Nizamabad News: జనవరి 10 కల్లా అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు
గడువులోపు డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాలు పూర్తి కావాల్సిందే. జనవరి 10 లోపు లబ్దిదారులకు అన్ని వసతులతో ఇళ్లు ఇవ్వాలి. కాంట్రాక్టర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్. నిజమైన అర్హులకే పంపిణీ చేసేందుకు కసరత్తు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఈ అంశంపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జనవరి 10 నాటికే డబుల్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి పంపిణీకి అన్ని విధాలుగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణాలతో పాటు నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, డ్రైనేజీ, అప్రోచ్ రోడ్లు వంటి కనీస మౌలిక సదుపాయాలను సమకూర్చాలని సూచించారు కలెక్టర్. నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓల నేతృత్వంలో ఆయా మండలాల తహసీల్దార్లు తమతమ నియోజకవర్గ శాసన సభ్యులను సంప్రదించి వారిని భాగస్వాములు చేయాలని అన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తుల సమగ్ర వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి గందరగోళానికి తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. మూడు రోజుల పాటు కార్యదర్శులచే దరఖాస్తులు స్వీకరించి, వాటిని తమకు పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు. దరఖాస్తులను తాము ప్రభుత్వ పరిశీలనకు పంపిస్తామని, అక్కడి నుంచి ఆమోదం లభించిన మీదట ఇళ్ల సంఖ్య కంటే లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేయాలని సూచించారు.
ఇప్పటికే జిల్లాలో 3031 డబుల్ బెడ్ రూంలు పూర్తయ్యాయి. తుది దశలో ఉన్న మిగతా 3,849 ఇళ్ల నిర్మాణాలను సైతం జనవరి 10వ తేదీలోపే పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. నిర్మాణాలకు అవసరమైన ఇసుకను సమకూర్చుకునేందుకు తోడ్పాటును అందించాలని తహసీల్దార్లకు సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ల పంపిణీ కోసం ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నందున పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు దాటకుండా పనులు పూర్తయ్యేలా ప్రతి రోజు పర్యవేక్షణ జరపాలన్నారు.
నిజమైన లబ్ధిదారులకే ఇళ్ల పంపిణీ...
ఆర్హులను ఎంపిక చేయడానికి దరఖాస్తుదారుల స్థితిగతులు, గతంలో ఇళ్ల పంపిణీ పథకంలో లబ్దిపొంది ఉన్నారా లేదా అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను తమకు కేటాయించాలని జిల్లావ్యాప్తంగా దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. నిర్మించిన ఇళ్ల సంఖ్య తక్కువగా ఉండటం, అప్లికేషన్ పెట్టుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అర్హుల ఎంపిక అధికారులకు ఇబ్బందికరంగా ఉంది. ఈ తరుణంలో దరఖాస్తుదారుల ఆర్థికస్థితి.. నిజంగా ఆర్హులైనవారు దరఖాస్తు చేసుకున్నారా, అనర్హులు ఉంటే వారిని ఎలా తొలగించాలని అనే విధంగా దరఖాస్తుదారుల పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
రెవెన్యూ అధికారులు ప్రతి దరఖాస్తు దారుని ఇంటికి వెళ్లి వారి స్థితిని పరిశీలించి వివరాలను నమోదు చేస్తున్నారు. గతంలో కొన్ని చోట్ల ఇళ్లను పంపిణీ చేయగా డ్రా పద్దతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈసారి ఎక్కువ మొత్తంలో ఇళ్లను పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పుడు ఎలా అర్హులను ఎంపిక చేయాలో ప్రభుత్వం మార్గద ర్శకాలను జారీ చేస్తే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.