Nizamabad News: నిజామాబాద్ జిల్లాలో పార్టీల విన్నింగ్ స్కెచ్‌లు- హీటెక్కిన పాలిటిక్స్
నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు స్కెచ్‌లు వేస్తున్నాయి. నియోజకవర్గాల్లో పార్టీల బలోపేతంపై చాలా ఫోకస్డ్‌గా ఉన్నాయి.
రాజకీయంగా చైతన్యం కలిగిన జిల్లాగా నిజామాబాద్ జిల్లాకు పేరుంది. విభిన్నమైన తీర్పు ఇవ్వటం ఇందూరు జిల్లా ప్రజలకే సాధ్యం అంటారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే నాయకులు ఈ జిల్లా నుంచి ఉన్నారు. డీఎస్ నుంచి మొదలు ఎమ్మెల్సీ కవిత వరకు జిల్లాలో పాలిటిక్స్ ను ప్రభావితం చేసే నాయకులు చాలా మందే ఉన్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు కానీ ఇందూరు జిల్లా పొలిటికల్ స్ట్రీట్ లో మాత్రం హీట్ పుట్టిస్తున్నాయ్ ప్రధాన పార్టీలు. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ ఎవరికి వారే తగ్గేదే లే అన్నట్లు ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టాయ్.
నియోజవకర్గాల్లో బలోపేతంపై పార్టీల దృష్టి
రోజురోజుకీ నిజామాబాద్ జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. జిల్లాలో అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష నేతలు తమ పార్టీల బలోపేతంపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గాల్లో పట్టు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఎవరికివారే తమ క్యాడర్ బలోపేతంపై కన్నేశారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని వచ్చే ఎన్నికల్లో జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.
అధికార, ప్రతిపక్షాల నేతలు నియోజకవర్గాలపై చాలా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ప్రధాన పార్టీలు తమ క్యాడర్ పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పల్లె గోస - బీజేపీ భరోసా పేరుతో నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు చేస్తోంది. రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రజల్లోకి వెళుతున్నారు. అధికార పార్టీ సైతం అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటోంది. రచ్చబండ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది.
జంప్ జిలానీలపై రాజకీయ పార్టీల నజర్
టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ జిల్లా నాయకత్వం నియోజకవర్గాల్లో భారీ ప్రచారాలను నిర్వహిస్తూనే జంప్‌జిలానీలపై ఓ కన్నేసి ఉంచింది. వారిని పార్టీల్లో చేర్చుకుంటూనే బలమైన నేతలను బరిలో దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సామాజిక సమీకరణలకు అనుగుణంగా బలమైన నేతలకు గాలం వేస్తున్నాయ్ ప్రధాన పార్టీలు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.... పోటీకి సై అంటున్నాయ్.
టీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలనే మరోసారి బరిలోకి దిగేందుకు అధిష్ఠానం వద్ద ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. జిల్లాలో ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినవారే.. తిరిగి వారే బరిలో ఉండేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు మరింత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నియోజకవర్గాల్లోనే తిరుగుతూ ఇతర పార్టీ నేతలను చేర్చుకుంటున్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా పరిస్థితి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సంక్షేమ పథకాల అమలుతోపాటు ప్రజాసమస్యలు పరిష్కరించుకుంటూ ప్రయత్నిస్తున్నారు. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తూ... ప్రజలకు టచ్‌లో ఉంటున్నారు. నియోజకవర్గాల్లోని గ్రామాలు, డివిజన్‌లు తిరుగుతూ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జిల్లాలో పట్టు కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు
నిజామాబాద్ జిల్లాలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. గతంలో కన్నా ప్రస్తుతం బీజేపీ జిల్లాలో పుంజుకుంటోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అరవింద్ ఘన విజయం సాధించారు. అనంతం జరిగిన నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో అనూహ్యంగా కమలం పార్టీ నుంచి 28 మంది కార్పోరేటర్లు గెలిచారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. జిల్లాలో గత ఎన్నికల తర్వాత బీజేపీకి ప్రజల్లో ఆధరణ పెరుగుతూ వస్తోంది. చాలా మంది కమలం పార్టీలో చేరుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ ముందుకెళుతోంది.
హైదరాబాద్ లో ప్రధాని మోడీ సభ తర్వాత క్యాడర్ లో మరింత జోష్ పెంచేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే పల్లె గోస - బీజేపీ భరోసా పేరుతో నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తోంది కమలం పార్టీ. బోధన్ లో రాజాసింగ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో పర్యటించి పార్టీ బలోపేతం చేస్తూనే... రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగడుతున్నారు. నియోజకవర్గాల్లో బలమైన నేతలను బరిలోకి దింపేందుకు స్కెచ్ వేస్తున్నారు బీజేపీ అధినాయకులు. బీజేపీ ఈ దఫా గట్టిపోటీ ఇవ్వనుండడంతోపాటు వీలైనన్ని స్థానాలను గెలుచుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జీలుగా ఉన్న నేతలతోపాటు సామాజిక వర్గాల ఆధారంగా ఆయా నియోజకవర్గాల పరిధిలో ఉన్న నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. నియోజకవర్గంలో ఓట్లకు అనుగుణంగా ఆయా వర్గాలను బరిలోకిదించే ప్రయత్నాలు చేస్తున్నారు.
పూర్వవైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు
నిజామాబాద్ జిల్లా గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లోహస్తం పార్టీ క్లీన్ స్వీప్ చేసిన ఘనత ఉంది. మారిన రాజకీయ పరిణామాలు, తెలంగాణ సెంటిమెంట్ తో పార్టీ వైభవం కోల్పోతూ వచ్చింది. డీఎస్ లాంటి సీనియర్ నేతలు పార్టీని వీడిపోవాల్సి వచ్చింది. చాలా మంది నాయకులు ఇతర పార్టీల వైపు వెళ్లారు. అయితే తిరిగి పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు జిల్లా నాయకత్వం కృషి చేస్తోంది. జిల్లా సీనియర్ నాయకులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కులా ఉన్నారు. పార్టీ బలోపేతంపై ఆయన దృష్టి సారించారు. తిరిగి పార్టీని బలోపేతం చేసేందుకు ఆయన ముందుకెళ్తున్నారు. పాత వారిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాక జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఊపు మొదలైంది. స్థబ్దుగా ఉన్న వారంతా తిరిగి హస్తం పార్టీలో యాక్టివ్ గా మారారు. ప్రజా సమస్యలపై తమ గళం విప్పుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులను చేర్చుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే రచ్చ బండ పేరుతో నియోజకవర్గాల్లో ప్రజలకు దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ కృషిచేస్తోంది. ఒకప్పుడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నాయకుల కొదవ ఉండేది కాదు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలపై దృష్టి సారించింది. ఓటింగ్ శాతం అధికంగా ఉన్న సామాజికవర్గాల నుంచి గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ సీనియర్లు నియోజకవర్గాల్లో తిరుగుతూ...క్యాడర్ లో జోష్ తెప్పిస్తున్నారు. పార్టీని వీడి వెళ్లిన పాతవారిని తిరిగి చేర్చుకుంటున్నారు. జిల్లా నుంచి పీసీసీలో ఇద్దరు నేతలు కీలక బాద్యతల్లో ఉన్నారు. ఒకరు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మరోకరు మహేష్ కుమార్ గౌడ్. వీరు పీసీసీలో కీలకంగా ఉన్నారు. క్యాడర్ బలోపేతంపై నేతలు దృష్టిసారిందారు.
ఇటు బీఎస్పీ, అటు వైఎస్ ఆర్ సీపీ, ఆమ్ ఆద్మీ, టీడీపీ సైతం అవకాశం కోసం వేచి చూస్తున్నాయ్. ఆ పార్టీలు సైతం వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నాయకులను బరిలో దింపేందుకు సిద్ధమవుతున్నాయ్.