Adilabad Ganesh Immersion: తెలంగాణలో రెండో అతిపెద్ద గణేష్.. ఈ 54 అడుగుల గణపతి నిమజ్జనం చాలా స్పెషల్
Big Ganesh In Telangana | తెలంగాణలో రెండో అతిపెద్ద వినాయకుడ్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ భారీ గణేషుడ్ని ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనం చేశారు నిర్వాహకులు.

Adilabad Ganesh Nimajjanam 2025 | తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కుమార్ జనతా గణేష్ మండల్ కమిటీ నిర్వాహకులు గత 54 ఏళ్లుగా ఓ నూతిమీద గణపతిని ప్రతిష్టించి 11 రోజుల పాటు పూజలు నిర్వహించి 11 రోజున సాయంత్రం పూట ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేస్తున్నారు. ఈ ఏడాదితో 54ఏళ్లు పూర్తి కావడంతో 54 అడుగుల గణపతినీ నిర్మించారు. 11 రోజుల పాటు ఈ మహా గణపతికి పూజలు నిర్వహించి దర్శించుకొని భక్తులు మొక్కుకున్నారు. ఈ కుమార్ జనతా గణేష్ ప్రత్యేకత ఏమిటంటే.. నూతిమీద ప్రతిష్టించిన చోటే మోటార్ పైప్ ద్వారా నీటిని విడుదల చేసి ఉన్న చోటే నిమజ్జనం చేస్తారు.
నూతిమీద గణపతికి నిలబెట్టిన చోటే నిమజ్జనం
గత 54 ఏళ్లుగా ఈ నూతిమీద గణపతిని ప్రతిష్టిస్తూ పూజలు నిర్వహించి చివరి రోజున ఉన్న చోటే నిమజ్జనం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఈ మహా గణపతి ప్రస్తుతం రాష్ట్రంలోనే ఖైరతాబాద్ గణపతి తర్వాత రెండో అతిపెద్ద గణపతి గా గుర్తింపు పొందింది. దీని ముఖ్య నిర్వాహకులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్ పెట్ కు చెందిన తోట పరమేశ్వర్.. వారి పూర్వీకుల నుండి ఈ గణపతిని ఇక్కడే ప్రతిష్టిస్తూ ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం నిర్వహిస్తున్నారు. ఈ భారీ వినాయక విగ్రహాన్ని ఊరే గణేష్ అనే కళాకారుడు ప్రతియేట నిర్మిస్తున్నారు.

ప్రతిఏటా ఈ గణపతి ఒక్కొక్క అడుగు పెంచుతూ తమ చారిత్రక గొప్పదనాన్ని చాటుకుంటూ ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. నూతిమీద ప్రతిష్టించి.. మోటర్ పైప్ సాయంతో గణపతి పై నీళ్లు చల్లుతూ ఇక్కడే నిమజ్జనం చేయడం దీని యొక్క ప్రత్యేకత... ఈ గణేష్ నిమజ్జనాన్ని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రాష్ట్రంలోనే ఇది వినూత్న రీతిలో నిమజ్జనం జరిగే గణపతిగా అందరూ చర్చించుకుంటున్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కుమార్ జనతా గణేష్ మండల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 54 అడుగుల భారీ వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ పూజలు నిర్వహించి నూతిమీద మోటార్ స్విచ్ ఆన్ చేసి నిమజ్జనం ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలోనే ఇంతటి భారీ వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం రాష్ట్రంలోనే ఇది రెండవ అతిపెద్దది కావడం ఆదిలాబాద్ జిల్లాకు గర్వ కారణమని అన్నారు.
ఈ భారీ వినాయక విగ్రహాన్ని గత 54 ఏళ్లుగా ఏర్పాటుచేస్తూ ఇక్కడ వేడుకలు నిర్వహిస్తున్న తోట పరమేశ్వర్, వినాయక విగ్రహాన్ని నిర్మించే కళాకారుడు ఊరే గణేష్ వారు చేసే కృషిని అభినందించారు. భారీ వినాయక విగ్రహానికి ఉన్నచోటే నిమజ్జనం చేయడం దీని ప్రత్యేకత అని, దేశంలోనే చాలా అరుదుగా ఇలా ఇంత పెద్ద గణపయ్యలను ప్రతిష్టించిన చోటే నిమజ్జనం చేస్తారని తెలిపారు.





















