Balagam Reunites Brothers : బంధాలను ఒక్కటి చేస్తున్న బలగం, కలిసిపోయిన అన్నదమ్ములు!
Balagam Reunites Brothers : జనహృదయాల్లోకి చొచ్చుకెళ్లిన బలగం సినిమా... ఇప్పుడు అన్నదమ్ముల సమస్యను పరిష్కరించింది.

Balagam Reunites Brothers :తెలంగాణ సంస్కృతి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బలగం సినిమా ప్రేక్షకాదరణ పొందుతుంది. థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమాకు సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ ఫ్యాన్స్ అయిపోతున్నారు. కొన్ని చోట్ల ఊరు ఊరంతా కలిసి కూర్చొని సినిమా వీక్షిస్తున్నారు. జనహృదయాల్లోకి చొచ్చుకెళ్లిన ఈ సినిమా ఇప్పుడు అన్నదమ్ముల తగాదాలను తీరుస్తుంది. భూమి తగాదాలతో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములను బలగం సినిమా కలిపింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. నిర్మల్ జిల్లా లక్ష్మణచాందకు చెందిన అన్నదమ్ములు గుర్రం పోసులు, రవి భూవివాదంలో గొడవపడి చాలా కాలం క్రితం విడిపోయారు. అయితే ఇటీవల ఆ గ్రామ సర్పంచ్ సురకంటి ముత్యంరెడ్డి చొరవతో మండల కేంద్రంలోని డీఎన్‌ఆర్ ఫంక్షనల్ హాల్‌లో బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని చూసిన పోసులు, రవి తమ వివాదాలు పక్కన పెట్టి కలిసిపోయారు.
అన్నదమ్ముల్లో మార్పు
మనుషుల విలువేంటో చెప్పిన బలగం సినిమా తర్వాత ఆ అన్నదమ్ములిద్దరూ.. తమ మనస్పర్థాలు పక్కన పెట్టామని, ఇకపై కలిసే ఉంటామన్నారు. ఆదివారం గ్రామ సర్పంచ్ ముత్యంరెడ్డి సమక్షంలో చేయి చేయికలిపారు. వివాదంలో ఉన్న భూసమస్యను పరిష్కరించుకున్నారు. తమను కలిపేందుకు ప్రయత్నం చేసి గ్రామ సర్పంచ్ కు అన్నదమ్ములిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. బలగం సినిమా అన్నదమ్ముల్లో మార్పు తీసుకువచ్చిందని, ఆ చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు గ్రామ సర్పంచ్. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. దూరమైపోతున్న మానవ సంబంధాలను చక్కని కథగా మార్చి బలగం సినిమా తీశారని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Idhi naa cinema na🥲#Balagam https://t.co/yStQ4EaZly
— Sailu Priyadarshi #Balagam (@priyadarshi_i) April 2, 2023
బలగం సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న గ్రామస్థులు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలను తెరకెక్కించిన చిత్రం బలగం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో... భారీగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. పాత రోజుల్లో పండుగలకు గ్రామాల్లో కొత్త సినిమాలో తెరపై వేసేవాళ్లు. ఆ పాత రోజులు గుర్తుచేస్తూ బలగం సినిమాను గ్రామాల్లో ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలోని పలు పల్లెటూర్లలో బలగం సినిమాను వీధుల్లో తెరలు కట్టి ప్రదర్శిస్తున్నారు. ఓ ఊరిలో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా... ఊరు ఊరంతా ఈ సినిమా చూసింది. సినిమా చూస్తున్నంత సేపు గ్రామస్థులందరూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా క్లైమాక్స్‌కు వచ్చేసరికి ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు. గ్రామస్థులు కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతలా బలగం చిత్రం జనాల్లోకి వెళ్లిందని సినిమా హీరో ప్రియదర్శి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కమిడియన్ గా పేరు తెచ్చుకున్న వేణు ఎల్దండి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లతోపాటు అమెజాన్ ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. విడుదలైన కొన్నిరోజుల్లోనే ఈ చిత్రం రెండు అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ ఫీచర్‌ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్‌ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులను దక్కించుకుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

