Adilabad District: ఆదిలాబాద్ జిల్లాకు జాతీయ అవార్డు-ఆనందంతో కలెక్టర్ దంపతుల డ్యాన్స్
Adilabad District:జల సంరక్షణలో ఆదిలాబాద్ జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు వరించింది. ఈ అవార్డు అందరి కృషి ఫలితంగా వచ్చిందని చెప్పిన కలెక్టర్ దంపతులు ఆనందంతో డ్యాన్స్ చేశారు.

Adilabad District: జల సంరక్షణలో ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి అవార్డును అందుకున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు శ్యామల దేవి, సోమ రాజేశ్వర్ పూలమొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు.

అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు భారీగా చేరుకుని కలెక్టర్‌ను అభినందించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఆఫీసర్స్ క్లబ్ నుంచి క్యాంప్ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

గుస్సాడి నృత్యాలు, బతుకమ్మ, బోనాల నృత్యాలు, మహిళల సందడి, అధికారులు, సిబ్బంది ఉత్సాహపూర్వకంగా పాల్గొనడం వలన ర్యాలీ సందడి వాతావరణాన్ని సృష్టించింది. కలెక్టర్ దంపతుల పాల్గోనీ డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆసక్తిగా అందరు తిలకిస్తూ సందడి చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్సి షా మాట్లాడుతూ... ఈ జాతీయ పురస్కారం వ్యక్తిగతంగా నాది కాదని, మనందరి కృషి, నిబద్ధతకి వచ్చిన గుర్తింపు అన్నారు. ఆదిలాబాద్ ప్రజల ప్రేమ, సత్కారం తనకు అపారమైన ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. అక్షరక్రమంలో ముందే ఉండే ఆదిలాబాద్, అభివృద్ధిలో కూడా ముందువరుసలో ఉండేలా కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.

జిల్లాలో అమలైన రైన్వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, చెరువుల పునరుద్ధరణ, లోతుదిద్దడం, వాటర్ స్మార్ట్ విలేజ్ కార్యక్రమాలు, గ్రామ జల్ కమిటీల భాగస్వామ్యం, పాఠశాల స్థాయిలో నీటి సంరక్షణ ప్రచారం వంటి విస్తృత చర్యల ఫలితంగానే ఈ జాతీయ గుర్తింపు లభించింది. దక్షిణ జోన్‌లో మొదటి స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని, కేంద్రం ప్రకటించిన రూ.2 కోట్లు జల సంరక్షణలో మరిన్ని వినూత్న కార్యక్రమాలకు వినియోగిస్తామని కలెక్టర్ తెలిపారు.

న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అత్యంత గౌరవకరమైందని కలెక్టర్ చెప్పారు. ఈ పురస్కారం అందరికీ ప్రేరణగా పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌ను దేశవ్యాప్తంగా జల సంరక్షణకు ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం అని కలెక్టర్ హామీ ఇచ్చారు. ర్యాలీ అనంతరం క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి, అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.

























