Rs 11 Crore Electricity Bill: రూ.11.41 కోట్ల కరెంట్ బిల్లు చూసి ఆ గ్రామానికే షాక్ కొట్టింది ! ఎక్కడో కాదండోయ్
Rs.11.41 Crores Current Bill: ఓ గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఏకంగా కోట్ల రూపాయల కరెంట్బిల్లు వచ్చింది. జనవరి నెల కరెంట్ బిల్లు చూసి గ్రామ సర్పంచ్, కార్యదర్శి కంగుతిన్నారు.
సాధారణంగా కరెంట్ బిల్లు వచ్చే సమయంలో గత నెల అంత వస్తే చాలు, యూనిట్లు పెరిగి ఎక్కువ బిల్లు వస్తే జేబుకు చిల్లు అని అనుకుంటాం. కానీ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ గ్రామ పంచాయతీ ఆఫీసుకు ఏకంగా రూ.11.41 కోట్ల కరెంట్ బిల్లు రావడంతో షాకవడం ఉద్యోగులు, సర్పంచి, కార్యదర్శి వంతయింది. ఆ వివరాలిలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీ ఉంది. ఆ పంచాయతీ కార్యాలయానికి ప్రతినెల తరహాలోనే జనవరి నెల కరెంట్ బిల్లు వచ్చింది. కానీ ఆ బిల్లు చూసిన సర్పంచ్, కార్యదర్శికి మాత్రం గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే కొత్తపల్లి గ్రామ పంచాయతీకి జనవరి నెలకుగానూ రూ.11,41,63,672 (11 కోట్ల 41 లక్షల 63 వేల 6 వందల 72 రూపాయలు) విద్యుత్ బిల్లు వేశారు. వందలు, వేలల్లో రావాల్సిన కరెంట్ బిల్లు కోట్ల రూపాయల్లో రావడంతో గ్రామానికే షాక్ కొట్టినట్లు అయింది. వామ్మో ఇదేంది.. ఈ రేంజ్ లో కరెంట్ బిల్లులు వసూలు చేస్తున్నారా అంటూ గ్రామస్తులు షాక్ అయ్యారు.
విద్యుత్ శాఖ అధికారులను నిలదీసిన గ్రామస్తులు
వందలు, వేల రూపాయల్లో రావాల్సిన కరెంట్ బిల్లు రికార్డు స్థాయిలో కోట్ల రూపాయల్లో పంచాయతీ ఆఫీసుకు జనవరి నెల కరెంట్ బిల్లు రావడంతో విద్యుత్ అధికారులను పంచాయతీ పాలక వర్గం, కార్యదర్శి, సర్పంచి నిలదీశారు. గ్రామాన్ని డెవలప్ చేయడానికి నిధులు లేక మేం సతమతం అవుతుంటే, ఎనర్జీ ఛార్జీలు 11 కోట్ల రూపాయలు వేశారని, ఇతరత్రా ఛార్జీలు కలిపితే మొత్తం రూ.11.41 కోట్ల బిల్లు వచ్చిందని మాచారెడ్డి ఏఈ వెంకటరమణను వివరణ కోరారు. సాంకేతిక సమస్య కారణంగా బిల్లు కోట్ల రూపాయల్లో వచ్చిందని, మీటర్ రీడింగ్ చెక్ చేసి బిల్లును పునరుద్ధరిస్తామని ఏఈ చెప్పడంతో గ్రామ సర్పంచ్, కార్యదర్శి ఊపిరి పీల్చుకున్నారు. కానీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా భారీ బిల్లులు వస్తున్నాయని, బిల్లు చూసి ఎవరికైనా అకస్మాత్తుగా ఏమైనా జరిగితే ఎవరూ బాధ్యత వహిస్తారని సంబంధిత శాఖ ఉన్నతాధికారులను గ్రామస్తులు, అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కాకా హోటల్ కు రూ.కోట్లలో కరెంట్ బిల్లు...
కాకా హోటల్ కు కోట్ల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో చోటుచేసుకుంది. బిల్లు చూసి నిర్వాహకులు షాక్ తిన్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి కొత్త బస్టాండు సమీపంలో ఉన్న చిన్నపాటి టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నారు ముళ్లగిరి మంగమ్మ. సెప్టెంబర్ నెలకు సంబంధించి రూ.కోట్లలో విద్యుత్తు బిల్లు రావడంతో ఆమె అధికారులకు ఫిర్యాదుచేశారు. సాధారణంగా ప్రతి నెలా రూ.700 వరకు బిల్లు వస్తుండేది. కానీ గత రెండు నెలలుగా వేల రూపాయల్లో బిల్లు వస్తుంది. ఆగస్టులో రూ.47,148 బిల్లు రావడంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. మీటరులో లోపం ఉందంటూ విద్యుత్తు సిబ్బంది కొత్త మీటర్ బిగించారు. ఈసారి ఏకంగా కోట్లలో బిల్లు వచ్చింది. సెప్టెంబరులో రూ.21,48,62,224 బిల్లు రావడంతో మంగమ్మ మళ్లీ అధికారులకు మొరపెట్టుకున్నారు. సాంకేతిక లోపంతో ఇంత బిల్లు వచ్చి ఉంటుందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని విద్యుత్ అధికారులు తెలిపారు.