Christmas 2025: ఆదిలాబాద్ జిల్లాలోని చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుకున్నారంటే?
Christmas 2025: ఇంద్రవెల్లిలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. చర్చీలో ఫాదర్ పి.ఎల్. జోసెఫ్ ఆధ్వర్యంలో ప్రార్ధనలు చేశారు.

Christmas 2025: ఆదిలాబాద్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలను రంగు రంగుల విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. చర్చిలో క్రిస్మస్ ట్రీ.. పశువుల పాకలను రంగు రంగుల విద్యుత్ కాంతులతో అందంగా వివిధ రకాల సెట్టింగులతో ఏర్పాటు చేశారు. క్రీస్తు జన్మదినం సందర్భంగా శాంటా క్లాజ్ వేషధారణతో సందడి చేస్తూ కనిపించారు. అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించుకుని తెల్లవారుజామున చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించే క్రిస్మస్ సంబరాలపై abp దేశం ప్రత్యేక కథనం.

క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ వేడుకలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు తమ ప్రార్థన మందిరాలకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనల నడుమ చర్చి ఫాదర్ బైబిల్ బోధనలు చేశారు. అర్థరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. ఆపై చర్చిలో ప్రార్థనలు చేసుకొని బైబిలు బోధనలు విన్నాక వాయిద్యాల నడుమ క్రీస్తు జన్మదిన భక్తి పాటలు పాడుతూ సందడి చేశారు. అందరు ఒకరికొకరు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలోనీ రోమన్ క్యాథలిక్ చర్చిల్లో ప్రత్యేకంగా ఈ వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు. చర్చిలను అందంగా విద్యుత్ కాంతులతో అలంకరించారు. పరిసర ప్రాంతాల్లో చర్చి లోపల వివిధ సెట్టింగ్లతో పశువుల పాకలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో చర్చి ఫాదర్ అజ్జు మూలవరిక్కల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అయితే క్రిస్మస్ సందర్భంగా ముఖ్య అతిథిగా బిషప్ టచ్చప్ పరంభత్ హాజరై బైబిల్ బోధనలు చేస్తూ క్రిస్మస్ వేడుక గురించి వివరించారు. ప్రార్థన అనంతరం క్రీస్తు జన్మదిన పాటలు పాడుతూ సందడి చేశారు.

ఇంద్రవెల్లిలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో ఫాదర్ పి.ఎల్.జోసెఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అర్ధరాత్రి 12గంటల సమయంలో క్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆపై అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రిస్మస్ వేడుకలకు వివిధ ప్రాంతాలకు చెందిన క్రైస్తవులు చర్చికి వచ్చి ప్రత్యేక ప్రార్ధనలు చేసి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా చర్చిలో వివిధ సెట్టింగ్లతో నిర్మించిన పశువుల పాకలలో సందడి చేస్తూ సెల్ఫీలు దిగారు. ఈ క్రిబ్ లైటింగ్ సెట్టింగ్ అందరిని ఆకట్టుకున్నాయి. క్రీస్తు జన్మదిన పాటలను పెడుతూ కేరింతలు మధ్య నృత్యాలు చేశారు. ప్రార్థనలు ముగిశాక చర్చి అవరణలో టపాసులు పేల్చారు. చలి ప్రభావం కారణంగా చలిమంటల మద్య చుట్టూ అక్కడే ర్యాలీ నిర్వహించారు. ఆపై చర్చి ఫాదర్ ఆద్వర్యంలో ప్రత్యేక క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.. మేరీ మేరీ క్రిస్మస్ అంటూ సందడి చేశారు.

వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు క్రైస్తవులు క్రిస్మస్ సందర్భంగా తమ అభిప్రాయాలను ఎబిపి దేశంతో వెల్లడించారు. క్రిస్మస్ సందర్భంగా తమ పిల్లాపాపలతో కుటుంబ సమేతంగా చర్చికి తరలివచ్చి చర్చి ఫాదర్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు ప్రార్థనల్లో పాల్గొని క్రీస్తు జన్మదినం సందర్భంగా పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటామనీ పలువురు వెల్లడించారు. క్రీస్తు మానవుడి రూపంలో వచ్చిన దేవుడు అని నమ్మకంతో ప్రతి ఏటా కూడా అందరూ బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఈ క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటామని తెలిపారు.

కేరళ నుంచి కేశవ - భాను కుమార్ అనే దంపతులు ఇంద్రవెల్లిలోని చర్చికి వచ్చి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. తాము ఇక్కడే చదువుకొని బాగుపడ్డామని, ఉపాధి నిమిత్తం ఆదిలాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోనీ త్రిశూర్ ప్రాంతానికి వెళ్లడం జరిగిందని, అయితే క్రిస్మస్ పండుగ సందర్భంగా తిరిగి ఇక్కడికి వచ్చి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉన్న ఊరు పుట్టిన ఊరులో వేడుకల్లో పాల్గొనడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, పాత పరిచయస్తులను అందరిని కలుస్తూ ఎంతో సమరంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నామన్నారు.

ఇంద్రవెల్లిలోని రోమన్ క్యాథలిక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చీలో ఫాదర్ పి.ఎల్. జోసెఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీస్తు పాపుల రక్షకుడని మానవ రూపంలో వచ్చిన దేవుడని అందరూ భక్తిశ్రద్ధలతో ప్రతి ఏటా డిసెంబర్ 25 నాడు క్రిస్మస్ పండుగను జరుపుకోవడం ఈ వేడుకల్లో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని క్రిస్మస్ సందర్భంగా ఆ క్రీస్తు దేవున్నీ ప్రార్థిస్తున్నానన్నారు.






















