Annu Bhai Paper Tea: పేపర్లో టీ చేయడం ఎప్పుడైనా చూశారా, అన్నూ భాయ్ కేరాఫ్ టేస్టీ పేపర్ చాయ్
Adilabad Paper Tea: చాయ్ చేయడానికి పాత్రలో, గిన్నెలో కాదు టాలెంట్ ఉంటే ఎలాగైనా టీ చేసేస్తాను అంటున్నాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన చాయ్‌వాలా అన్నూభాయ్. పేపర్‌లో టేస్టీ టీ చేస్తున్నాడు.
Annu Bhai Paper Tea very famous in Adilabad District | సాధారణంగా అందరూ ఏదైనా పాత్రలో, లేదా గిన్నెలో చాయ్ (Tea) తయారు చేస్తుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఓ చాయ్‌వాలా మాత్రం పేపర్‌లో టీ తయారుచేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాడు. అదేంటి, నిప్పు తగలగానే పేపర్ వెంటనే మండిపోతుంది కదా అంటారా.! అయితే పేపర్లో చాయ్ ఎలా మరిగిస్తారు, నిజంగానే సాధ్యమా అని సందేహం రావడం సహజమే. ఆదిలాబాద్ జిల్లా చాంద(టీ) గ్రామానికి చెందిన అన్నూ భాయ్ వినూత్నంగా చాయ్ తయారుచేస్తాడు. ఆయన నిజంగానే పేపర్‌లో టీ పొడిని మరిగించి, రుచికరమైన చాయ్ చేసి రుచి చూపిస్తూ ఆకట్టుకుంటున్నాడు. మరి అన్నూభాయ్ పేపర్‌లో ఏ విధంగా చాయ్ చేస్తున్నాడో ఈ స్టోరీలో మీకు పూర్తి వివరాలతో తెలియజేస్తున్నాం.
అది ఆదిలాబాద్ జిల్లాలోని చాందా (టీ) గ్రామం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి చాంద (టి) గ్రామం 4 కిలోమీటర్ల దూరంలో ఉటుంది. అన్నూ భాయ్ - జహీరా దంపతులు గత కొన్నేళ్లుగా గ్రామంలో చిన్న టీ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. తనకు ఉన్న నేర్పుతో అన్నూ భాయ్ వినూత్నంగా చాయ్ చేస్తుంటారు. పేపర్ మడిచిపెట్టి మూడు పచ్చి తుమ్మ ముళ్లను నాలుగువైపులా పేపర్ ను కుట్టి ఓ కప్పులా తయారుచేసి అందులోనే పాలు, చక్కెర, టీ పొడి వేసి.. బొగ్గుల పొయ్యిపై మరగబెట్టి టేస్టీ చాయ్ చేస్తున్నాడు. ఇదేమీ బ్రహ్మవిద్య కాదని, జాగ్రత్తలు పాటిస్తే అందరూ ఇలా చేయవచ్చని అన్నూభాయ్ చెబుతున్నాడు. పాలతో తడిగా ఉన్న పేపర్ ను నిప్పులపై ఉంచి.. పెద్దగా మంట రాకండా నోటితో గాలి ఊదుతూ టీ మరిగేలా జాగ్రత్త తీసుకుంటానని చాయ్‌వాలా అన్నూ భాయ్ ABP Desamతో మాట్లాడారు.
