Nalgonda: వాళ్లిద్దరూ ఇంట్లో బట్టల్లేకుండా ఉంటారు, కాలేజీలో బాలిక లేఖ సంచలనం - చివర్లో భారీ ట్విస్ట్!
Alair Minority Gurukulam: గుర్తు తెలియని బాలిక రాసిన లేఖలో సిబ్బంది గురించి సంచలన ఆరోపణలు చేసింది. చివరికి విచారణలో అసలు ట్విస్ట్ బయటపడింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఓ విద్యార్థిని కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రెస్‌కు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఆలేరు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పని చేసే సిబ్బందిలో కొందరు బాలికల విషయంలో లైంగికంగా వేధిస్తున్నారని గుర్తు తెలియని బాలిక ఈ లేఖ రాసింది. ఈ మైనార్టీ స్కూల్, కాలేజీలో 5వ తరగతి నుంచి ఇంటర్ ఫస్టియర్ వరకూ విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ సుమారు 330 మంది విద్యార్థినులు ఉండి చదువుకుంటున్నారు.
గుర్తు తెలియని విద్యార్థిని తాను రాసిన లేఖలో స్కూలు సిబ్బంది గురించి సంచలన ఆరోపణలు చేసింది. ‘‘మైనార్టీ గురుకుల స్కూలులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే గౌస్, సాజియా అనే వ్యక్తులు ఇంట్లో ఒంటిపై బట్టలు లేకుండా గడుపుతారు. ఆడ పిల్లలు స్నానాలు చేస్తున్న గదుల్లోకి గౌస్ వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. హాస్టల్‌కు కొద్ది దూరంలో స్కూల్ ఉంటుంది. అక్కడ పని చేసే కొంత మంది సిబ్బంది గది అద్దెకు తీసుకున్నారు. అక్కడకు తమను పంపించి బలవంతం చేస్తారు. ఈ విషయం బయటికి పొక్కితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. టీసీలు ఇచ్చి ఇంటికి పంపించేస్తామని బెదిరిస్తున్నారు. వీరి బారి నుంచి మమ్మల్ని కాపాడండి’ అంటూ ఓ బాలిక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతకు లేఖ రాశారు.
ఆలేరు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే కొంతమంది సిబ్బంది బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని బాలిక రాసిన ఉత్తరం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ లేఖ మూడు రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది. శనివారమే ప్రిన్సిపాల్ విషయాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దృష్టికి తీసుకెళ్లి ఆలేరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ లేఖపై యాదగిరిగుట్ట సీఐ నవీన్ రెడ్డి సోమవారం కాలేజీకి వచ్చి విచారణ జరిపారు.
ఆ విచారణలో పోలీసులు తాము గుర్తించిన విషయాన్ని వివరించారు. కాలేజీలో పనిచేసే ఆసియా, ఆమె భర్తకు ఉన్న గొడవలే ఈ లేఖకు కారణమని తెలిపారు. ఆసియాపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే ఆమె భర్త అనీఫ్ బాలిక పేరుతో తప్పుడు లేఖలు రాశాడని పోలీసులు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపామని అన్నారు. అతనికి గుండె సంబంధ వ్యాధి ఉండడంతో మందలించి వదిలేశామని చెప్పారు.
మైనార్టీ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే గొంగిడి సునీత
బాలిక పేరుతో రాసిన లేఖ అంతా ఓ కుట్ర అని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కొట్టి పారేశారు. ఆమె ఆదివారం మైనార్టీ పాఠశాలను సందర్శించారు. రికార్డులు, సీసీటీవీ పుటేజీలు పరిశీలించారు. లైంగిక వేధింపులపై ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని, విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యకు కారణమైన ఆసియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. దీనిపై ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. కాలేజీలో ఎలాంటి ఘటనలు జరగలేదని అన్నారు. కావాలనే ఓ వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని తేలిందని ప్రిన్సిపల్ జహీర్ ఉన్నీసా వెల్లడించారు.