Vemula Veeresham Quits BRS: బీఆర్ఎస్ లో మరో వికెట్ డౌన్, టికెట్ రాలేదని వేముల వీరేశం రాజీనామా
Ex MLA Vemula Veeresham Resigned to BRS: సీఎం కేసీఆర్ తొలి విడత జాబితాలో తమకు టికెట్ నిరాకరించడంతో ఒక్కొక్కరుగా నేతలు బీఆర్ఎస్ ను వీడుతున్నారు. వేముల వీరేశం పార్టీకి రాజీనామా చేశారు.
Ex MLA Vemula Veeresham Resigned to BRS:
అధికార పార్టీ భారత్ రాష్ట్ర సమితి (BRS)లో అసంతృప్తి రగులుతోంది. సీఎం కేసీఆర్ తొలి విడత జాబితాలో తమకు టికెట్ నిరాకరించడంతో ఒక్కొక్కరుగా నేతలు బీఆర్ఎస్ ను వీడుతున్నారు. ఇప్పటికే ఖానాపూర్ రేఖా నాయక్ దంపతులు కాంగ్రెస్ లో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ వీడుతున్నట్లు ప్రకటించారు. తనను, తన అనుచరులను కేసులు పెట్టి వేధించారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. అంతకుముందు తన అనుచరులతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం భేటీ అయ్యారు. అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించారు.
వేముల వీరేశం నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారు. వేముల వీరేశం ఎమ్మెల్యేగా(2014- 2018) తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహించారు. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు. వెనుకబడిన కుటుంబం నుండి వచ్చిన వీరేశం నియోజకవర్గంలోనే ఉంటూ పేదల సమస్యలు తెలుసుకునే నేత అని స్థానికంగా చెబుతారు. ఆపై 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య చేతిలో వేముల వీరేశం ఓటమి చెందారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అనంతరం బీఆర్ఎస్ లో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వాలని భావించిన సీఎం కేసీఆర్.. నకిరేకల్ (ఎస్సీ) రిజర్వ్ డ్ సీటును కాంగ్రెస్ ఫిరాయింపు నేత చిరుమర్తి లింగయ్యకు కేటాయించారు. దాంతో పార్టీని నమ్ముకున్న తనకు అన్యాయం జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
వేముల వీరేశం మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరాబర్ పోటీలో ఉంటానని, కచ్చింగా గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షం, ప్రశ్నించే తత్వం లేకుండా చేయాలనే బీఆర్ఎస్ కుట్రలు సరికాదన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని, అధిష్టానం ఆదేశాలు పాటించానని చెప్పారు. కానీ బీఆర్ఎస్ అధిష్టానం నాకు అన్యాయం చేసిందని ఆరోపించారు. అధిష్టానం ఏనాడు తనను పిలిచి మాట్లాడలేదని, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి మాత్రమే ఒకసారి మాట్లాడారని తెలిపారు.
ఆ ప్రచారంలో వాస్తవం లేదు..
ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 2025 వరకు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీనే లేవు, అయితే తనకు పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా అనేక ఇబ్బందులకు గురిచేసినా పార్టీ కోసమే పని చేశానన్నారు. ఒక పార్టీలో ఉండి మరొక పార్టీ గురించి ఆలోచించే వ్యక్తిని కాదన్నారు. నకిరేకల్ ప్రజలే తనకు అధిష్టానం అని, వారి ఆదేశాలే తనకు శిరోధార్యం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భార్యాభర్తలు
ఖానాపూర్ నుండి ఎమ్మెల్యే రేఖా నాయక్, ఆసిఫాబాద్ నుండి ఆమె భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం గాంధీ భవన్లో దరఖాస్తు పెట్టుకున్నారు. తొలి విడత జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. దాంతో వారు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.