తెలంగాణలోని 27,147 బడుల్లో అల్పాహార పథకం- నేటి నుంచి సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం
ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పేరుతో కొత్తపథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జిల్లాపరిషత్ పాఠశాలలో పథకాన్ని మంత్రులు సార్ట్ చేశారు.
తెలంగాణలో విద్యార్థల కోసం మరో సరికొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు, వారి దృష్టి చదువుపై మరింత ఫోకస్డ్‌గా ఉండేలా అల్పాహారం అందిస్తోంది. ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరుతో అమల్లోకి తీసుకొచ్చిన ఈ పథకం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది.
సీఎం బ్రేక్‌ఫాస్ట్ పేరుతో ఈ పథకాన్ని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఆర్థికమంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జిల్లాపరిషత్ పాఠశాలలో పథకాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో కూడా వివిధ శాఖల మంత్రులు ఈ పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లి బడిలో మంత్రి కేటీఆర్, ఉప్పల్‌లో హోంమంత్రి మహమూద్ అలీ... ఇలా 119 నియోజకవర్గాల్లో 27,147 పాఠశాలల్లో మంత్రులు, బీఆర్‌ఎస్ లీడర్లు పాల్గొని విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించారు. ఈ పథకంతో 23 లక్షల మంది విద్యార్థులకు కడుపు నిండా ఫుడ్ లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. బడి ప్రారంభానికి ఓ అరగంట ముందు అల్పాహారం అందించనున్నారు.
ఈ అల్పాహార పథక నిర్వహణ ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించే వారికే అప్పగించారు. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో మాత్రం అక్షయపాత్ర ద్వారా బ్రేక్‌ఫాస్ట్ పిల్లలకు పెట్టనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్షయపాత్ర సంస్థ సేవలు అందించనుంది.