Nirmal News: తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
తడిచిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
నిర్మల్ జిల్లాలో తడిచిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. ఒక్కసారిగా రైతులందరూ కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు గల ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కళ్ళాల్లో పంటలను వేసి నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం తూకం వేయడం లేదన్నారు. ఇప్పటికే సగం పంటలు వర్షానికి కొట్టుకుపోయి రైతులు తీవ్ర నష్టపోయారని, వెంటనే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలు కొనుగోలు చేసే వరకు బిజెపి వారికి అండగా ఉంటుందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ రాంబాబుకు వినతి పత్రం అందజేశారు.
సీఎం కేసీఆర్ నిర్మల్ పర్యటనకు ముందు బహిరంగ లేఖ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ పర్యటనను స్వాగితిస్తూనే, గతంలో ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తోంది బీజేపీ. ఈ మేరకు బీజేపీ నేత, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రాంతానికి చెందిన వేలాది మంది నిరుద్యోగులు గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్నారు, పరిశ్రమలు స్థాపించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పించలేదు అని విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా అనుంబంధ పరిశ్రమలు స్థాపించకుండా నిర్లక్ష్యం చేశారు. ప్రాణహిత, చేవెళ్ల ప్యాకేజీ కెనాల్స్ తో గుంట భూమికి కూడా సాగు నీరు అందివ్వలేదని లేఖలో పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా ఏర్పాటుకై నిర్మల్ జిల్లా సాధన సమితి పేరుతో ఈ ప్రాంత మేధావులు, ఉద్యోగులు, నిరుద్యోగులు జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమించారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నిర్మల్ జిల్లాను ఏర్పాటుచేశారు. కానీ డెవలప్ మెంట్ జరగడం లేదని, రాష్ట్ర ఏర్పాటు ఫలాలు కొంతమంది వ్యక్తులకు, ఒక్క కుటుంబానికి దక్కడం విచారకరం అన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు తీరుపై ప్రశ్నిస్తూ కేసీఆర్ కు లేఖ రాశారు.
నిర్మల్ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. కడెం, ఎస్ఆర్ఎస్పీ, స్వర్ణ, గడ్డెన్న ప్రాజెక్టులున్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వేలాదిమందికి ఉద్యోగాలు లభిస్తాయి. నిర్మల్ నియోజకవర్గం నుంచే 10 వేల మంది యువకులు గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్నారు. 2007లో అప్పటి ప్రాణహిత చేవెళ్ల, ఇప్పటి కాళేశ్వరం పేరుపై 27, 28వ ప్యాకేజీ నిర్మల్, ముథోల్ నియోజకవర్గంలో హైలెవల్ కెనాల్ ప్రారంభించారు. ఇప్పటివరకూ రూ.1000 కోట్లకు పైగా ఖర్చుచేసి కాంట్రాక్టర్లు, నాయకలు వారి కమీషన్ల దందాకే పరిమితమై రైతుల నోట్లో మట్టికొట్టారు. ఒక్క గుంట భూమికి కూడా నీళ్లు అందించలేదు.
నిర్మల్ ప్రజల చిరకాల కోరిక రైల్వేలైన్ హామీ మీరిచ్చిందే ముందు దానిని నెరవేర్చండి. ప్రతి ఎన్నికల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇస్తున్నా తీరని హామీ ఇది. ఉమ్మడి ప్రాజెక్టులో రాష్ట్ర వాటా చెల్లించి రైల్వే లైన్ కు సహకరించండి. టూరిజానికి అనువైన శ్యా్మ్ ఘడ్, బత్తీస్ ఘడ్, సదర్ మహల్, ఇస్సురాళ్ల గుట్ట, ఖిల్ల గుట్ట, నిర్మల్ కొయ్య బొమ్మలు, ఎన్నో కోటలు, బురుజులు, గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. కానీ నిర్వహణ లేక కొన్ని కూలిపోయే దశలో ఉండగా, కొన్ని కబ్జాలకు గురవుతున్నాయని, ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఇక్కడ టూరిజం డెవలప్ మెంట్ చేయాలని కోరారు.