Asifabad News: కాగజ్ నగర్ లో రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారుల దాడులు - 695 బస్తాల బియ్యం పట్టివేత
Asifabad News: కుమురం భీం ఆసిఫిబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని ఓ రైస్ మిల్లలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈక్రమంలోనే 695 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Asifabad News: పేద ప్రజల ఆహార భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. పేదల ఆహారం కోసం అందించే రేషన్ బియ్యం అక్రమార్కులకు వ్యాపార వస్తువుగా మారి కాసులు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా నేటి రోజుల్లో ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొంత మంది తినడం లేదు. చాలా మంది లబ్దిదారులు ప్రతినెల రేషన్ షాప్ నకు వెళ్లి రేషన్ తీసుకుంటున్నారు. మరోవైపు ఆ రేషన్ బియ్యాన్ని తినని లబ్దిదారులు ఇంట్లో పేరుకుపోయిన రేషన్ బియ్యాన్ని మార్కెట్లో కిలోకి పది రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారు. ఈక్రమంలోనే ఈ రేషన్ బియ్యాన్ని ఇతర బియ్యంతో కలుపుతూ ఎక్కువ ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి.
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మూతపడిన శ్రీనివాస రైస్ మిల్లులో 695 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి వచ్చిన విజిలెన్స్ అధికారులు.. తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకుని.. మిల్లు యజమానిపై కేసు నమోదు చేశారు. బియ్యం రవాణా చేస్తున్న వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రోజు శ్రీనివాసా రైస్ మిల్లులో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఎన్ఫోర్స్ మెంట్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించగా.. 50 కేజీల బరువు ఉన్న 300 బస్తాలు, 25 కిలోల బరువు ఉన్న 395 బస్తాలు, మొత్తం 695 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగానే హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఎన్పోర్స్ మెంట్ ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... రిపేరింగ్ లో ఉన్న రైస్ మిల్లులో సీఎంఆర్ రైస్ లో పీడిఎస్ రైస్ కలుపుతున్నారన్న పక్కా సమాచారం మేరకు దాడి చేసినట్టు వెల్లడించారు. బియ్యం స్వాధీనం చేసుకుని వ్యాపారిపై కేసులు నమోదు చేసి, పోలీసులకు అప్పగించినట్టు వివరించారు.
టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై, పోలీసులు సంయుక్త ఆపరేషన్
ప్రజల వద్ద కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని హైదరాబాద్ లోని ఓ గోదాంలో భద్రపరిచి.. ఆ తర్వాత రైస్ మిల్లర్ల సాయంతో ప్రభుత్వానికి బియ్యం సరఫరా చేస్తున్న గుజారాత్ కు చెందిన కాంట్రాక్టర్ శర్మకు ఈ బియ్యాన్ని చేరవేస్తున్నారు. అక్కడి నుంచి తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి(State Govt) బియ్యం అమ్మేస్తున్నారు. ఈ చైన్ సిస్టమ్ పై టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై, తుకారం గేట్ పోలీసులు ఇటీవలే సంయుక్తంగా దర్యాప్తు చేశారు. ఈ ముఠాలో మొత్తం 16 మంది నిందితులతో పాటు 410 క్వింటాళ్ల బియ్యం, ఆరు వాహనాలను స్వాధీనం చేసుకోన్నారు. తుకారం గేట్, సంగారెడ్డి, సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో స్థావరాలపై దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యం అమ్మకం, కోనుగోలు నేరమాని అలా చేస్తే రేషన్ లబ్ధిదారుడి కార్డుపై సేవలు నిలిపివేయడంతో పాటు కేసులు పెడతామని సివిల్ సప్లై(Civil Supply) అధికారులు హెచ్చరించారు.
రూ.6 లక్షల విలువైన రేషన్ బియ్యం పట్టివేత
సంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జహీరాబాద్ మీదుగా హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వాహనాల తనిఖీల్లో 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చిరాగ్ పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యం విలువ రూ. 6 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.