Mancherial Latest News: చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు- స్థానిక సంస్థల్లో భారీ విజయానికి మంత్రి వివేక్ స్కెచ్
Mancherial Latest News: చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి మంత్రి వివేక్ చర్యలు తీసుకుంటున్నారు. మొదటి నుంచి ఉన్న వారిని సముదాయిస్తూ కొత్తవారిని ఆహ్వానిస్తున్నారు.

Mancherial Latest News: తెలంగాణలో మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. ఇందులో భారీ విజయాలు సాధించి తిరుగులేని పార్టీగా కాంగ్రెస్‌ను మార్చాలని నేతలు వ్యూహప్రతివ్యూలు రచిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మంత్రులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పార్టీ పటిష్టానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకే వివిధ పార్టీలలో బలంగా ఉన్న వారిని కాంగ్రెస్‌లో చేరేలా పావులు కదుపుతున్నారు. అదే టైంలో కాంగ్రెస్‌లో మొదటి నుంచి ఉన్న వారిని సముదాయిస్తున్నారు. భవిష్యత్‌పై భోరోసా ఇస్తున్నారు.
ఆగస్టు 15న వేర్వేరు పార్టీలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. మంత్రి వివేక సమక్షంలో చేరికలు జరిగాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌లో గతంలో తనతో పని చేసిన వారిని క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. ప్రజలకు సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి జరగాలంటే కచ్చితంగా కాంగ్రెస్ మరింత బలోపేతం కావాలని మంత్రి ఆకాంక్షిస్తున్నారు. అందుకే కలిసి వచ్చే వారిని పార్టీలో చేర్చుకుంటున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశాల మేరేక చేరికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
కొత్తగా పార్టీలోకి వస్తున్న వారితో ఇప్పటికే ఉన్న వారికి ఎలాంటి నష్టం వాటిల్లదని మంత్రి చెప్పుకొచ్చారు. కచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పాలని మంత్రి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయం సాధించేలా ప్రజల్లో ఉండాలని నేతలకు చెప్పారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోలేదని చాలా మంది స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీపై అలకబూనారు. అలాంటి వారందరిని గుర్తించి వారితో మాట్లాడుతున్నారు. వారికి ప్రాధాన్యత ఇస్తామని మాట ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పని చేయాలని చెబుతున్నారు. స్థానిక సంస్థల్లో గెలుపు గుర్రాలనే గుర్తించి వారికే సీట్లు ఇవ్వాలని సూచిస్తున్నారు. అలాంటి సత్తా ఉన్న నాయకులు ఎవరో బేరీజు వేసుకొని లిస్ట్ రెడీ చేయాలని చెబుతున్నారు.
కాంగ్రెస్‌లో ఉన్న నాయకులతో మాట్లాడటమే కాకుండా ఏ ప్రాంతంలో ఎవర్ని చేర్చుకుంటే పార్టీకి మేలు జరుగుతుందో చర్చిస్తున్నారు. అలాంటి వారితో మంత్రి స్వయంగా మాట్లాడి కలిసి పని చేద్దామని సూచిస్తున్నారు. వారు సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నారు. వారి అభ్యంతరాలను అడ్రెస్ చేస్తున్నారు. కలిసి వచ్చే వారికి కండువాలు కప్పుతున్నారు.
ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోవడంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వారి రాకతో తమకు ఇబ్బంది అవుతుందని అంటున్నారు. పదేళ్ల నుంచి కేసులు, రాజకీయ ఒత్తిళ్లు తట్టుకొని పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సఫలీకృతమయ్యామని ఇప్పుడు వేరే వాళ్లను తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేసే వారికి అన్యాయం జరగబోదని వచ్చే వారితో వచ్చే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి వాళ్లకు మాట ఇస్తున్నారు.
వేర్వేరు పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ "చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే 100 కోట్ల రూపాయల నిధులతో పనులు చేశాము. మరో 400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం,రుణమాఫీ,రైతు భరోసా కల్పించాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచాం. మూతపడ్డ ఆర్ ఎఫ్ సి ఎల్ సంస్థ పునరుద్ధరణ కోసం కృషి చేశాను. ఇప్పుడు అందులో 500 మందికి ఉద్యోగాలు పొందారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. " అని వివరించారు.
తాను ఒక కార్యకర్తగానే పార్టీలో పని చేస్తున్నానని వివరించారు. "నేను నాయకుడిని కాదు మీలా నేను కూడా కార్యకర్తనే. ఇప్పుడు ఉన్న నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన నా కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నాకు ముందు చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం. 24 గంటలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా. ఎప్పుడైనా ఏ సమస్య వచ్చిన నాకు ఫోన్ చేయోచ్చు. ఎమ్మెల్యే గా ఉన్న.. మంత్రి అయ్యిన కూడా నాకు ప్రజలే నాకు ముఖ్యం." అని కార్యకర్తలకు చెప్పుకొచ్చారు.





















