్క జిల్లాలోనీ బీజేపీ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. కాగజ్ నగర్ లో పలువురిని అరెస్టు చేసి కేరమెరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిర్పూర్ నియోజకవర్గంలోని పోడు భూములు సాగు చేసే రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఉదయం నుంచే ఎక్కడికక్కడ అరెస్టులు..
ప్రశ్నించే గొంతును ప్రజలకు మద్దతుగా నేడు కాగజ్ నగర్ అటవీ డివిజన్ కార్యాలయం ముట్టడికి ఎమ్మెల్యే హరీష్ బాబు పిలుపునివ్వడంతో నేడు సోమవారం ఉదయం 5 గంటలకు అరెస్ట్ చేసి కెరమెరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలా అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని బిజెపి నాయకులు అన్నారు. అరెస్టైన వారిలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షులు దోని శ్రీశైలం, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యక్రమ కోఆర్డినేటర్ గోలెం వెంకటేశం, బిజెపి సీనియర్ నాయకులు బిజెపి సీనియర్ నాయకులు సిందం శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి సమీర్ గుప్తా జిల్లా కౌన్సిల్ సభ్యులు వికాస్ గారామి పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ కుమార్ తదితరులు ఉన్నారు.

బీజేపి నేతల అరెస్టులు పోడు రైతుల ఆందోళనకు ఊతం: పాల్వాయి హరీష్ బాబు
కాగజ్‌నగర్ అటవిశాఖ కార్యాలయం ముట్టడికి బీజేపి పిలుపు నివ్వడంతో పోలీసులు సోమవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు బీజేపి నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబును హౌజ్ అరెస్ట్ చేశారు. కాగజ్‌నగర్ నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ముట్టడికి వస్తున్న మహిళలు, యువకులు, గ్రామస్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫారెస్ట్ అధికారులు చేసే దమనకాండకు ఎమ్మెల్సీ దండే విఠల్ వత్తాసు పలుకుతూ బీజేపి నేతలను అరెస్ట్ చేయించడం తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు.

ఎమ్మెల్సీ దండే విఠల్ ఒకసారి ఇటుకలపహాడ్ గ్రామానికి వెళ్లి చూడండి, ప్రజలు మీపై ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలుస్తుంది. వారికి నిలువనీడ లేక, బతుకు దేరువు కష్టమై గ్రామాన్ని వదిలే పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పోడు పట్టాలు ఇస్తామని చెప్పలేదా?” అని ప్రశ్నించారు. అలాగే, “జీవో నెం.49 తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై కాంగ్రెస్ నేతలు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు. రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు రాంచందర్ కి ఇక్కడి పరిస్థితులు వివరించామని వారి అనుమతితో ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
జీవనోపాధి కోల్పోయిన వందల కుటుంబాలు
ఇటుకలపహాడ్ సమస్యలను పరిష్కరించామని చెబుతున్న అధికారులపై మండిపడుతూ – “అక్కడ మూడు వందల కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి. ఊరు వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అటవిశాఖ అధికారులు అత్యుత్సాహంగా ప్రదర్శిస్తున్నారు. పోడు రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం” అని ప్రకటించారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసన తెలపడం హక్కు. కానీ ప్రజలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం అన్యాయం అని తీవ్రంగా విమర్శించారు.





















