Nizamabad BJP Fight : నిజామాబాద్ బీజేపీలో వర్గపోరు, ధన్ పాల్ పై చేయి చేసుకున్న ఎండల
Nizamabad BJP Fight : నిజామాబాద్ హనుమాన్ శోభాయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నేతలు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. ధన్ పాల్ సూర్యనారాయణపై ఎండల లక్ష్మీ నారాయణ చేయి చేసుకున్నారు.
Nizamabad BJP Fight : నిజామాబాద్ బీజేపీలో మరోసారి ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. నేతల మధ్య వర్గ పోరు బహిష్కృతమైంది. ఇద్దరు సీనియర్ నేతలు ఒకరిని ఒకరు నెట్టుకోవటం చర్చనీయాంశమైంది. అయితే గతం నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. జిల్లా బీజేపీలో ఎండల లక్ష్మీనారాయణ, ఎంపీ అరవింద్ మధ్య వర్గ పోరు నడుస్తూనే ఉంది. ఎండల వర్గం, ఎంపీ అరవింద్ వర్గానికి మధ్య మొదటి నుంచి వైరం ఉంది. అయితే నిజామాబాద్ నగరంలో చేపట్టిన హనుమాన్ శోభాయాత్ర ప్రారంభానికి ఎంపీ అరవింద్ జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. అయితే అరవింద్ రావటం కాస్త లేటు అయ్యింది. ఎంపీ కావటంతో ప్రోటోకాల్ ప్రకారం ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కాసేపు వేచిచుద్దామన్నారు. దీంతో ఆగ్రహించిన ఎండల లక్ష్మీనారాయణ శోభాయాత్ర ప్రారంభించాలంటూ పట్టుపట్టారు.
అర్బన్ టికెట్ పై ఇద్దరి నేతల ఆసక్తి
ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం నడిచింది. ఆగ్రహించిన ఎండల ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తాను పక్కకు తోసేశారు. దీంతో కాస్త తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనతో మరోసారి వీరి మధ్య వైరం బహిరంగంగానే బయట పడినట్లైందని బీజేపీ నేతలు అంటున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేసేందుకు ఇటు ఎండల, అటు ధన్ పాల్ ఆసక్తి చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో అర్బన్ టికెట్ ధన్ పాల్ కే వస్తుందని అంతా భావించారు. చివరి నిమిషంలో ఎండలకు ప్రకటించారు. ధన్ పాల్ ను పార్టీ అధిష్టానం బుజ్జగించింది. ఈసారి టికెట్ తనకే దక్కుతుందని ధన్ పాల్ ఆశతో ఉన్నారు. అటు ఎండల లక్ష్మీనారాయణ కూడా అర్బన్ టికెట్ పై కన్నేశారు. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకీ ముదురుతోంది. ఈ ఇద్దరి నేతల అనుచరులు తమ నేతకే టికెట్ వస్తుందంటే తమ నేతకే వస్తుందని ధీమాగా ఉన్నారు. దీంతో ఇరువురి నేతల మధ్య పోరు నడుస్తూనే ఉంది.
గత ఎన్నికల్లో
అయితే గత ఎన్నికల్లో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో బీజేపీ టికెట్ సూర్య నారాయణ గుప్తాకు వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. చివరి నిమిషంలో యెండలకు టికెట్ ఖరారైంది. అయితే బీజేపీ అభ్యర్థి ముూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పట్లో సూర్యనారాయణ గుప్తాకు పార్టీ పెద్దలు నచ్చజెప్పటంతో కామ్ గా ఉన్నారు. అతని అర్బన్ ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పచెప్పారు. ఈ సారి ఎలాగైనా టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో సూర్యనారాయణ గుప్త అర్బన్ లో పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఏ కార్యక్రమమైనా ముందుండి నడిపిస్తున్నారన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. సూర్య నారాయణ గుప్తా అనుచరులు మాత్రం టికెట్ తమ నాయకుడికే వస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సూర్యనారాయణకు అర్బన్ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.