(Source: ECI/ABP News/ABP Majha)
Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద, రెండు గేట్లు ఎత్తిన అధికారులు!
Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరదలు వస్తుండగా.. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar Dam: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద వస్తోంది. ఈ క్రమంలోనే అప్రమత్తమైన అధికారులు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 64821 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 589.90 అడుగులుగా నమోదైంది. పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 311.7462 టీఎంసీలుగా ఉంది.
రెండు నెలల క్రితమే సాగర్ ఎడమ కాలువకు గండి..
నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడింది. దీంతో నల్గొండ జిల్లా నిడమనూరు మండలం భయంగుప్పెట్లో ఉంది. ఇప్పటికే మూడు గ్రామాలు నీట మునిగాయి. ఇప్పుడు మరిన్ని గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరిక అందరినీ కంగారు పెట్టిస్తోంది.
ముప్పారం సమీపంలో సాగర్ ఎడమ కాలువక గండి పడింది. మట్టికట్ట బలహీన పడటం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో కాల్వలోకి సుమారు ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు తెలుస్తోంది. స్థానిక రైతు ఇచ్చిన సమాచారంతో అధికారులకు అసలు విషయం తెలిసింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నీటి విడుదల ఆపేశారు.
సాగర్ కాల్వకు నీటి విడుదల గత నెల జులై 28 నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు విడుదల చేసిన నీరు పూర్తిగా గండి ద్వారానే వృథా అయ్యే అవకాశం ఉంది. శివారు ప్రాంతంలో ఉన్న పొలాల కోసం నీటిని విడుదల చేశారు. ఇప్పుడు ఆ నీరు ఆ రైతులకు చేరక పోగా... గండిపడిన ప్రాంతంలోని పొలాలు మునిగిపోయాయి. నీట మునిగి పొలాల్లో ఉన్న వరి నాట్లు పూర్తిగా మునిగిపోతే చాలా నష్టపోతామంటున్నారు రైతులు. ఇంకా ఎన్ని ప్రాంతాల్లో పొలాలు నీట మునుగుతాయో అనే టెన్షన్ రైతులను వెంటాడుతోంది. ఇప్పటికే వందల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.