SLBC Tunnel Recue operation: చివరి దశకు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
SLBC Tunnel Collapse Tragedy | ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ఘటనలో లోపల చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉండటం కష్టమే. వారం రోజులు గడవడంతో నీరు, ఆహారం లేక చనిపోయి ఉంటారని ప్రచారం జరుగుతోంది.

SLBC Tunnel Collapse Rescue Operation | అమ్రాబాద్: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ (SLBC Tunnel) దగ్గర రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది. టన్నెల్ లోపల చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు దాదాపు 8 రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. SLBC టన్నెల్ వద్ద 10 మంది ఫోరెన్సిక్ నిపుణులు ఉండాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీల ఫోరెన్సిక్ నిపుణులు ఉండగా.. హైదరాబాద్ నుంచి నలుగురు ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి వెళ్తున్నారు.
వారం దాటినా కొలిక్కిరాని రెస్క్యూ ఆపరేషన్..
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో పనులు జరుగుతుండగా ఫిబ్రవరి 22న ఉదయం పైకప్పు కూలిపోయింది. దాంతో లోపలకి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం రావడంతో లోపల బురద కొన్ని అడుగుల మేరకు పేరుకుపోయింది. ప్రమాద సమయంలో లోపల 50 మంది ఉండగా టన్నెల్ బోరింగ్ మెషిన్ కు బయట వైపు ఉన్న వారు రెండు, మూడు కిలోమీటర్లు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. అక్కడి నుంచి లోక్ ట్రైన్లో ప్రయాణించి టన్నెల్ నుంచి బయటకు వచ్చారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ కు లోపల వైపు ఉన్నవారు బయటకు రాలేకపోయారు. వారు బురద కింద చిక్కుకుని ఉంటారని రెస్క్యూ టీమ్ భావిస్తోంది. వారి జాడ గుర్తించేందుకు జీపీఆర్ పరికరాలను వాడుతున్నారు. దాంతో కొన్ని మీటర్ల లోతులోనూ ఏదైనా శకలాలు ఉంటే మెషిన్లు గుర్తిస్తాయి. మరోవైపు బురద, మట్టిని తవ్వుతూ కార్మికుల జాడ కోసం రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది.
టన్నెల్ లోపల టీబీఎం రెండు ముక్కలైందని సింగరేణి సీఎండీ బలరామ్ తెలిపారు. మట్టిని తవ్వడానికి కొన్ని రోజులు సమయం పడుతుందని, కార్మికుల జాడ గుర్తించేందుకు రెండు రోజులు పడుతుందని శుక్రవారం పేర్కొన్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, పోలీసులు, ర్యాట్ హోల్ మైనర్స్, సింగరేణి విభాగాల టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.
గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (GPR) పరికరంతో చేసిన సెర్చ్ లో బురద లోపల 5 చోట్ల ఆనవాళ్లు గుర్తించారని, అవి కార్మికుల మృతదేహాలేనని శుక్రవారం సాయంత్రం ప్రచారం జరిగింది. దీనిపై నాగర్ కర్నూలు కలెక్టర్ బడావత్ సంతోష్ మాట్లాడుతూ.. కార్మికులు చనిపోయినట్లు ఇంకా ధ్రువీకరణ కాలేదని, అసత్యాలు ప్రచారం చేయవద్దని సూచించారు. కార్మికులు చనిపోయారు అనేది నిజం కాదన్నారు.
మరో 20 మీటర్ల దూరంలో..
ప్రమాదం జరిగిన ప్రాంతం 13.85 కిలోమీటర్ల దూరం టన్నెల్‌లో రెస్క్యూ టీమ్స్ శుక్రవారం 13.61 కిలోమీటర్లకు చేరాయి. టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం) ముక్కలైందని గుర్తించారు. టన్నెల్‌లో ఐదున్నర అడుగుల ఎత్తులో బురద, మట్టి పేరుకుపోయాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM) కటింగ్ శనివారం సగానికి పైగా పూర్తి కానుంది. మరోవైపు పైపులు, ఇనుప సామగ్రిని సిబ్బంది బయటకు తరలిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

