Crime News: మీరు ఇంటి బయట కారును పార్క్ చేస్తున్నారా? ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు జాగ్రత్త!
వాళ్లకు కారు కనిపిస్తే చేతులు దురద పెడతాయి. అంతే రాత్రికి పని పూర్తి చేస్తారు. కారు అక్కడే ఉంటుంది కానీ అందులో ఓ ముఖ్యమైన పార్ట్ మాత్రమే ఎత్తుకెళ్లిపోతారు.
నిజామాబాద్ జిల్లాలో కార్ల యజమానులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. కారుని లాక్ చేయడం మర్చిపోతే... కారు ఉంటుంది కానీ.. కారుకి ఉన్న సైలెన్సర్ మాత్రం మాయమైపోతోంది. జిల్లాలో వరుసగా జరిగిన సైలెన్సర్స్ చోరీలు ఆందోలన కలిగించాయి. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అసలు గుట్టు రట్టు చేశారు.
దొంగలు వారి చేతి వాటం చూపేందుకు కొత్త రూట్స్ వెతుకుతున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో
ఫోర్ విల్లర్స్ నుంచి సైలెన్సర్‌లను దొంగిలిస్తున్నారు. వీటిని దొంగతనం చేస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను 20 వ తేదీని పట్టుకున్నారు. రాత్రి 11.45 గంటలకు బోర్గం(పి) వద్ద సిసిఎస్ ఎస్సై, 4వ టౌన్ ఎస్సై మాటు వేసి ముఠా గుట్టు రట్టు చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్ బులంద్ సహర్ జిల్లాకు చెందిన వ్యక్తులు గ్యాంగ్‌గా ఏర్పడి సైలెన్సర్స్ కొట్టేయడం స్టార్ట్ చేశారు. గత మూడు నెలలుగా మారుతి ఎకో కారు సైలెన్సర్‌లను నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్‌లో దొంగతనాలు చేస్తూ యజమానులకు కంటిమీద కునుకు లేకుండా చేశారు.
వీరిపై 110/2022 అండర్ సెక్షన్ ఐపిసి 379 ప్రకారం నిజామాబాద్‌లోని 4వ పోలీస్ స్టేషన్‌లో కామారెడ్డి, హైదరాబాద్‌లోని ఇతర పోలీస్ స్టేషన్లలో 10 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కామారెడ్డికి చెందిన వాటిషెట్టి వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డిలో కేసు నమోదైంది.
అంతరాష్ట్ర సైలెన్సర్ దొంగల ముఠా మొహమ్మద్ వసీం(25), మహమ్మద్ సోహైల్ (22), మొహమ్మద్ జాకీ(24) అరెస్టు చేశారు పోలీసులు. వీరి నుంచి 12 సైలెన్సర్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 5.5లక్షలు ఉంటుంది. ఏపి 09.ఎడి 6489గల మారుతి 800 కారు, 12 బాక్సుల మిశ్రమ లోహము, కెటాలిటికల్ కన్వర్టర్, 3 సెల్‌ఫోన్‌లు కూడా సీజ్ చేశారు.
కారులోని ఇతర పార్ట్స్‌పై చేయి వేయరని... ఈ ముఠా కేవలం సైలెన్సర్స్ మాత్రమే చోరీ చేస్తుంది. సైలెన్సర్స్ అంటే ఎవరూ పెద్ద పట్టించుకోరన్న భావనతో ఈ ముఠా వాటిని టార్గెట్ చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. సైలెన్సర్స్ పోయినా యజమానులు ఫిర్యాదు చేయడానికి కూడా ఆసక్తి చూపరని అందుకే వీళ్లు పోలీసులకు చిక్కలేదని అన్నారు.