Nalgonda: హోలీ పండక్కి భార్య చికెన్ వండలేదట, ఈ భర్త చేసిన పనికి పోలీసులకు దిమ్మతిరిగింది!
Dial 100 News: హోలీ పండక్కి తన భార్య చికెన్ వండలేదని అసహనం చెందిన భర్త ఏకంగా డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు.
Nalgonda News: ఆపదలో ఉన్నవారు లేదా ఏవైనా ఫిర్యాదులు ఇవ్వాలన్నా అందరికీ ఠక్కున గుర్తొచ్చే నెంబరు డయల్ 100. అత్యవసర సమయంలో (Emergency Number) ఎంతో ఉపకరించే ఈ నెంబరుకు ఫోన్ చేయడం వల్ల పోలీసులు తక్షణం స్పందించి జరగబోయే నేరాలను ఆపిన ఘటనలు కూడా గతంలో చాలా ఉన్నాయి. అలాంటి ఈ నెంబరుకు అప్పుడప్పుడూ తప్పుదారి పట్టించే ఫిర్యాదులు, ఫేక్ కాల్స్ వంటివి కూడా వస్తుంటాయి. ఆ మధ్య లాక్ డౌన్ విధించినప్పుడు డయల్ 100కు (Dial 100) విపరీతంగా ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. భార్యాభర్తలు ఇంటికే పరిమితం కావడంతో వారి మధ్య గొడవలు తలెత్తి పరస్ఫరం 100కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేసుకున్నారు. కొన్ని ఫిర్యాదులైతే మరీ సిల్లీగా ఉంటుండడం కూడా వెలుగు చూశాయి.
తాజాగా మరోసారి అలాంటి ఘటన జరిగింది. హోలీ (Holi 2022) పండక్కి తన భార్య చికెన్ వండలేదని అసహనం చెందిన భర్త ఏకంగా డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఒకసారి ఫోన్ చేసి ఫిర్యాదు చేయకుండా అదే పనిగా ఫోన్ చేసి విసిగించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా కనగల్‌లో చోటు చేసుకుంది. చికెన్ (Chicken) వండనందుకు గానూ తన భార్యపై చర్యలు తీసుకోవాలని డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులను కోరినట్లుగా స్థానిక ఎస్సై వెల్లడించారు.
కనగల్ (kanagal) సమీపంలోని చర్ల గౌరారానికి చెందిన ఓర్సు నవీన్ అనే యువకుడు ఫూటుగా తాగి డయల్ 100కు ఏకంగా 6 సార్లు ఫోన్ చేసి పోలీసులను విసిగించాడు. ఏమైందో అనుకొని పోలీసులు ఘటనా స్థలానికి కూడా వెళ్లగా.. భార్య మాంసం వండిపెట్టలేదని అందుకే ఫోన్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. మద్యం మత్తులో జోగుతున్న నవీన్‌ను చూసి పోలీసులకు తీవ్ర ఆగ్రహం కలిగింది. ఈ విషయంపై పోలీసుల సమయాన్ని వృథా చేసినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. అత్యవసర సేవలు, ఆపద సమయంలో మాత్రమే 100కు డయల్ చేయాలని, అనవసరంగా ఫోన్‌చేసి సమయాన్ని వృథా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మహిళల భద్రతకు కూడా..
మహిళలు వేధింపులకు ఎదురైన సందర్భంలో కూడా డయల్ 100 ఎంతో ఉపయోగపడుతోంది. షీ టీంకు (She Teams) ఫిర్యాదు చేయదలచుకునే మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మహిళలు అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కు కాల్ చేయడం వల్ల షీ టీం పోలీసులు తక్షణం రంగంలోకి దిగి ఆకతాయిల పని పడుతున్నారు.