MLC Kaushik Reddy: గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు
తెలంగాణ గవర్నర్ తమిళిసై పై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
![MLC Kaushik Reddy: గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు National Women Commission notices to BRS MLC Kaushik Reddy over his remarks on governor Tamilisai MLC Kaushik Reddy: గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/19/2e3b852a5bfa73d14ad5ae8e9898da3a1676819596707233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఇటీవల చేసిన అవమానకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ వివరణ కోరింది. ఫిబ్రవరి 21 తేదీ ఉదయం 11:30 గంటలకు జరగనున్న విచారణకు కౌశిక్ రెడ్డి స్వయంగా హాజరు కావాలని అధికార పార్టీ ఎమ్మెల్సీకి పంపిన నోటీసులో జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ఫిబ్రవరి 14 తేదీన జాతీయ మహిళా కమిషన్ నోటీసులు పంపింది.
శాసనసభ, శాసన మండలిలో సభ్యులు పాస్ చెసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ తమిళిసై ఎందుకు క్లియర్ చేయడం లేదంటూ ప్రశ్నిస్తూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. జమ్మికుంటలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న కౌశిక్ రెడ్డి గవర్నర్ కొన్ని బిల్లులకు ఆమోదం తెలపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్లులు ఎందుకు దాచిపెడుతున్నారు, గవర్నర్ తీరు సరిగాలేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని సుమోటోగా తీసుకుని జాతీయ మహిళా కమిషన్ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చింది.
గవర్నర్ పై ఎమ్మెల్సీ వ్యాఖ్యలు దుమారం.. పీఎస్ లో ఫిర్యాదు
అసలే తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. గవర్నర్ ప్రోటోకాల్ వివాదానికి సైతం ప్రభుత్వంతో సఖ్యత లేకపోవడమే కారణమని వినిపించింది. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై అధికార పార్టీ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎమ్మెల్సీ అయి ఉండి గవర్నర్ పదవిని అవమానించడం, మహిళ అనే గౌరవం కూడా లేకుండా ఆ హోదాను కించపరిచేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ మొదలైంది. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గత నెల చివర్లో సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కౌశిక్ రెడ్డిపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. మహిళా గవర్నర్ ను అగౌరపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నేతల ఫిర్యాదులు, ఆరోపణలు, మహిళా సంఘాల డిమాండ్లతో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. గవర్నర్ తమిళిసైపై చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న కమిషన్ నోటీసులిచ్చింది. నేరుగా విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఆదేశించింది.
కామెంట్లు ఎందుకు చేశారో చెప్పిన ఎమ్మెల్సీ
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున హుజారాబాద్ నుంచి పోటీ చేసే అభ్యర్థిని తానే అని ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి చెప్పారు. మంత్రి కేటీఆర్ కూడా మంగళవారం రోజు ఈ విషయం స్పష్టం చేశారన్నారు. కరీంనగర్ లో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ దిల్లీ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడిస్తే తాము సహించేది లేదని అన్నారు. మహిళలు అంటే తనకు చాలా గౌరవం అని... అయితే గవర్నర్ తీరు వల్లే ఇలా స్పందించాల్సి వస్తోందని చెప్పారు. శాసన సభలో ఆమోదం పొందిన రాష్ట్ర అభివృద్ధి బిల్లులను ఆపడంతో కడుపు మండి మాత్రమే విమర్శలు చేశానని వివరించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)