Boora Narsaiah Goud: బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య గౌడ్ - ముహూర్తం ఫిక్స్ చేసుకున్న మాజీ ఎంపీ
Boora Narsaiah Goud To Join BJP: రాష్ట్రంలో కీలకమైన ఉప ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.
Boora Narsaiah Goud To Join BJP: అంతా ఊహించినదే జరగబోతోంది. మునుగోడు ఉప ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ త్వరలోనే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బీజేపీలో చేరేందుకు ముహురం ఫిక్స్ అయినట్లు సమాచారం. అక్టోబర్ 19న ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు బూర నర్సయ్య గౌడ్. పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని, ఉప ఎన్నికల సందర్భంగా కనీసం తనతో ఒక్కసారి కూడా చర్చించలేదని ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు బూర. బీసీ నేతలకు టిక్కెట్ ఇవ్వాలని కోరడం కూడా తప్పేనా, ఉద్యమ నేతలకు సైతం కేసీఆర్‌ను కలిసేందుకు తిప్పడం లేదని, రాష్ట్ర సాధన కంటే పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తోందని టీఆర్ఎస్ పార్టీకి తన రాజీనామా లేఖలో పలు కీలక అంశాలను బూర నర్సయ్య గౌడ్ ప్రస్తావించడం తెలిసిందే.
టీఆర్ఎస్ పార్టీలో ఆత్మాభిమానం చంపుకోలేక, బనిసలా బతకలేక రాజీనామా చేశానని బూర ఇదివరకే తన అభిప్రాయాన్ని తెలిపారు. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పిన తరువాత భువనగిరి మాజీ ఎంపీ పయనం ఎటువైపు అనే దానిపై స్పష్టత వచ్చింది. ఈ నెల 19న ఢిల్లీలోని బీజేపీ ఆపీసులో ముఖ్య నేతల సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు. అక్టోబర్ 13న చండూరులో టీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఈ మాజీ ఎంపీ అదే రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కీలకమైన మునుగోడు ఉపఎన్నిక ముందు అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు బూర.
ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా
కొన్ని రోజులకిందట బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కొందరు కీలక నేతలు హైదరాబాద్‌లోని బూర నర్సయ్యగౌడ్ ఇంటికి వెళ్లి కలిశారు. బీజేపీలోకి రావాలని ఆహ్వానించగా, అందుకు బూర నర్సయ్య సముఖంగా వ్యవహరించారు. ఓవైపు తనకు పార్టీలో గౌరవం దక్కకపోవడం, బీసీలకు టికెట్ ఇవ్వాలని అడిగినందుకు సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం లాంటి విషయాలతో బూర నర్సయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు అక్టోబర్ 15న బూర ప్రకటించారు. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపించారు. 2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీగా గెలిచారు బూర నర్సయ్య గౌడ్. కానీ 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటినుంచి తనకు టీఆర్ఎస్ లో అవమానాలు ఎదురయ్యాయని, సీఎం కేసీఆర్ ను కలిసే అవకాశం దక్కడం కూడా కష్టంగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు.
ఈ 20 నుంచి రంగంలోకి బూర..
ఈ 19న బీజేపీలో చేరిన తరువాత మునుగోడులో నియోజకవర్గంలో బూర నర్సయ్య గౌడ్ స్తృతంగా పర్యటించనున్నారు. ఈ 20 నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీకి విజయం అందించాలని బూర భావిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంతో పాటు నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున అక్టోబర్ చివరి వారంలో హైదరాబాద్‌లోని నాంపల్లిలో బీసీ నేతలు నర్సయ్యగౌడ్‌తో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారని సమాచారం. మొదట్నుంచీ టీఆర్ఎస్ తో కొనసాగుతున్న బూర నర్సయ్య గౌడ్ తొలిసారి వేరే పార్టీ కోసం పనిచేయనున్నారు.