(Source: ECI/ABP News/ABP Majha)
Munugode ByPoll Results: మునుగోడులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్, డిపాజిట్ కోల్పోయిన పాల్వాయి స్రవంతి
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి డిపాజిట్ సైతం దక్కించుకోలేకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి చవి చూసింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నల్గొండలో మునుగోడు నియోజకవర్గం ఒకటి. అలాంటి చోట కనీసం డిపాజిట్ ను కూడా దక్కించుకోలేని పరిస్థితికి చేరింది. తాజాగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి డిపాజిట్ సైతం దక్కించుకోలేకపోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఓటమి అంటే జీర్ణించుకోవడం సాధ్యమే కానీ, డిపాజిట్ గల్లంతయ్యేలా కాంగ్రెస్ ఓడిపోవడంతో పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని టీ కాంగ్రెస్ నేతల్లో ఆలోచన మొదలైంది.
సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ !
తొలి రెండు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం ప్రదర్శించింది. అటు తరువాత మొత్తం అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. వాస్తవానికి మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆధిపత్యం మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ప్రతి రౌండ్ లోనూ స్వల్ప మెజార్టీ సాధిస్తూ, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగురవేశారు. అయితే అధికారికంగా విజేతను ఈసీ ప్రకటించాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మునుగోడు సిట్టింగ్ సీటును కోల్పోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికలు వచ్చాయని తెలిసిందే. అయితే నల్గొండ జిల్లాలో జరిగిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ మునుగోడు విజయంతో హ్యాట్రిక్ నమోదు చేసింది.
డిపాజిట్ కోల్పోవడం అంటే..
ఎన్నికల్లో పోలైన ఓట్లలో చెల్లుబాటయ్యే వాటిలో 1/6 వంతు ఓట్లను అభ్యర్థులు సాధించాలి. లేకపోతే వారు డిపాజిట్ కోల్పోతారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందుకుగానూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మొత్తం డిపాజిట్ చేస్తారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక 16.7% శాతం ఓట్లు సాధించని అభ్యర్థులు తమ డిపాజిట్ కోల్పోతారు. మునుగోడు ఉప ఎన్నికల్లో 2,41,805 ఓట్లుండగా.. 2,25,192 ఓట్లు పోలయ్యాయి. అంటే కనీసం 37, 500 పైచిలుకు ఓట్లు అభ్యర్థి సాధించాలి. తాజాగా జరిగిన కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 30 వేల కంటే తక్కువ ఓట్లు వచ్చాయని సమాచారం. దాంతో ఆమె డిపాజిట్ కోల్పోయారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగగా.. ఏ ఒక్క రౌండ్ లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి రాలేదు.
కాంగ్రెస్ ఫెయిల్
మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ చతికిలపడింది. ఇటీవల ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు రావడం గగనం అయిపోతోంది. ఒక్క నాగార్జున సాగర్ ఉపఎన్నికలో మాత్రమే కాస్త టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ సీన్ మారిపోయింది. మునుగోడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటిది. కానీ అక్కడా చతికిలపడిపోయింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా.. ఓడిపోయిన తర్వాత ఎన్ని రకాల కారణాలైనా చెప్పుకోవచ్చు.. కానీ వాట్ నెక్ట్స్ అనేది ముఖ్యం. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఓ పజిల్‌గా మారిపోనుంది. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు.