Sirpur Hospital Inauguration: బీజేపీ హటావో, సింగరేణి బచావో - మరో పోరాటానికి సిద్ధపడాలన్న మంత్రి హరీష్‌రావు
Sirpur Hospital Inauguration:: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 30 పడకల ఆస్పత్రిని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. బీజేపీ హటావో, సింగరేణి బచావో నినాదంతో మనం సింగరేణి కాపాడుకుందామన్నారు.
Sirpur Hospital Inauguration: ఒకప్పుడు వైద్యం కోసం ఉత్తర తెలంగాణ ప్రజలు మహారాష్ట్రకు వెళ్లే వాళ్లని... కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వస్తున్నారని అన్నారు మంత్రి హరీష్‌రావు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 5 కోట్ల రూపాయలతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రి ప్రారంభించిన సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు కీలక కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. సీఎం
కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని.. ఇందులో భాగంగానే కొత్తగా న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడం ప్రారంభించారని చెప్పుకొచ్చారు. గర్భిణులకు ఇది వరంగా మారతుందన్నారు. బిడ్డ పుట్టాక కేసీఆర్ కిట్, పుట్టక ముందు తల్లికి న్యూట్రిషన్ కిట్.. ఇలా పుట్టుక నుంచి చావు దాకా ప్రతీ విషయాన్ని ఆలోచించే నాయకుడే సీఎం కేసీఆర్ అని వివరించారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆలోచన మేరకు కిట్ లో పల్లి పట్టీ పెట్టాలని చెప్పినట్లు తెలిపారు.
Addressing the gathering after Inauguration of 100 Bedded area hospital & Dialysis Center at Bellampally https://t.co/C5KbN7E9xc
— Harish Rao Thanneeru (@trsharish) December 29, 2022
మొన్న మంచిర్యాలలో మెడికల్ కాలేజీ ప్రారంభించామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఆసిఫాబాద్, నిర్మల్ లో కొత్తగా మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. నాడు వైద్యం కోసం ఇక్కడి ప్రజలు మహారాష్ట్రకు వెళ్లే వాళ్లని... కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నాడు మూడు డయాలసిస్ సెంటర్లు ఉంటే ఇప్పుడు 102 పెంచామన్నారు. మంచిర్యాల, అదిలాబాద్, నిర్మల్‌లో ఇప్పటికే ప్రారంభించామని.. వారం రోజుల్లో కాగజ్ నగర్‌లో చేస్తామని స్పష్టం చేశారు. ఏడాదికి వంద కోట్లు ఖర్చు పెట్టి డయాలసిస్ ఉచిత సేవలు అందిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి తాగు నీరు ఇచ్చామన్నారు.
నాడు గూడెం, తండాలు మంచాన పడ్డాయంటే బాధ అనిపించేదన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని మంత్రి తెలిపారు. 2014కు ఇప్పుడు చూస్తే, డయేరియా 8071 కేసులు ఉంటే ఈ ఏడాది 1100, మలేరియా కేసులు 6196 నమోదు అయితే 77 కు తగ్గాయన్నారు. బీపీ, షుగర్ ముందే తగ్గించేలా స్క్రీనింగ్ చేస్తున్నామని వివరించారు.
మొన్ననే 950 డాక్టర్ల నియామకం పూర్తి చేశామన్నారు. ఎల్లుండి 31 తేదీన అందరికీ ఆర్డర్స్ ఇస్తామన్నారు. ఇందులో ఆసిఫాబాద్ జిల్లాకు ప్రాధాన్యం ఇస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అన్ని పీహెచ్సీల్లో ఖాళీలు నింపుతామన్నారు. పల్లె దవాఖానలు వస్తున్నాయన్నారు. 90 ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చి డాక్టర్ భర్తీ చేస్తామన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని వివరించారు. మన పథకాలు కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారని వివరించారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నారన్నారు. ఢిల్లీలో కాపీ కొడతారు, గల్లీకి వచ్చి తిడతారని బీజేపీ లీడర్లపై మండిపడ్డారు హరీష్‌రావు. ప్రధానమంత్రి వచ్చి రామగుండంలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారన్నారు. గుజరాత్ కి ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి అని అన్నారు. సింగరేణిని ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి వివరించారు. నాలుగు గనులు ఎలా ప్రైవేటు పరం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ హటావో సింగరేణి బచావో అని మనం పోరాటం చేయాలన్నారు. పనులు చేసేది ఎవరు, పన్నులు వేసేది ఎవరో ప్రజలు ఆలోచించాలన్నారు.