Nizamabad News: డీఎస్ రీఎంట్రీకి నిజామాబాద్ కాంగ్రెస్‌లో లీడర్ల స్పీడ్ బ్రేకర్స్.. పొలిటికల్ జంక్షన్‌లో సీనియర్ లీడర్
డీఎస్ పొలిటికల్ ఫ్యూచర్ అయోమయంలో పడింది. ఈ నెల 24న కాంగ్రెస్‌లో చేరుతారన్న వార్తలను ఖండిస్తోంది డీఎస్ వర్గం. ఆయన రీ ఎంట్రీని జిల్లా నేతలే అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ను నడిపించిన లీడర్ ధర్మపురి శ్రీనివాస్ అదేనండీ డీఎస్ ఇప్పుడు పొలిటికల్ జంక్షన్‌లో నిలబడి ఉన్నారు. ఎటు వెళ్లాలనే క్లారిటీ రాక పూర్తిగా డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది కాంగ్రెస్‌లో చేరిపోతున్నారని ఇప్పటికే చాలా తేదీలు ప్రకటించేశారు కానీ ముహూర్తం మాత్రం ఎందుకో కుదరడం లేదు.
ఇప్పుడు తాజాగా మరో డేట్ తెరపైకి వచ్చింది. ఈ నెల 24 డీఎస్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదంతా దుష్ప్రచారమంటూ కొట్టిపారేస్తున్నారు డీఎస్ అనుచరులు. ఇప్పటి వరకు డీఎస్ గానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఎవరు మాట్లాడినా టైం విల్ డిసైడ్ అంటూ దాట వేస్తున్నారే కానీ అసలు సంగతి చెప్పడం లేదు.
ఈ మధ్య కాలంలో డీఎస్ చిన్న కుమారుడు ఎంపీ అరవింద్ మాట్లాడుతూ డీఎస్‌కు ఏది ఇష్టం ఉంటే అది చేస్తారని.. బీజేపీలోకి వస్తానంటే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. డీఎస్ మాత్రం ఇప్పటి వరకు పార్టీ మార్పుపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
డీఎస్ పొలిటికల్ కెరీర్ ప్రారంభమైందే కాంగ్రెస్‌లో.. అందులో టాప్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పీసీసీ చీఫ్‌గా, మంత్రిగా పని చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం. టీఆర్‌ఎస్‌కు దూరమైన తర్వాత కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితి గమనించిన వారంతా డీఎస్ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమనే అభిప్రాయనికి వచ్చారు కానీ ముహూర్తం మాత్రం కుదరడం లేదు.
డిసెంబర్‌లో సోనియాను డీఎస్ కలిసిన సందర్భంలో కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఖాయంగా భావించారు. ఇక ముహూర్తమే తరువాయి డీఎస్ కాంగ్రెస్ లోకి చేరిపోతారన్న ప్రచారం జోరుగా జరిగింది. తిరిగి ఈ నెల 24న కాంగ్రెస్ పార్టీలోకి చేరుతాన్న ప్రచారమూ జరిగింది. కానీ దీనిపై ఇంకా స్పష్టమైన క్లారిటీ లేదు.
ప్రధానంగా డీఎస్ తన పెద్ద కొడుకు నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ పొలిటికల్ ఫ్యూచర్ పై దృష్టి సారించారు. సంజయ్ కూడా తండ్రి బాటలోనే కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డిని కూడా పలు సందర్భాల్లో సంజయ్ కలిశారు. కానీ పార్టీలోకి చేరటం ఖాయం అని సంజయ్ అంటున్నా... అది ఎప్పుడు అనేదానిపై క్లారిటీ లేదు.
డీఎస్ బీజేపీలోకి చేరినా చేరొచ్చన్న ప్రచారమూ నడుస్తోంది. ఇప్పటికే డీఎస్ చిన్న కొడుకు ఎంపీ అరవింద్ బీజేపీలో కొనసాగుతున్నారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీలో కీలకంగా అరవింద్ వ్యవహరిస్తున్నారు. డీఎస్ కాంగ్రెస్ లోకి వెళ్తే అరవింద్ పొలిటికల్ ఫ్యూచర్ పైనా ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే డీఎస్ రాజ్యసభ పదవి కాలం జూన్ వరకూ ఉంది. ఆ తర్వాత డీఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ పై నిర్ణయం తీసుకుంటారన్న వాదనా మరోవైపు వినిపిస్తోంది.
తెలంగాణలో అప్పుడే పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యూహ రచనకు కాంగ్రెస్ బీజేపీకి డీఎస్ లాంటి ఎక్స్‌పీరియన్స్ లీడర్ నీడ్ ఉంది. అలాంటి అనుభవం ఉన్న డీఎస్ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతారా లేక బీజేపీ కండువా కప్పుకుంటారా అన్న డైలమా కొనసాగుతోంది.
డీఎస్ కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానానికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలు కొందరు డీఎస్ ఎంట్రీ విషయంలో అభ్యంతరాలు తెలిపినట్లు ఆ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయ్. పార్టీ భవిష్యత్‌ను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆటైంలో పార్టీని విడిచి పెట్టి వెళ్లిపోయారని.. ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో స్థానం లేదని గ్రహించి పార్టీ మారుతున్నారని వాళ‌్లు వాదిస్తున్నారట.
Also Read: రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ తల్లిదండ్రులపై కేసు ? విచారణకు రావాలని విజయవాడ పోలీసుల నోటీసులు !
Also Read: ఇండస్ట్రీకి మంచి రోజులు ముందున్నాయి... జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన నాగార్జున
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి