Nirmal News: స్వయంభువుగా వెలసిన కొరిడి బొజ్జగణపయ్య, దర్శించుకునేందుకు భారీగా వస్తున్న భక్తులు
Nirmal News: నిర్మల్ జిల్లా మాటేగా గ్రామంలో స్వయంభువుగా వెలసిన కొరిడి బొజ్జగణపయ్య మహిమలు మహిమాన్వితం. నిత్యం వందలాది మంది భక్తులు ఈ స్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు.
Nirmal News: నిర్మల్ జిల్లా మాటేగా గ్రామంలో స్వయంభువుగా వెలసిరి కొరిడి గణేష్ మహిమలు మహిమాన్వితం. స్వామి వారిని భక్తితో వేడుకుంటే కోరుకున్న కోరికలు ఇట్టే తీరుతున్నాయని భక్తులు నమ్ముతున్నారు. అందుకే నిత్యం వందలాది మంది స్వామి వారిని దర్శించుకునేందుకు అక్కడకు వస్తున్నారు. తమ మొక్కులు చెల్లించుకుంటూ ఆ బొజ్జ గణపయ్యను భక్తి, శ్రద్ధలతో పూజిస్తున్నారు.
ఆలయ పురాణం..!
నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో బైంసా మండలంలో గల మాటేగా గ్రామంలో 2017లో కొరిడి గణేష్ స్వయంభువుగా వెలిశారు. మాటేగాo గ్రామానికి చెందిన ప్రకాష్ పటేల్ అనే ఓ రైతు అతని అంట పొలం పక్కనే ఉన్న చెట్లను కొట్టివేశాడు. వేర్లతో సహా వాటిని పెకిలించి వంట చేసుకునేందుకు వాడుకోవచ్చని ఇంటికి తెప్పించాడు. ఇంటి పక్కనే వాటన్నిటినీ పెట్టి చిన్న చిన్న వాటిని వాడుకున్నారు. అయితే పెద్ద వాటిని మాత్రం వదిలేశారు. ఇదిలా ఉండగా.. ఓరోజు పిల్లలంతా అక్కడ క్రికెట్ ఆడుతున్నారు. పొరపాటున బాల్ ఆ పెద్ద పెద్ద కట్టెల్లో పడిపోయింది. దీంతో దాన్ని తీసుకునేందుకు వచ్చిన పిల్లలకు విగ్రహం ఆకారంలో ఉన్న విఘ్నేశ్వరుడి స్వరూపం కనబడింది. దీంతో పిల్లలందరూ వెళ్లి గ్రామస్థులకు చెప్పారు. వారంతా వచ్చి చూడగా... నిజంగా ఏకదంతుడే దర్శనం ఇచ్చాడు.
గుడిలో వినాయకుడి ఫొటో, నవరాత్రులప్పుడు మాత్రమే విగ్రహ ప్రతిష్టాపన
దీంతో వారంతా కలిసి ఆ గణనాథుడికి ఓ ఆలయం కట్టించారు. కానీ స్వామి వారిని ప్రతిష్టించకుండా.. ఓ చోట భద్రపరిచారు. గర్భగుడిలో ఓ వినాయకుడి ఫొటో తీసుకొచ్చి పెట్టి రోజూ పూజలందిస్తున్నారు. స్వయంభువుగా వెలసిన వినాయక విగ్రహాన్ని మాత్రం.. గణేష్ నవరాత్రుల సమయంలో తీసుకొచ్చి అదే ఆలయంలోని ఓ మండపంలో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. అలాగే గణేష్ నిమజ్జన సమయంలో స్వామి వారి విగ్రహాన్ని తీసుకొని వెళ్లి గణపయ్యకు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. ఆపై నిమజ్జనం చేయకుండా వాగులోని నీటిని స్వామి వారిపై చల్లుతారు. మళ్లీ అదే గణపయ్యను ఆలయంలో భద్రపరుస్తారు. విగ్రహాన్ని లోపల పెట్టి ఫొటోను మందిరంలో పెట్టి ఏడాదంతా పూజ చేయడం ఇక్కడ విశేషంగా భావిస్తారు.
వేలాది మందికి ప్రత్యేక వసతులు కల్పిస్తున్న గ్రామస్థులు
ఈ కొరడి గణేష్ ను వినాయక నవరాత్రుల సమయంలో దర్శించుకునేందుకు వేలాది మంది తరలి వస్తుంటారు. ముఖ్యంగా తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర ప్రజలు కూడా వస్తున్నారు. ఈ కొరిడి గణేష్ ను దర్శించుకుంటే మొక్కిన మొక్కులు, సకల సంకటనలు, ఉద్యోగాలు, వారు వారు చేస్తున్న అభివృద్ధి పనులు అన్నిట్లోనూ అభివృద్ధి ఉంటుందని భక్తులు చెబుతున్నారు. అయితే భక్తులకు ఎలాంటి సమస్యలూ రాకుండా గ్రామస్థులు, వీడీసీ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత భోజన వసతితో పాటు తాగునీరు, బాత్రూంలు అందుబాటులో ఉంచారు. అలాగే ప్రతిరోజూ భక్తి పాటలు, భజనలతో హోరెత్తిస్తున్నారు. కోలాటాలు ఆడుతూ భక్తి పారవశ్యంలో నిండిపోతున్నారు.
Read Also: గణేష్ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం- నిమజ్జనానికి తరలివెళ్తున్న ఖైరతాబాద్ గణపతి