(Source: ECI/ABP News/ABP Majha)
Yadadri News: యాదాద్రికి వెళ్తున్నారా? ఇలా వెళ్తే కొండపైకి పోనివ్వరు! రేపటి నుంచే కొత్త రూల్: ఈవో
Yadadri: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను కొండ కింది నుంచి పై వరకూ ఆర్టీసీ బస్సులో తరలిస్తామని ఈవో చెప్పారు. అందుకోసం భక్తులు ఎలాంటి టికెట్లు తీసుకోనవసరం లేదని అన్నారు
Yadadri Updates: ఈరోజు నుంచి (ఏప్రిల్ 1) యాదాద్రి కొండపైకి ప్రైవేటు వాహనాలను రానివ్వబోమని ఆలయ ఈవో గీత వెల్లడించారు. ఇక పూర్తిగా ప్రైవేటు వాహనాలను యాదగిరి గుట్ట పైకి నిషేధిస్తున్నట్టు ఆమె తెలిపారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులను కొండ కింది నుంచి పై వరకూ ఆర్టీసీ బస్సులో తరలిస్తామని చెప్పారు. అందుకోసం భక్తులు ఎలాంటి టికెట్లు తీసుకోనవసరం లేదని, ఆ బస్సుల్లో ఫ్రీగానే కొండపైకి తరలిస్తామని వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తాన్ని యాదాద్రి దేవస్థానమే పూర్తిగా భరిస్తుందని అన్నారు.
అతి త్వరలోనే స్వామి వారి నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు జోడు వంటి సేవలు ప్రారంభిస్తామని ఈవో గీత తెలిపారు. అదే సమయంలో స్వామివారి నిత్య కైంకర్యాల వేళలను దేవస్థానం ప్రకటించింది.
* ఉదయం 4 - 4.30 వరకు సుప్రభాతం
* 4.30 - 5.00 వరకు బిందె తీర్థం, ఆరాధన
* 5 - 5.30 వరకు బాలభోగం
* 5.30 - 6 వరకు పుష్పాలంకరణ సేవ
* 6 - 7.30 వరకు సర్వదర్శనం
* 7.30 - 8.30 వరకు నిజాభిషేకం
* 8.30 - 9 వరకు సహస్రనామార్చన
* 9 - 10 వరకు బ్రేక్ దర్శనం
* ఉదయం 10 - 11.45 వరకు సర్వదర్శనం
* ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రాజభోగం
అన్ని జిల్లాల నుంచి బస్సులు
‘యాదాద్రి దర్శిని’ పేరుతో టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక ఆర్టీసీ మినీ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ కలిసి బుధవారం ప్రారంభించారు. యాదాద్రి ఆలయం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండపైకి యాదాద్రి దర్శిని పేరుతో ఈ బస్సుల్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం 100 మినీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు.
ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ శివారులోని ఉప్పల్ సర్కిల్ వద్దకు బస్సులు నడుస్తాయి. అక్కడి నుంచి మినీ బస్సుల్లో యాదాద్రికి వెళ్లవచ్చు. అంతేకాక, ఉప్పల్ సర్కిల్ వద్దకు రాని జిల్లాల బస్సులు కూడా ఉంటాయి కాబట్టి, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి కూడా బస్సులను నడుపుతారని అన్నారు. జేబీఎస్ నుంచి యాదాద్రికి రూ.100, ఉప్పల్ నుంచి మినీ బస్సులో అయితే రూ.75 టికెట్ రేటు ఉంటుంది. ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణికులు సౌకర్యవంతంగా యాదాద్రి చేరుకోవచ్చని ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు.