Kumuram Bheem Asifabad District: ఆయుధాలు వీడి-ప్రజల అభివృద్ధికి ఉపయోగపడండి; కుమ్రం భీం ఆసిఫాబాద్‌లో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
Kumuram Bheem Asifabad District: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో పోస్టర్లు వెలిశాయి. జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల అభివృద్ధికి మేథస్సును ఉపయోగించాలని సూచించారు.

Kumuram Bheem Asifabad District: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల(Maoists)కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. కౌటాల మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతోపాటు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గోడలకు గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు అంటించారు. ఆయుధాలు వీడి ప్రజల అభివృద్ధి కోసం పని చేయాలని అందులో పిలుపునిచ్చారు.
కౌటాల మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతోపాటు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గోడలకు ఈ కరపత్రాలు అంటించారు. ఈ పని ఎవరు చేశారనేది మాత్రం తెలియలేదు. మావోయిస్టు ఆత్మరక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి. అందులో ఇలా ఉంది. "మావోయిస్టులు ఆయుధాలు వీడండి-జన జీవన స్రవంతిలోకి రండి.. మీ మేధస్సును ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి".
గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లను అంటించడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది. మావోయిస్టులు అడవులను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్ట్ ఆత్మ పరిరక్షణ ప్రజాఫంట్ పేరిట పోస్టర్లు వెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ పోస్టర్లను చూసిన ప్రజలు ఏమి జరుగుతుందో అని భయాందోళనలకు గురవుతున్నారు. 
గురువారం మంచిర్యాల జిల్లాలో వెలిసిన పోస్టర్లు
మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లోని పలు ప్రదేశాల్లో మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరుతో పోస్టర్లు వెలిశాయి. వేమనపల్లి మండలంలోని ప్రాణహిత నది పరివాహక ప్రాంతాలైన సుంపుటం, కళ్లెంపెల్లి, ముక్కిడిగూడెం కన్నెపల్లి మండలంలోని తహశీల్దార్ కార్యాలయం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట ఈ పోస్టర్లు కలకలం రేపాయి.
ఇలా పలు ప్రదేశాల్లో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలంటూ డిమాండ్ పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. మీ నలభై ఏళ్ల నాటి ఉద్యమ బాట ప్రజాదరణ లేక మోడుబారిన బీడు భూమిగా మారిందని, ఆయుధాలు మాకొద్దు ప్రజాధారణ ముద్దు అనే నినాదాలతో పోస్టర్లు దర్శనమిచ్చాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఎవరు అతికించారో అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.





















