Kamareddy News: "ఎమ్మెల్యేగారు మీరు రాజీనామా చేయండి - నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది"
Kamareddy News: కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి.. మీరు రాజీనామా చేయండి, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని మాట్లాడుతున్న ఓ ఆడియో బయటకు వచ్చింది.
Kamareddy News: కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు.. జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు పోన్ చేసి... ఎమ్మెల్యేగారూ మీరు రాజీనామా చేయండి, అప్పుడే నియోజక వర్గం అభివృద్ధి చెందుతుందంటూ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో ప్రస్తుతం స్థానికంగా వైరల్ గా మారింది.
జిల్లాలోని ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసిన యువకుడు.. "మీరు రాజీనామా చేస్తే.. మునుగోడులో మాదిరిగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం.. నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది" అని పేర్కొన్నాడు. అయితే ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే... మునుగోడులో రాజీనామా చేసిన వ్యక్తి గెలిచాడా అని ప్రశ్నించారు. అలాగే నీ నియోజక వర్గం ఏంటి.. పది నిమిషాల్లో నీ దగ్గరకు మా వాళ్లు వస్తారని సమాధానం ఇచ్చారు. అయితే తమ ప్రజాప్రతినిధి రాజీనామా చేయాలని యువకుడు ప్రశ్నించడంపై ఆగ్రహం చెందిన టీఆర్ఎస్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు సదరు యువకుడితోపాటు ఆయన స్నేహితుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది. అయితే యువకుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు... తప్పైపోయింది, క్షమించండంటూ ఎమ్మెల్యేను కోరినట్లు సమాచారం.
మునుగోడు ఉపఎన్నిక టైంలో కూడా ఇాలాంటి ఒత్తిడి
తెలంగాణలో ప్రతి ఆరు నెలలకు ఓ ఉపఎన్నిక వస్తుంది. ఉపఎన్నిక వచ్చిన నియోజకవర్గం దశ తిరిగిపోతోంది. అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే రాజీనామా చేసిన దగ్గర్నుంచి నియోజకవర్గం మొత్తం ఎక్కడ చూసినా విచ్చలవిడిగా డబ్బుల ఖర్చు కనిపిస్తోంది. ప్రజలకు ఓటర్లకు రాచమర్యాదలు అందుతున్నాయి. దీంతో తమ నయోజకవర్గానికీ ఉపఎన్నిక రావాలని కోరుకునేవారి సంఖ్య పెరుగుతోంది. నేరుగా ఎమ్మెల్యేలకే కాల్ చేసి అడుగుతున్నారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలా ఫోన్ చేసి అడగడమే కాదు.. ఆ కాల్స్‌ను సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు.
ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్న ఓటర్లు !
మెదక్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జహీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్ రావు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. తమ నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల నుంచి ఇలాంటి ఫోన్ కాల్స్ అందుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే..మునుగోడు నియోజకవర్గం తరహాలో తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు త్వరగా జరుగుతాయని వారు ఎమ్మెల్యేకు సూచిస్తున్నారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని కోరాడు. రాజీనామా చేస్తే మునుగోడు నియోజకవర్గం తరహాలో తమకు లబ్ధి చేకూరుతుందని విజ్ఞప్తి చేశాడు. సీఎం కేసీఆర్ ను అడిగి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే సర్ది చెప్పాల్సి వచ్చింది. అందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కు అల్లాదుర్గం మండలం మాందాపూర్ గ్రామం నుంచి కృష్ణ అనే వ్యక్తి ఫోన్ చేసి రాజీనామా కోరాడు. ఇప్పటికే తన నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేపట్టానని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.. సదరు వ్యక్తికి నచ్చజెప్పాడు.