ఏబీపీ దేశం ప్రతినిధి శైలేందర్ అన్నూ భాయ్‌ను సంప్రదించగా.. వినూత్న టీ తయారీ విధానాన్ని ఈ చాయ్‌వాలా వివరించాడు. పేపర్ కప్పులో తయారు చేసిన టీ, సాధారణంగా పాత్రల్లో చేసిన దాని కంటే చాలా రుచకరంగా ఉంటుందన్నారు. పేపర్ కప్పులో చాయ్ చేయాలంటే అందులో నీళ్లు అసలు కలపకూడదు. స్వచ్ఛమైన పాలు, టీ పొడి, తగినంత పంచదార కలిపి బొగ్గుల పొయ్యిపై ఉంచాలి. కొన్ని నిమిషాలపాటు నోటితో గాలి ఊదుతుంటే అది మరిగి మంచి రుచికరమైన చాయ్ తయారవుతుందన్నారు. గతంలో ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ఫ్యాక్టరీ నడుస్తున్న సమయంలో తనకు ఈ ఆలోచన వచ్చి పేపర్లో చాయ్ చేసినట్లు తెలిపాడు. అలా ఆ ఫ్యాక్టరీకి వచ్చిన కొందరు పేపర్ లో చాయ్ చేయడం చూసి ఆశ్చర్యపోయేవాళ్లు. ఆయన టాలెంట్ చూసి మెచ్చుకునే వారిని తెలిపాడు. తాను సుమారుగా నాలుగైదు సార్లు పేపర్లో చాయ్ చేశాడు. ఆపై సీసీఐ ఫ్యాక్టరీ మూతపడిన తర్వాత చాంద(టి) గ్రామానికి వచ్చి గత కొన్నేళ్లుగా ఇంటి వద్దనే టీకొట్టు నడుపుతున్నారు. అన్నూభాయ్ తయారు చేసే పేపర్ చాయ్ కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది వచ్చి టీ తయారు చేసే విధానాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. పేపర్ లో చేసిన చాయ్ తాగిన వారు చాలా టేస్టీగా ఉంటుందని చెప్తున్నారు.
అన్నూభాయ్, జహిరా దంపతులు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టీకొట్టు నడుపుతున్నారు. కానీ, ప్రస్తుతం తమకు సరైన ఉపాధి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు కేవలం 100 నుంచి 150 రూపాయల వరకు మాత్రమే లాభం వస్తుందన్నారు. పొలం కూడా లేదన్నారు. తమకు సంతానం ముగ్గురిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు కాగా, కుమారుడు సైతం తమతో ఉండటం లేదని తెలిపారు. అన్నూభాయ్ తన భార్య జహీరా మాత్రమే గ్రామంలో ఉంటూ ఈ టీకొట్టును నడుపుతున్నారు.
పేపర్లో చాయ్ చేయడం చూసి 2019లో అప్పటి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నూభాయ్‌ని ప్రశంసిస్తూ గుర్తింపు పత్రం ఇచ్చారు. ఆయనకు ఏదైనా రుణ సాయం చెప్పినా, అలాంటిది జరగలేదన్నారు. అధికారులు అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు కానీ, ప్రభుత్వం నుంచి తనకు ఏ సాయం అందలేదని వాపోయారు. తాము నివసిస్తున్న ఇళ్లు చాలా పాతదని, వర్షాకాలంలో పైకప్పు నుంచి నీళ్లు కారి, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. పేపర్ చాయ్ కోసం వచ్చి ఆయనను పొగడడం, ఎంతో కొంత నగదు ఇస్తారు. కానీ వాటితో తమకు అంతగా ప్రయోజనం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమను గుర్తించి ఉపాధిని పొందేలా లోన్ ఇవ్వాలని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అన్నూభాయ్, ఆయన సతీమణి ప్రభుత్వాన్ని కోరారు.
అన్నూభాయ్ పేపర్ లో చేసే చాయ్ చాలా రుచికరంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. నీళ్లు కలపకండా స్వచ్ఛమైన పాలతో ఐదు నిమిషాల్లో టీ చేస్తారని, రుచి అమోఘంగా ఉంటుందన్నారు. టీ కొట్టు ప్రస్తుతం అంతగా నడవడం లేదని, అధికారులు వారికి ఉపాధి చూపించాలని, లేకపోతే లోన్ ఇచ్చి అదుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం పేపర్ చాయ్ వాలాగా అన్నూభాయ్‌ని గుర్తించి ఆదుకోవాలని రిక్వెస్ట్ చేశారు.