Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల అల్టిమేటం- టైగర్ జోన్‌లోకి వెళ్లిపోతున్నామని హెచ్చరిక !
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలోని పునరావాస గ్రామస్తులు అటవీ శాఖాధికారులకు వారం రోజుల గడువు ఇచ్చారు. లేకుంటే అడవిలోకి టైగర్ జోన్‌లోకి వెళ్తామంటున్నారు

Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో పులుల ఆవాసం అభివృద్ధి చేయడంలో భాగంగా నిర్మల్ జిల్లాలోని మైసంపేట రాంపూర్ గ్రామాలను అధికారులు ఖాళీ చేయించి.. వారికి కొత్త మద్దిపడగ గ్రామంలో పక్కా గృహాలు నిర్మించి పునరావాసం కల్పించారు. పునరావాసం కల్పించి ఏడాది గడిచినప్పటికీ ఇంకా వారికి ఇచ్చిన హామీ ప్రకారం సాగుభూమితోపాటు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వలేదు. ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదు. దీంతో మళ్ళీ తమ పాత గ్రామాల్లోకి వెళ్లి గుడిసెలు వేశారు. పురావస గ్రామస్తులు అడవిలో పాత గ్రామాల్లో గుడిసెలు వేయడానికి గల ప్రధాన కారణమేంటి..? ఇంకా వారు ఏం డిమాండ్ చేస్తున్నారు..? abp దేశం స్పెషల్ స్టోరీలో చూద్దాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో పులుల ఆవాసం కోసం అధికారులు ప్రత్యేకంగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ ఈ రెండు గ్రామాలను గత ఏడాది ఖాళీ చేయించారు. దట్టమైన అటవీ ప్రాంతం ఉండడంతో పులులకు ఆవాసయోగ్యాంగా ఈ ప్రాంతం ఉంది. నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాల సరిహద్దులో మధ్యలో ఈ ప్రాంతం ఉంది. మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి కాగజ్ నగర్ కారిడార్ మీదుగా కవ్వాల్ అభయారణ్యంలోకి ఇప్పుడు రాకపోకలు కొనసాగుతుంటాయి.
మరోపక్క మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ ఆభయారణ్యం నుంచి పెన్ గంగా నది దాటి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గుండా కవ్వాల్ అభయారణ్యంలోకి పులులు వస్తూపోతూ ఉంటాయి. దీంతో ఈ ప్రాంతం పులులకు ఆవాస కేంద్రంగా ఉండాలని అడవుల్లో ఉండే గ్రామాలు ఖాళీ చేయించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గతేడాది రాంపూర్, మైసంపేట ప్రజలను పునరవాసం కల్పించిన గ్రామంలోకి వెళ్లేలా చర్యలు చేపట్టారు. పునరవాసంలో పక్కా గృహాలు, స్పెషల్ ప్యాకేజ్ కింద 15లక్షల పరిహారం, మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు తమ గ్రామాన్ని వదిలి పునరావాస ప్రాంతాలకు వెళ్లారు.

ఏడాది గడిచినా పునరావాస గ్రామంలోకి వెళ్లిన వారికి ఎలాంటి పరిహారం అందలేదు. భూమి కూడా ఇవ్వలేదు. దిక్కుతోచనీ స్థితిలో ఉపాధి లేక కూలినాలీ చేసుకుంటూ బతుకుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు అటవీ శాఖ అధికారులకు, ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్లకు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. రావలసిన స్పెషల్ ప్యాకేజీ పరిహారం, సాగు భూమి కూడా ఇవ్వడం లేదని, సరైన ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నట్టు ఏబీపీ దేశం వద్ద గోడు వెళ్లగక్కారు.

ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్న పరిహారం, సాగు భూమి ఇవ్వలేదని ప్రజలంతా మళ్లీ పాత గ్రామానికే వెళ్లిపోతున్నారు. అడవికి వెళ్లి గుడిసెలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మైసంపేట, రాంపూర్ గ్రామానికి వెళ్లి అడవిలో గుడిసెలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వారితో మాట్లాడి త్వరలోనే తమకు పరిహారం అదేవిధంగా సాగుభూమిని అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఇంకా కొన్ని రోజులు చూసిన ప్రజలు మరోసారి అధికారుల వద్దకు వెళ్లారు. భూమి చదును ప్రారంభమైందని రాళ్ళు తొలగిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే ప్రత్యేకంగా పట్టా పాస్ బుక్కులు అందచేస్తామని తెలిపారు. పరిహారం కూడా త్వరలోనే అందజేస్తామని హామీ ఇవ్వడంతో కొంతమంది అక్కడి నుంచి తిరిగి తమ పునరావాస గ్రామానికి వచ్చారు.

పునరావాస ప్రాంతాల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవని, పిల్లలు చదువుకుందామన్న పాఠశాల లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక అంగన్వాడి కేంద్రం మాత్రమే ఉందని, పెద్దపిల్లలను సమీపంలో ఉన్న గ్రామ పాఠశాలకు పంపిస్తున్నట్టు వివరించారు. తమ కోసం నిర్మించిన పక్కా గృహాలు కూడా సరిగా లేవని పగుళ్లు వచ్చినట్టు చూపించారు. గోడలు కిటికీలు బాత్రూంలు కూలిపోయే స్థితికి వచ్చాయన్నారు. తాగునీటి సమస్య తీవ్రతరంగా ఉన్న వేళ హైటికాస్ స్వచ్ఛంద సంస్థ మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిందని వివరించారు. పాడి పశువులు సైతం మేత కొరత ఉందన్నారు. సమీప గ్రామాల్లోని పొలాల్లోకి వెళ్లి కొనుక్కుంటున్నట్టు వాపోయారు. రకరకాల సమస్యలతో ఇబ్బందులకు గురవడం.. ఉపాధి లేక ఆవేదనతో పదిమంది వరకు మరణించారని మరికొందరు వాపోతున్నారు.

పాత మైసంపేట రాంపూర్ గ్రామాల్లో పట్టా భూములు ఉన్నాయని ఆ భూముల్లో మంచి పంటలు పండేవని వివరించారు. ఏడాదిలో మూడు పంటలు తీసేవారమని, పులుల ఆవాసం పేరిట తరమిలేశారని అంటున్నారు. ఇస్తామన్న భూమి, పరిహారం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కూలీనాలి చేసుకుంటూ బతుకుతున్నామని, అది కూడా సరిగా దొరకడం లేదన్నారు. పిల్లల చదువులు చిద్రమవుతున్నాయని బడి కట్టిస్తామని చెప్పి ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్నారు.

అందుకే తాము కొంతమంది పాత గ్రామానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని అక్కడ గుడిసెలు వేసుకుంటామన్నారు. మళ్లీ అధికారులు వచ్చి రిక్వస్ట్ చేస్తే తిరిగి వచ్చినట్టు వివరించారు. ఈసారి కచ్చితంగా భూమి పట్టాలు, పరిహారం అందజేస్తామని చెప్పడంతో ఒప్పుకున్నట్టు తెలిపారు. వారంలోపు పరిహారం ఇవ్వకుంటే ఎవరు చెప్పినా వినమని పాత గ్రామానికి వెళ్లి భూములు సాగుచేసుకుంటామంటున్నారు.

ఈ గ్రామాల సమస్యలపై అటవీ అధికారులు స్పందించారు. హైటికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి అవకాశాలను కల్పిస్తామని పేర్కొన్నారు కడెం మండల రేంజ్ అధికారి గీతారాణి. త్వరలోనే పట్టా పాస్ బుక్కులు, పరిహారం ఇస్తామని తెలిపారు. మద్దిపడగ సమీపంలో 263 ఎకరాల్లో భూములను సాగుకు సంసిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీని కూడా అందజేస్తామన్నారు. గ్రామస్తులు మాత్రం వారంలోపు డిమాండ్‌లు నెరవేర్చాలని అల్టిమేటం జారీ చేశారు.






















