KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు అర్థమేంటి!
Telangana Minister KTR Praises Balka Suman: చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. మంత్రి అయితే భవిష్యత్తులో ఇంకా అద్భుతాలు చేస్తాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Telangana Minister KTR Praises Balka Suman:
మందమర్రి: కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ అడుగుతోందని, గతంలో 11 ఛాన్సులు ప్రజలు ఇచ్చారని.. 60 ఏళ్లలో ఏమీ చేయని మీరు ఇప్పుడు ఆరు గ్యారెంటీలతో కొత్త నాటకం మొదలుపెట్టారని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతకుముందు మంచిర్యాల జిల్లాలో 313 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మంత్రి కేటీఆర్ చేశారు. బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను ప్రశంసించారు. మంత్రి అయితే భవిష్యత్తులో ఇంకా అద్భుతాలు చేస్తాడని బాల్క సుమన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాల్క సుమన్ గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. ఓయూ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. మంత్రులుగా ఉన్న వాళ్లు చేయని పనులను నియోజకవర్గానికి బాల్క సుమన్ చేసి చూపించారని చెన్నూరు ఎమ్మెల్యేను కేటీఆర్ కొనియాడారు. పాలిటిక్స్ లోకి ఇలాంటి వారు రావాలని, ప్రజల కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. బాల్క సుమన్ భవిష్యత్తులో మంత్రి అవుతారంటూ హింట్ ఇచ్చారు కేటీఆర్. బాల్క సుమన్ ఎమ్మెల్యేగా ఉంటేనే ఇన్ని పనులు చేస్తున్నారని, భవిష్యత్తులో మంత్రి అయితే మరిన్ని అద్భుతాలు చేస్తాడని కొనియాడారు.
70 లక్షల రైతుల ఖాతాల్లో 73 వేల కోట్లు జమ చేశామన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తలేమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంటున్నారు. మీకు ఇష్టం ఉన్నప్పుడు చెన్నూరు నియోజకవర్గానికి పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి.. ఎక్కడ కావాలంటే అక్కడ కరెంట్ తీగల్ని గట్టిగా పట్టుకోవాలని దేశానికి పట్టిన దరిద్రం పోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులు చనిపోతే పట్టించుకోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఇక్క ఛాన్స్ అంటూ కొత్తగా పాలన కోసం ఎదురుచూస్తున్నారా అని ప్రశ్నించారు. 60 ఏళ్లలో మీరు చేయని పనులు, మేం 10 ఏళ్ల పాలనలో చేశామన్న కారణంగా బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకుంటారా అని ప్రశ్నించారు.
పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన చేసిన మంత్రి కేటీఆర్
అంతకుముందు మంత్రి కేటీఆర్ కు మంచిర్యాల జిల్లాలో ఘన స్వాగతం లభించింది. మంత్రి కేటీఆర్ కు ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మేల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. మంచిర్యాల కలెక్టర్ బాదావత్ సంతోష్, రామగుండం కమిషనర్ రెమా రాజేశ్వరి ఇతర అధికారులు సైతం మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా.. మందమర్రి మున్సిపాలిటీలో రూ.500 కోట్లతో మందమర్రి మండలం శంకరపల్లి వద్ద నిర్మించే పామాయిల్ ఫ్యాక్టరీ భూమి పూజ చేశారు. ఆపై మందమర్రి పట్టణంలో కోటి రూపాయలతో నిర్మించిన కేసీఆర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ భవనం, 2 కోట్లతో మందమర్రి పట్టణంలో నిర్మించిన సమ్మక్క - సారలమ్మ మహిళా భవన్, 5 లక్షలతో నిర్మించిన బతుకమ్మ గ్రౌండ్ , రూ.29.68 కోట్లతో మందమర్రి పట్టణంలో నిర్మించిన 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, ఎమ్మెల్యేలునడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.