Nikhat Zareen First Coach: చిన్న రేకుల షెడ్డులో నిఖత్ జరీన్‌కు సొంత డబ్బులతో బాక్సింగ్ శిక్షణ ఇచ్చిన సంసముద్దీన్
Nikhat Zareen: బాక్సింగ్ కోచింగ్ లో దిట్ట సంసముద్దీన్. సొంత డబ్బులు ఖర్చు చేస్తూ బాక్సింగ్ శిక్షణ ఇచ్చారు. డబ్బులు తీసుకోకుండా పిల్లలకు ఉచిత తర్భీదు. ప్రభుత్వం సహకారం లేకున్నా ఛాంపియన్లను తయారుచేశారు.
Nikhat Zareen First Coach Samsamuddin: ఇందూరు (నిజామాబాద్) గడ్డ మీద పుట్టిన నిఖత్ జరీన్... ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచారు. నిఖత్ పట్టుదల, బాక్సింగ్ పై ఆమెకున్న ఇంట్రస్ట్ ప్రపంచ స్థాయి కీర్తిని గడింపజేసేలా చేసింది. అయితే నిఖత్ జరీన్ లో బాక్సింగ్ టాలెంట్ ను గుర్తించి ఆమెకు బాక్సింగ్ లో ఓనమాలు నేర్పారు కోచ్ సంసముద్దీన్. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ లో నివాసముండే సంసముద్దీన్ నిఖత్ బాక్సింగ్ నేర్చుకునే తొలినాళ్లలో ఆమెను తీర్చిదిద్దారు.
చిన్న రేకుల షెడ్డులో మొదలైన నిఖత్ జరీన్ మెరుపులు..
నాలుగేళ్ల పాటు నిఖత్ కు సంసముద్దీన్ బాక్సింగ్ కోచింగ్ ఇచ్చారు. 2009 నుంచి 2012 వరకు ఇక్కడే మూడు షట్టర్ గదులతో ఉన్న చిన్న రేకుల షెడ్డులోనే ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ప్రస్థానం మొదలైంది. ఇవాళ నిఖత్ ప్రపంచ ఛాంపియన్ గా నిలవటంలో సంసముద్దీన్ పాత్ర కూడా కీలకం. 30 ఏళ్లుగా సంసముద్దీన్ వేల మందికి బాక్సింగ్ శిక్షణ ఇస్తూ వస్తున్నారు. సంసముద్దీన్ శిక్షణలో ఇప్పటి వరకు బాక్సింగ్ చాలా మంది రాణించారు. సంసముద్దీన్ శిక్షణలో 5 గురు ఇంటర్నేషనల్ ఛాంపియన్ లు కాగా... 25 మంది నేషనల్ ఛాంపియన్ లుగా నిలిచారు. ఇక స్టేట్ లెవల్ ఛాంపియన్లకు లెక్కే లేదు.
వేరీ స్ట్రీట్ కోచ్ సంసముద్దీన్
సంసముద్దీన్ సబ్ జూనియర్ నేషనల్స్ విజేత. చిన్నప్పటి నుంచి స్వతహాగా బాక్సింగ్ నేర్చుకునే వారు. నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ లో నివాసం ఉంటున్నారు. దాదాపు 30 ఏళ్ల నుంచి సంసముద్దీన్ వేల మందికి బాక్సింగ్ లో శిక్షణ ఇచ్చారు. సంసముద్దీన్ శిక్షణలో చాలా మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా సాధించారు. సంసముద్దీన్ 6 గురు కొడుకుల్లో నలుగురు బాక్సర్లే. ఒక కొడుకు ఆర్మీలో బాక్సింగ్ కోచ్ గా పనిచేస్తున్నారు. మిగతా ముగ్గురు స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. సంసముద్దీన్ కూడా ఆర్మీలో పనిచేసేవారు ఉద్యోగం మానేశారు. పులాంగ్ లో హోటల్ నడిపేవారు..హోటల్ నడుపుతూనే హోటల్ వెనకాల పిల్లలకు బాక్సింగ్ శిక్షణ ఇస్తుండే వారు. బాక్సింగ్ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న పిల్లలకు సంసముద్దీన్ ఫ్రీ కోచింగ్ ఇస్తారు.
యోగితా రాణా కలెక్టర్ గా ఉన్న సమయంలో కలెక్టర్ గ్రౌండ్స్ లో బాక్సింగ్ శిక్షణ కోసం 2 గదులను కేటాయించారు. అప్పటి నుంచి అక్కడే పిల్లలకు శిక్షణ ఇస్తూ వస్తున్నారు. నిఖత్ జరీన్ ప్రపంచ ఛాంపియన్ కావటం తనకేంతో గర్వకారణంగా ఉందన్నారు సంసముద్దీన్. కోచింగ్ సమయంలో చాలా కఠినంగా ఉంటారు సంసముద్దీన్. క్రమశిక్షణ ఉంటేనే శిక్షణ ఇస్తారు. నేర్చుకోవాలనే తపన, పట్టుదల, సమయపాలన ఉన్న వారికే సంసముద్దీన్ బాక్సింగ్ లో శిక్షణ ఇస్తారు. అయితే గత 30 ఏళ్ల నుంచి సంసముద్దీన్ ఉచితంగానే పిల్లలకు బాక్సింగ్ లో శిక్షణ ఇస్తూ వస్తున్నారు. అతని వద్ద బాక్సింగ్ నేర్చుకుని ఛాంపియన్లుగా మారిన చాలా మంది కాస్తో కూస్తో సాయం చేస్తూ వస్తుండటంతో నేటికీ బాక్సింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. పేద పిల్లలకు బాక్సింగ్ ఇంట్రస్ట్ ఉండి కనీసం బాక్సింగ్ గ్లౌజ్ కూడా కొనే స్థోమత లేని వారికి తన సొంత డబ్బులతో కొనిచ్చేవారు సంసముద్దీన్.
ప్రభుత్వం నుంచి సహకారం కరువు..
సంసముద్దీన్ ఇప్పటి వరకు వేల మందికి బాక్సింగ్ లో శిక్,ణ ఇచ్చారు. ఎంతో మంది నేషనల్, ఇంటర్నేషనల్ బాక్సింగ్ కాంపీటీషన్ లో పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం నుంచి సంసముద్దీన్ కు ఎలాంటి సహకారం అందలేదు. కనీసం బాక్సింగ్ కు కావాల్సిన రింగ్ ఇతర సదుపాయాలు సైతం ఇవ్వలేదు. బాక్సింగ్ రింగ్ ను సైతం తన సొంత డబ్బులతోనే ఏర్పాటు చేశారు సంసముద్దీన్. తాను బాక్సింగ్ లో ప్రపంచ స్థాయిలో రాణించాలనుకున్నా... ఆర్థిక స్తోమత కారణంగా మానేశారు. కానీ ఇవాళ ఎంతో మందికి ఇంటర్నేషనల్ బాక్సింగ్ కాంపిటీషన్ లో పాల్గొనేలా చేసి, ప్రపంచ ఛాంపియన్ గా నిలిచేలా చేశారు సంసముద్దీన్. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి సరైన సహకారం లభిస్తే జిల్లాలో నుంచి మరింత మందిని బాక్సింగ్ ఛాంపియన్లుగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు సంసముద్దీన్.
Also Read: Nikhat Zareen Profile: ఓవర్‌నైట్ గెలుపు కాదిది - నిఖత్ జరీన్‌ది 12 ఏళ్ల శ్రమ!