Nizamabad News: తెలంగాణలో ఒకేసారి 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు నిధులు మంజూరు
తెలంగాణలో 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ. 404.82 కోట్లు విడుదల అయ్యాయి. పరిపాలన అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి థాంక్స్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి 4 రేల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేసినట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. చటాన్ పల్లి-షాద్ నగర్, ఆదిలాబాద్ మార్కెట్ యార్డు, పెద్దపల్లి టౌన్, మాధవనగర్, నిజామాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈ పనులు ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టబోతున్నట్టు మంత్రి తెలిపారు. ఈ నిర్మాణాల కోసం ఖర్చుకానున్న రూ.404.82 కోట్ల నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 250.02 కోట్లు భరించనుంది. రైల్వే శాఖ 154.80 కోట్లు నిధులు ఇవ్వనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.404.82 కోట్ల వెచ్చించి నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత రైల్వే శాఖ తన తరఫు నిధులు విడదల చేయనుంది.
నిజామాబాద్ మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జికి మోక్షం
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు మోక్షం లభించింది. సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయటంతో ఇక పనులు మొదలు కానున్నాయ్. మాధవ నగర్ రైల్వే ట్రాక్ వద్ద జిల్లా వాసులకు ఇక ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయ్. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రూ.2 కోట్ల 50 లక్షలతో నిర్మించిన మినీ స్టేడియాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ... అన్ని హంగులతో స్టేడియం నిర్మాణం చేసుకోవడం ద్వారా యువతకు ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. నియోజకవర్గానికి ఒక్కటే స్టేడియం అనే పాలసీ ఉంది. కానీ సీఎం కేసీఆర్ కు నచ్చజెప్పి కమ్మర్ పల్లిలో స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు మంత్రి. ఇన్ని హంగులతో నిర్మించుకున్న స్టేడియం నిర్వహణ కోసం ప్రత్యేక కార్యాచరణ స్పోర్ట్ అథారిటీ సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. స్టేడియంలో ఓపెన్ జిమ్ సైతం ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రాష్ట్రంలో వాలీబాల్ అభివృద్ధికి హన్మంత్ రెడ్డి ఎంతో కష్టపడుతున్నారని.. గతంలో వెంకట్రామిరెడ్డి వాలీబాల్ ఆటను నిలబెట్టారు. స్వతహాగా తాను రాష్ట్ర స్థాయిలో వాలీబాల్ ఆడానని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. నా తండ్రి వేముల సురేందర్ రెడ్డి వాలిబాల్ జిల్లా జట్టు కెప్టెన్ గా ఉండేవారని చెప్పారు. తండ్రితో కలిసి క్రికెట్ ఆడిన అవకాశం దక్కిందన్నారు వేముల.
బాల్కొండ నియోజకవర్గంలో అనేక మంది వాలీబాల్, కబడ్డీ రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులు ఉన్నారు. పిల్లలు సోషల్ మీడియా మోజులో ఆటలు మర్చిపోయారు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా పోయింది. చెడు అలవాట్లకు స్వస్తి పలికి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని యువతకు సందేశం ఇచ్చారు మంత్రి వేముల. యూత్ పక్కదారి పట్టకుండా... ఉండాలంటే.. క్రీడలు ఎంతో అవసరమన్నారు. యువతను క్రీడల వైపు మళ్లించడానికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని తెలిపారు మంత్రి వేముల. శక్తీ మేరకు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తాను. స్పోర్ట్స్ ఆడిన వాళ్ళ జీవితాలు స్థిరపడతాయి అని చెప్పారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా పెట్టినందున ఉద్యోగాలు రావడంలో ఎంతో దోహదం చేస్తుందన్నారు మంత్రి.
తెలంగాణలో ఉద్యోగాలు లేవనే అబద్ధప్రచారం జరుగుతోందని... తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నేతనే కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అదృష్టమని చెప్పారు. అన్ని బాధలు తెలిసిన కేసీఆర్ నియామకాల్లో ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదని. లక్షా 32 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 40 వేల ఉద్యోగాలు సీఎం కేసీఆర్ ఇచ్చారు. బీజేపీ పాలిత యూపీలో 19 వేలు, బీహార్ లో 8.950 కర్ణాటక 14,893, మహారాష్ట్రలో 8వేలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేశారు. కానీ తెలంగాణలో 40 వేల ఉద్యోగాలు ఇచ్చారు. ఇది అబద్ధమైతే రాజీనామా చేస్తానని నిజమైతే మీరు మీ పదవులకు రాజీనామా చేస్తారా ? అని సవాల్ విసిరారు మంత్రి వేముల.
టి ఎస్ ఐ పాస్ ద్వారా పరిశ్రమలు ఏడేళ్లలో కొత్తగా 17 వెల కొత్త పరిశ్రమలు వచ్చాయి. 13 లక్షల కొత్త ఉద్యోగాలు ప్రైవేట్ లో ఇవ్వడం జరిగిందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఐ టి ఎగుమతులు రూ 50 కోట్లు ఉంటే నేడు రూ. లక్ష 40 వేల కోట్లకు పెరిగిందన్నారు మంత్రి. 3 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. గతంలో ఎప్పుడైనా ఇలా ఉన్నాయా ? దీనిపై ఎలాంటి సవాలుకైనా తాను సిద్ధమే అని అన్నారు.
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశాన్ని ఏలుతున్న వారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు మంత్రి వేముల. అడ్డగోలుగా అబద్దాలు మాట్లాడుతున్న బీజేపీ పాలకులారా తెలంగాణలో 16 లక్షల ఉద్యోగాలు కేటీఆర్ శ్రమతో వచ్చాయని మీ కేంద్రం తెలంగాణలో... తలసరి ఆదాయం నాడు రూ. ఒక లక్ష ఉంటే, నేడు రూ. 2లక్షల 10 వేలకు చేరింది. గుజరాత్ ను దాటి తలసరి ఆదాయం తెలంగాణ కంటే తక్కువ. ఉద్యోగుల బదిలీల్లో 10 శాతం మందికి మాత్రం కొంత ఇబ్బంది జరిగితే రాజకీయం చేస్తున్నారు. అందరికి మళ్ళీ సర్దుబాటు జరుగుతుందని తెలిపారు మంత్రి వేముల.
Also Read: ‘నిన్ను పెళ్లి చేసుకోను.. ఇంకొకరితో కానివ్వను.. కాదని చేసుకుంటే..’ హైదరాబాద్‌లో సైకో లవర్ హల్‌చల్