Bhatti Vikramarka: మిషన్ భగీరథ నీళ్లెక్కడ? ట్యాంకులకు రంగులేసి, కనెక్షన్లు మరిచారు!: సీఎల్పీ నేత భట్టి
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఇంద్రవెల్లి మండలంలో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు దస్నాపూర్ గ్రామస్తులు తమ తాగు నీటి కష్టాలను వివరించారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ప్రజలు తమ కష్టాలు చెప్పుకునేందుకు బారులు తీరుతున్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా ఇంద్రవెల్లి మండలంలో పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్కకు దస్నాపూర్ గ్రామస్తులు తమ తాగు నీటి కష్టాలను వివరించారు. ఆయనకు ప్రత్యక్షంగా తాము పడుతున్న ఇబ్బందులను చూపించారు. ఇప్పటికీ చేదబావి నీళ్లే తాగుతున్నామని రక్షిత మంచినీళ్లు తమకు లేవని వారు వివరించారు. చేదబావి నుంచి నీళ్లను తోడుకుని.. వాటిని వడకట్టి తాగుతున్నామని.. దీనివల్ల తమకు అనారోగ్యాలు వస్తున్నాయని భట్టికి వివరించారు.
ట్యాంకులలకు రంగులేసి, కనెక్షన్ మరిచారు
మిషన్ భగీరథ ట్యాంకులు ఉన్నాయని భట్టి విక్రమార్క ప్రజలను అడగగా.. పాత ట్యాంకులకు రంగులేసుకుని.. బిల్లులు తీసేసుకున్నారు కానీ, నల్లా కనెక్షన్లు ఇవ్వలేదని స్థానికులు వాపోయారు. కాంగ్రెస్ పార్టీ మరి కొన్ని నెలల్లో అధికారంలోకి వస్తుంది. రాగానే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని భట్టి విక్రమార్క వారికి హామీ ఇచ్చారు.
పిట్టబొంగరానికి చేరుకున్న భట్టి పాదయాత్ర
- గ్రామాల్లోకి రావాలంటూ భట్టి విక్రమార్కపై ఒత్తడి తెస్తున్న ప్రజలు
- ఇండ్లలోకి వచ్చి మా సమస్యలు చూడాలంటున్న జనాలు
హాత్ సే హాత్ జోడో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పిట్టబొంగరం గ్రామంలో ఆదివాసిలతో ముఖాముఖి అయ్యారు. ఆయనను చుట్టుముట్టిన ప్రజలు మా గ్రామంలోకి రండి.. మా సమస్యలు చూడండి అంటూ పిట్ట బొంగరం గ్రామ ఆదివాసిలు ఒత్తిడి తీసుకువచ్చారు. పిట్టబొంగరం గ్రామస్తుల కోరిక మేరకు వారి గ్రామంలోకి వెళ్లి ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు సీఎల్పీ నేత భట్టి.
స్థానిక ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో స్థానికులతో కలిసి నేల మీద కూర్చుని వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. మాకు ఉద్యోగాలు రాలేదు.. నల్లా నీళ్లు లేవు.. ఉండనీకి ఇండ్లు కూడా లేవు అంటూ భట్టికి వివరించారు. మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది. అప్పుడు మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు.
కేస్లాపూర్ చేరుకున్న భట్టి విక్రమార్క పాదయాత్ర
భట్టి విక్రమార్కగారూ.. చూడండి మా ఇల్లు ఇది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు.. కనీసం అప్పట్లో కాంగ్రెసోల్లు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు కూడా లేకుండా చేశారు. ఉండడానికి.. ఆఖరుకు తల్లీపిల్లలు పడుకోవడానికి ఇల్లు సరిగ్గాలేదంటూ భట్టి విక్రమార్క ముందు గోడు వెళ్లబోసుకుంది కేస్లాపూర్ మహిళ రుక్మాబాయి. ఐటీడీఏ నుంచి కూడా ఎటువంటి సహాయం అందడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రుక్మాబాయి ఆవేదనకు చలించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అందరికీ మేలు చేస్తామన్నారు.
నాగోబాను దర్శించుకున్న భట్టి విక్రమార్క
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో నాగోబాను భట్టి విక్రమార్క దర్శించుకొని ఆశీస్సులు పొందారు. కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుక - నాగనాథ్ పాదయాత్రగా వచ్చిన భట్టి విక్రమార్కకు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. పాదయాత్ర చేస్తున్న భట్టికి నాగోబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని నాగోబా ఆలయ పూజారి ఆశీర్వదించారు.