Nizamabad Rains: శ్రీరామ్ సాగర్‌కు పోటెత్తుతున్న వరద నీరు - అప్రమత్తమై 30 గేట్లు ఎత్తిన అధికారులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లానూ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు వరద నీటితో నిండు కుండలా మారడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు.
Srirama Sagar Projest: తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లానూ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు వరద నీటితో నిండు కుండలా మారడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం ఎస్సారెస్పీకి 2,35,500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండటంతో అధికారులు 30 గేట్లు ఎత్తి 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 73 టీఎంసీలు నిల్వ ఉంది. జెన్ కోకి 3 వేల క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 15 వేల క్యూసెక్జుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో దంచికొడుతున్న వానలు..
కౌలాస్, సింగీతం, కళ్యాణి, నిజాంసాగర్ ప్రాజెక్ట్ లలో జలకళ
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
పొలాల్లోకి భారీగా చేరిన వరద నీరు
గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జుక్కల్ నియోజక వర్గంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నియోజకవర్గం లో ఉన్న చెరువులు కుంటలు, సింగీతం రిజర్వాయర్ లు నిండుకోగా నిజాంసాగర్, కౌలస్ నాల, కల్యాణి ప్రాజెక్ట్ లు జలకళను సంతరించుకున్నాయి. కౌలస్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి మట్టానికి చేరుకోనగా ప్రాజెక్ట్ మూడు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు 9544 క్యూసెక్కుల వరద నీటిని ప్రాజెక్ట్ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరద నీరు పంట పొలాల్లోకి చేరుతోంది. సాగు చేయడానికి వీలు కావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Rains in AP Telangana: మరింత బలపడిన అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు
నిజాం సాగర్‌లోకి భారీగా వరద నీరు..
వర్షాల ప్రభావంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 9420 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి మట్టం 1405 అడుగులు ఉండగా 1395 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 17 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 7.284 టీఎంసీలకు చేరుకుంది.అయితే ఇలాగే ఇటు కళ్యాణి ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తి 360 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయగా.. సింగీతం రిజర్వాయర్ అలుగు మీదుగా 5350 క్యూసెక్కుల వరద నీళ్లు దిగువకు వెళుతున్నాయి. అయితే భారీ వర్షాలకు నియోజక వర్గం లోని పలు లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగిపోగా, పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వరద నీటిని దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో రోడ్లపై ప్రయాణిస్తున్నారా, వర్షం నీళ్లు నిలిచిపోయే ఏరియాలు ఇవే