MP Arvind : టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశాలతోనే దాడులు, ఇకపై రిపీట్ అయితే ఊరుకునే ప్రసక్తే లేదు- ఎంపీ అర్వింద్
MP Arvind : మరోసారి రాళ్లు రువ్వితే సహించేది లేదని ఎంపీ అర్వింద్ అన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు వస్తే రాళ్ల దాడులు చేస్తారా అని ప్రశ్నించారు.
MP Arvind : ఇకపై రాళ్లు రువ్వితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. వర్షం వల్ల నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు వస్తే రాళ్లతో దాడులు చేస్తారా? మా ప్రభుత్వం వస్తే మేము ఇలాగే చేయాలా అని ప్రశ్నించారు ఎంపీ అర్వింద్. ఆరు రోజులుగా కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారికి పరిహారం అందించాలని కోరారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గం బాల్కొండలో పర్యటించిన ఎంపీ అర్వింద్ చెక్ డ్యాంల తీరుపై మంత్రిని ప్రశ్నించారు. చెక్ డ్యామ్ కట్ట పెంచి కట్టలు తెగిపోయేలా చేశారన్నారు. గతేడాది కూడా ఇదే విధంగా కట్ట తెగిపోయిందన్నారు. జిల్లాలో 30 చెక్ డ్యాంలు మంజూరయ్యాయని, అందులో 10 బాల్కొండ నియోజకవర్గంలోనే ఉన్నాయన్నారు. ఈ చెక్ డ్యాంలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మొత్తం కేంద్రం నిధులతోనే నిర్మించారని తెలిపారు.
కాంట్రాక్టు మంత్రి తమ్ముడికే
బాల్కొండ నియోజకవర్గంలో చెక్ డ్యామ్ ల నిర్మాణ కాంట్రాక్టును మంత్రి తమ్ముడు రమేష్ రెడ్డి చేస్తున్నారని ఎంపీ అర్వింద్ తెలిపారు. ఈ విషయం తనకంటే బాల్కొండ నియోజకవర్గంలోని ప్రజలకే ఎక్కువ తెలుసన్నారు. చుట్టాలకు కాంట్రాక్టులు ఇచ్చి నాసిరకంగా నిర్మాణాలు చేస్తూ ఇలా వర్షాలకు కొట్టుకుపోతున్నాయని ఆరోపించారు. వర్షాకాలం మొదట్లోనే ఈ స్థాయిలో వర్షాలు కురిసే లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ లో కూడా వర్షాలు కురుస్తాయని ఎంపీ అన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం అమలు చేయడంలేదని, 2018-19 నుంచి ప్రీమియం కట్టడం మానేశారన్నారు. వరదలో రైతులకు ఏ రకంగా నష్టపరిహారం చెల్లిస్తారని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. గతేడాది ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలోనే పసుపు రైతులు వర్షాలకు తీవ్రంగా నష్టపోయారని, వారికి ఎలాంటి పరిహారం చెల్లించలేదని తెలిపారు. ఇప్పటికైనా అడ్మినిస్ట్రేషన్ పై దృష్టి పెట్టి పంట నష్టం వాటిల్లింది అనేది తేల్చాలన్నారు. పంటలే కాదు, రోడ్లు, చెక్ డ్యాంలు, కల్వర్టులు డ్యామేజ్ అయ్యాయన్నారు.
అర్వింద్‌కు అమిత్ షా ఫోన్
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో దాడి జరిగింది. ఈ దాడిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. దాడి జరిగిందని తెలియగానే అమిత్ షా ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి ఘటనకు గురించి అడిగితెలుసుకున్నారు. ప్లాన్ ప్రకారమే తనపై దాడి జరిగిందని, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అమిత్ షాకు అర్వింద్ తెలిపారు. బీజేపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఎంపీ అర్వింద్ అమిత్ షాకు తెలిపారు. పార్లమెంట్ పరిధిలో అర్వింద్ ఎక్కడ తిరిగిన దాడులు జరుపాలని టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యేలకు సూచించిందన్నారు. ఈ విషయాన్ని ఎంపీ కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఇవాళ్టి దాడి వెనక ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారని ఎంపీ అర్వింద్ ఆరోపిస్తు్న్నారు.