Kamareddy News: పగలు క్లాస్ రూం- రాత్రి హాస్టల్- కామారెడ్డిలో వింత పరిస్థితి
నత్తనడకన కేజీబీవీ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. రూ. కోటి 50 లక్షల నిధులు కేటాయించినా పనులు ముందుకు సాగడం లేదు.
ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. విద్యార్థులకు చదువుకునేందుకు సరైన తరగతి గదుల్లేవు. తరగతి గదుల్లోనే హాస్టల్ రూంలు ఇవ్వటంలో కేజీబీవి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మద్నూర్‌లో 8 ఏళ్ల క్రితం కేజీబీవీ నూతన భవనం మంజూరు చేసింది ప్రభుత్వం. జుక్కల్ వెనుకబడిన నియోజకవర్గం కావటంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న ఉద్దేశంతో కేజీబీవీ భవన నిర్మాణం కోసం సుమారు కోటి 50 లక్షల రూపాయలతో శ్రీకారం చుట్టారు.
రోజులు గడుస్తున్నా భవన నిర్మాణం పనులు పూర్తి కావడం లేదు. మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి. గత ఎనిమిదేళ్లుగా కేజీవీబీ భవన నిర్మాణం పనులు నడుస్తూనే ఉన్నాయ్. భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు ఇటు ప్రజా ప్రతినిధులకు, అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకొచ్చిన ఫలితం లేకుండా పోయింది. 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ భవన నిర్మాణం పూర్తి కాలేదు. మద్నూర్‌లోని కేజీబీవీలో దాదాపు 250 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వారికి తరగతి గదులు, హాస్టల్ పాత భవనంలోనే నిర్వహిస్తున్నారు. క్లాస్ రూంలో పగలు చదువుకోవటం రాత్రికి అవే గదుల్లో నిద్రపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో విద్యార్థినిలు చాలా ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికే తమ సమస్యలను విద్యార్థులు అధికారుల దృష్టికి చాలా సార్లు తీసుకువచ్చారు. అయినా ఫలితం లేదని వాపోతున్నారు. 8 సంవత్సరాల నుంచి ఒక చిన్న భవనంలో పాఠశాల, వసతి గృహం ఒక్కటే ఉండటంతో విద్యార్థులు చదువులు సరిగ్గా సాగటం లేదని అంటున్నారు. ఇబ్బందులు ఎదురైనా విద్యార్థినిలు అడ్జెస్ట్ అవుతున్నారు.
సరైన భవనం లేక విద్యార్థులు, బోధన సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.. ప్రజా ప్రతినిధులు నియోజకవర్గానికి వస్తున్నప్పుడు విద్యార్థుల ఇక్కట్లు చూసి వెళ్తున్నారే తప్ప కేజీబీవీ కోసం నిర్మిస్తున్న కొత్త భవనం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు మాత్రం తీసుకోవటం లేదుని... తాము పడుతున్న ఇబ్బందులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదని విద్యార్థులు చెబుతున్నారు.
ఈ విషయంపై విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. తమ పిల్లలు కేజీబీవీ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తారని ఎంతో ఆశతో చేర్పిస్తే... ఇక్కడ మాత్రం కనీస వసతులు లేక ఆడపిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా కేజీబీవీ భవన నిర్మాణం పనులను వేగవంతం చేసి ఈ వర్షాకాలంలో విద్యార్థులు పడే బాధలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తరగతి గదులు, హాస్టల్ ఒకే గదుల్లో ఉండేటంతో స్టడీ మీద దృష్టి పెట్టలేక పోతున్నామని విద్యార్థులు అంటున్నారు. కనీసం మరుగుదొడ్ల వసుతులు కూడా సరిగ్గా లేవు. మంచి నీటి ఇబ్బందులు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు.