Telangana News: 119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ధర్నాలు - యాదాద్రిలో హరీష్‌రావు ప్రమాణం
BRS Protest: రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్ పోరాటం చేస్తోంది. 119 నియోజకవర్గాలు ధర్నాలు చేస్తోంది. యాదాద్రికి వెళ్లిన హరీష్‌రావు పాపపరిహార ప్రమాణం చేశారు.
BRS Leaders Dharna: తెలంగాణ రైతు రుణమాఫీపై రాజకీయ రగడ జరుగుతోంది. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చెప్తోంది. అయితే... సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పూర్తిగా రుణమాఫీ చేశామని చెప్తుంటే... మంత్రులు మాత్రం రుణమాఫీ ఇంకా పూర్తిగా చేయలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్యే సమన్వయం లేదని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. అర్హులైన రైతులందరికీ... రూ.2లక్షల రుపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ.. ధర్నాలు దిగింది బీఆర్‌ఎస్ (BRS).
హరీష్‌రావు పాపరిహార ప్రమాణం..
యాదగిరిగుట్ట ఆలయానికి వెళ్లారు మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao). లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాపపరిహార ప్రమాణం కూడా చేశారు హరీష్‌రావు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పారని అన్నారు. దేవుడి మీద ఒట్టు వేసి రేవంత్‌రెడ్డి మాట తప్పారన్నారు. ఆయన చేసిన తప్పునకు ప్రజలను శిక్షించవద్దు అంటూ.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నారు హరీష్‌రావు. సీఎం రేవంత్‌రెడ్డికి బుద్దివచ్చేలా చేయాలని వేడుకున్నానని అన్నారు.
అర్హత ఉన్న రైతులు అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ.2 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. 119 నియోజకవర్గాల్లో ధర్నాలు చేపడుతోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గాలు, కాంగ్రెస్ మంత్రుల నియోజకవర్గాల్లో.. పార్టీ కేడర్ భారీగా తరలివచ్చి.. కార్యక్రమాన్ని విజయవంత చేయాలని పిలుపునిచ్చింది. చేవెళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్‌రావు ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆగస్టు 15 లోగా రైతులందరికీ రుణ మాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని.. తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ.. యాదాద్రిలో పాప పరిహార పూజలు నిర్వహించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
— BRS Party (@BRSparty) August 22, 2024
ముఖ్యమంత్రి చేసిన పాపం తెలంగాణ… pic.twitter.com/SSHWZLa7rb
ఎన్నికల తర్వాత... రైతు రుణమాఫీపై అంచనాలు సిద్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ.. 40వేల కోట్లు అవసరమవుతుందని చెప్పింది. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో 31 వేల కోట్లకు అనుమతి ఇచ్చింది. అయితే.. బడ్జెట్‌లో మాత్రం 26వేల కోట్లు మాత్రమే కేటాయిచింది. చివరికి వచ్చే సరికి... 18వేల కోట్ల రైతు రుణాలు మాత్రమే మాఫీ చేసిందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. రాష్ట్రంలోని 40శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదని చెప్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు. రైతుల తరపున తాము పారాడుతున్నామని చెప్తున్నారు.
బీఆర్‌ఎస్ ఆరోపణలపై కాంగ్రెస్ రియాక్షన్...
బీఆర్‌ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ ప్రభుత్వం తిప్పికొడుతోంది. 2018 ఎన్నికల వేళ రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన బీఆర్‌ఎస్... ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు మంత్రులు. పదేళ్లు అధికారంలోకి ఉండి.. రైతులకు ఏమీ చేయని వాళ్లా మాకు చెప్పేది అంటూ మండిపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా... ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తే... తమపై ఆరోపణలు చేయడానికి సిగ్గుండాలని ఫైరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ధర్నాలో పేరుతో బీఆర్‌ఎస్ డ్రామాలు చేస్తోందని విమర్శించారు. అంతేకాదు.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం కాబట్టి... హరీష్‌రావు చెప్పినట్టు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. మొత్తంగా.. తెలంగాణలో రైతు రుణమాఫీపై పొలిటికల్ ఫైట్ జరుగుతోంది.