15 తర్వాత మునుగోడు వస్తా, మీ కోసం కొట్లాడుతా: బండి సంజయ్
Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చర్లగూడెం భూ నిర్వాసితుల దీక్షా శిబిరం వద్దకు వెళ్లి వారు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపారు.
Bandi Sanjay: చర్లగూడెం భూ నిర్వాసితుల దీక్షా శిబిరం వద్దకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ వెళ్లారు. వారు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు. కేసీఆర్ మెడలు వంచి భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. 15 తర్వాత మునుగోడు వస్తా... మీ కోసం కొట్లాడతా అంటూ భూ నిర్వాసితులకు బండి సంజయ్ భరోసా ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో తమ తరపున కొట్లాడే బీజేపీకే ఓటేస్తామని చర్లగూడెం భూ నిర్వాసితులు తెలిపారు.
చర్లగూడెం భూ నిర్వాసితుల దీక్షా శిబిరం సందర్శించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ @bandisanjay_bjp వారి ఆందోళనకు మద్దతు ప్రకటించారు. కేసీఆర్ మెడలు వంచి భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బిజెపి పోరాడుతుందని హామీ ఇచ్చారు. pic.twitter.com/D8wCmBj9p1
— BJP Telangana (@BJP4Telangana) October 10, 2022
మునుగోడు ఎన్నికలు యావత్ తెలంగాణ భవిష్యత్ ను నిర్దేశించే ఎన్నిక కాబోతోందని బండి సంజయ్ అన్నారు. 8 ఏండ్లుగా అబద్దాలు చెబుతూ మోసాలు చేస్తూ కోట్లు దండుకుంటూ ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ ను రోడ్డు మీదకు గుంజుకొచ్చిన ఘనత బీజేపీదే అన్నారు. కేసీఆర్ పాలన పట్ల యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు కసితో ఉన్నారని తెలిపారు. ఉద్యోగాలు రాక, నిరుద్యోగ భృతి అందక యువత టీఆర్ఎస్ ను బొంద పెట్టాలా? అని ఎదురుచూస్తోందని విమర్శించారు. ఇది తెలిసే కేసీఆర్ మంత్రులను, ఎమ్మెల్యేలను పంపించి ఓటుకు రూ. 40 వేలు పంచేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు.
ఉద్యమ సమయంలో రూపాయి కూడా లేదు..
"తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వద్ద రూపాయి కూడా లేదు. ఫైనాన్స్ కట్టలేదని కేసీఆర్ ప్రచార రథాన్ని గుంజుకపోయిండ్రు. ఈఎంఐలు కట్టలేదని కేసీఆర్ కారును మంజీరా గ్రామీణ బ్యాంక్ వాళ్లు తీసుకుపోయిండ్రు. అట్లాంటోళ్లు ఇయాళ రూ.100 కోట్లు పెట్టి సొంత విమానం ఎట్లా కొన్నారు? సమాధానం చెప్పాలి? 8 ఏండ్ల పాలనలో దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల సొమ్మును దండుకున్నారే తప్ప అదనంగా ఒక్క ఎకరాకు కూడా కొత్తగా నీరియ్యలే. కేసీఆర్ పాలనతో విసిగిపోయి మరో ఏడాది పదవిలో ఉండే అవకాశమున్నా మునుగోడు అభివృద్ధి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిర్రు. ఆయన రాజీనామాతో గట్టుప్పల్ ను కొత్త మండలం చేశారు. ఈ నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులకు ప్రొసీడింగ్స్ ఇస్తున్నారు. చౌటుప్పల్ నుంచి తంగెడుపల్లి రోడ్డును ఆగమేఘాల మీద వేసిర్రు."- బండి సంజయ్
కేసీఆర్ జిమ్మిక్కులు..
హుజూరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు కింద ఒక్కో దళితుడి అకౌంట్లో డబ్బులు వేశారని బండి సంజయ్ అన్నారు. ఎన్నికల తర్వాత వాటిని మళ్లీ వాపస్ తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ చేసే జిమ్మిక్కులను అర్ధం చేసుకోవాలని కోరారు. మునుగోడు తీర్పు కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తోందన్నారు. మీ దమ్ము ఏందో చూపించే టైం వచ్చిందని తెలిపారు. కేసీఆర్ పై మీకున్న కసిని ఓటు ద్వారా చెప్పండని పిలుపునిచ్చారు. మీరేసే ఓటుతో కేసీఆర్ మైండ్ బ్లాంక్ కావాలన్నారు.