Nizamabad News: నిజామాబాద్ జిల్లాలో రగులుతున్న రాజకీయం, పార్టీల మధ్య ఫ్యాక్షన్ తరహా ఫైట్
ఫ్యాక్షన్ రాజకీయాలను తలపిస్తున్న ఇందూరు జిల్లా. ఇటీవల తరచూగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పరస్పర దాడులు. బీజేపీ నాయకులు వెళ్తున్న చోట్ల అడ్డుకుంటున్న అధికార పార్టీ నాయకులు.
నిజామాబాద్ జిల్లాలో పాలిటిక్స్ ఫ్యాక్షన్ రాజకీయాలను తలపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నాయకులు గ్రామాల్లోకి వెళ్తుంటే టీఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారు. ఎంపీ అర్వింద్ ధర్మపురి పర్యటనలపై టిఆర్ఏస్ ఫోకస్ చేయడంతో రాజకీయరగడ ముదురుతోంది.
ధర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కోసం ఎంపీ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సందర్భంగా బిజేపి, టిఆర్ఏస్ బాహాబాహీకి దిగాయి. దీంతో ఎంపీ వర్సెస్ టిఆర్ఏస్ ఆధిపత్యపోరు మళ్లీ మొదటికొచ్చింది. జిల్లాలో ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఎంపీ పర్యటనలకు అధికార టిఆర్ఏస్ అడ్డుతగులుతోంది.
సిఏం బర్త్ డే వేడుకల సభలో ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేల బహిరంగ వ్యాఖ్యలను సుమోటోగా పోలీస్ కేసు నమోదు చేయాలని బిజేపీ డిమాండ్ చేస్తోంది. టిఆర్ఏస్ సభ విజువల్స్ ఎమ్మెల్యేల స్పీచ్ వీడియోలతో పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి బిజేపి రీ కంఫ్లైంట్ చేసింది. ఇప్పటికే రాష్ట్ర గవర్నర్, లోకసభ స్పీకర్, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ లకు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ లిఖితపూర్వకంగా కంఫ్లైంట్ చేశారు. డిజిపి, ఛీఫ్ సెక్రటరీ, నిజామాబాద్ పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు ఇవ్వడంతో ఇష్యూ సెంట్రల్‌కు వెళ్లింది.
ధర్పల్లిలో ఎంపీ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. టిఆర్ఏస్ నాయకులు బిజేపీ కార్యకర్తలను అడ్డుకుని బీభత్సం చేశారు. పరస్పర బాహాబాహీలో పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసుల గాయాలపై పోలీస్ శాఖ ఎలా రియాక్ట్ అవుతుందోనన్న ఆసక్తి కూడా ఉంది.
సీఎం కేసీఆర్‌పై అనుచిత వాఖ్యలు చేస్తే దాడులు తప్పవంటున్న జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాఖ్యలు మరింత కాక రాజేస్తున్నాయ్. మొదట ఇందాల్వాయ్ మండలం గన్నారం గ్రామంలో ఎంపీ అరవింద్‌పై మొదలైన దాడుల పర్వం ఆర్మూర్ నియెజకవర్గం నందిపేట్ మండలం, ఇస్సాపల్లి, ధర్పల్లి మండల కేంద్రం ఇలా వరుసగా అరవింద్ వెళ్తున్న చోట్ల టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న దాడులు రాజకీయంగా కాకరేపుతున్నాయ్.
బీజేపీ కూడా తగ్గేదే లే అంటోంది. ఎమ్మెల్యే ల ప్రొగ్రామ్స్ లో ఎంపీకి ఆహ్వానంలేకపోవడంతోనే పోటాపోటీ కార్యక్రమాలు చేపడుతోంది. ఇది కొన్ని చోట్ల ఘర్షణలకు దారితీస్తోంది. ఆర్మూర్ మండలం ఇస్సాపల్లిలో జనవరి 25వతేదనీ ఎంపీ కాన్వాయ్ పై దాడి జరిగింది. డిసెంబర్ 26వ తేదీన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని గన్నారంలో ఎంపీ అర్వింద్ కాన్వాయ్ ను టిఆర్ఏస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. నిన్న ఈనెల 19న ధర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు ఎంపీ అర్వింద్ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎంపీ పర్యటనకు టిఆర్ఏస్ కార్యకర్తలు మొహరించగా బిజేపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట లాఠీఛార్జ్ జరిగింది. రెండు నెలల్లో మూడు సార్లు ఎంపీ పర్యటనను టిఆర్ఏస్ శ్రేణులు అడ్డుతగులుతున్నాయి.
జిల్లా పోలీస్ కమిషనరేట్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఎంపీ కాన్వాయ్ పై మరణాయుధాలతో దాడికి పాల్పడడం సంచలనం రేపింది. ఈ వరుస దాడులపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఢిల్లీలో కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఇక ముందు ముందు ఎలాంటి విపత్కార పరిస్థితులు చూడాల్సి వస్తుందోనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.