(Source: ECI/ABP News/ABP Majha)
IT Tower Nizamabad: నిజామాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్, రూ.50 కోట్ల వ్యయం - భవనం ప్రత్యేకతలు ఇవీ
IT Tower In Nizamabad: తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధి కల్పనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రగతిని సాధించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది.
IT Tower In Nizamabad: తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు సామాజిక, ఆర్థిక ప్రగతిని సాధించాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో ఐటీ టవర్‌ను నిర్మించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) బుధవారం ఈ ఐటీ టవర్, న్యాక్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను పరిశీలించారు. కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగులతో మంత్రి ముచ్చటించారు.
రూ.50 కోట్లతో నిర్మించిన ఈ టవర్‌లో ప్రభుత్వపరంగా టీఎస్‌ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలను కల్పించింది. ఐటీ సంస్థలను నెలకొల్పబోయే వారితో ఐటీ శాఖతో ఒప్పందం చేసుకుంది. అంతే కాకుండా ఐటీ కంపెనీల్లో ఉద్యోగ నియామక ప్రక్రియను టాస్క్ ఆధ్వర్యంలో జూలై 21న చేపట్టింది. స్థానికంగా ఉద్యోగం కావడంతో యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. అందరికీ నైపుణ్య పరీక్షలు నిర్వహించి అర్హత సాధించిన వారిని ఐటీ కంపెనీలు ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నాయి.
భవనం ప్రత్యేకతలు
గ్రౌండ్ ఫ్లోర్‌తో కలుపుకొని మూడు అంతస్థులతో ఈ నిర్మాణాన్ని నిర్మించారు. మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాన్ని ఆకట్టుకునే రీతిలో చేపట్టారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్ చేశారు. భవిష్యత్ అవసరాల నిమిత్తం మిగిలిన 2.5 ఎకరాల భూమిని కేటాయించారు. రాబోయే కాలంలో ఐటీ టవర్‌ను విస్తరించాలనుకున్న సమయంలో ఎలాంటి స్థలాల కొరత లేకుండా ఉండేందుకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నారు.
నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా న్యాక్
నగరంలోని సమీకృత కలెక్టరేట్ భవనం, ఐటీ టవర్ సమీపంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ సెంటర్‌కు మంత్రి కేటీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా నామకరణం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.6.15కోట్లు నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఏసీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంగణంలో ఉండగా, జగిత్యాల జిల్లాలోనూ ఎన్‌ఏసీ కేంద్రం ఉంది.
అందరి కోసం అందుబాటులోకి
నిజామాబాద్, పరిసర జిల్లాల యువత కోసం నిజామాబాద్ కేంద్రంలోనూ ఎన్‌ఏసీని నెలకొల్పారు. ఇందులో అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఐదు స్మార్ట్ క్లాస్ గదులు, మూడు ప్రయోగశాలలు, 1 కంప్యూటర్ ల్యాబ్, 120 మంది అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యానికి వీలుగా వసతి గృహం, 1 కౌన్సిలింగ్ గది, 1 ప్లేస్‌మెంట్ రూమ్, 8 కార్యాలయ గదులను ఈ కేంద్రంలో నిర్మించారు. భవన నిర్మాణాన్ని జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మించారు. ప్రతి ఫ్లోర్ 12,519 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా మొత్తం 37,557 చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది.
చదువుతో సంబంధం లేకుండా శిక్షణ
ఇక్కడ చదువుతో సంబంధం లేకుండా స్వయం ఉపాధిపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తారు. మేసన్ జనరల్, అసిస్టెంట్ బార్ బెండర్ అండ్ స్టీల్ ఫిక్చర్, షట్టరింగ్ కార్పెంటరీ, కన్‌స్ట్రక్షన్ పెయింటర్ అండ్ డెకొరేటర్, అసిస్టెంట్ టెక్నీషియన్ డ్రై వాల్ అండ్ ఫాల్స్ – సీలింగ్, అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, ప్లంబర్(జనరల్), అసిస్టెంట్ సర్వేయర్, అసిస్టెంట్ వర్క్ సూపర్‌వైజర్, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డర్, అసిస్టెంట్ స్టోర్ కీపర్ అండ్ స్టోర్ కీపర్, సూపర్‌వైజర్ స్ట్రక్చర్, టైలరింగ్ వంటి వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తారు.