కోమటి రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారా? కొత్త పార్టీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలిందంటూ ప్రచారం ఊపందుకుంది. పార్టీకి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడుతున్నారంటూ పుకార్లు కలకలం రేపాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని పొలిటికల్ సర్కిల్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసారని కూడా ప్రచారం జరిగింది. ఆయన వేరే పార్టీ పెట్టబోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. దీంతో ఉదయం కాంగ్రెస్ పార్టీలో కాసేపు కలకలం రేగింది. ఇది జరిగిన కాసేపటికే కోమటిరెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. తనది కాంగ్రెస్ రక్తమని.. పార్టీ మార్పు వార్తలను ఖండించారు. భువనగిరి పార్లమెంట్ నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మొదటి నుంచి ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. తన తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినప్పుడు కూడా ఈయన బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం నడిచింది. అయితి అదంతా బోగస్ అని అప్పట్లో వివరణ ఇచ్చారు వెంకట్‌రెడ్డి. మళ్లీ ఇన్ని రోజులు తర్వాత మళ్లీ పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఈసారి ఏకంగా ఆయనో పార్టీ పెట్టబోతున్నారని కూడా జత చేసి మరీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీ పెడుతున్నట్టు ప్రత్యర్థులు, గిట్టని వారు చేస్తున్న ప్రచారంగా కోమటిరెడ్డి వివరణ ఇస్తున్నారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. మీడియా సంస్థలు ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సూచించారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను అధికారికంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెబుతానన్నారు. ఇప్పటి వరకు తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానంటూ కూడా ప్రచారం చేస్తున్నారని ఇది కూడా తప్పని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ మధ్య రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ గాంధీ భవన్‌లో చేపట్టిన దీక్షలో పాల్గొన్నట్టు చేప్పారు. భువనగిరి నియోజకవర్గంలో కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు వివరించారు.
తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవని...తనది కాంగ్రెస్ రక్తమని చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. బీజేపీ నుంచి కూడా ఎలాంటి ఆఫర్లు లేవన్నారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పాల్సిన అవసరం తనకు లేదన్నారు. కొత్త పార్టీ పెడుతున్నానని తప్పుడు వార్తలు ప్రచారం చేయకండని రిక్వస్ట్ చేశారు. కాంగ్రెస్ అంటేనే బ్రాండ్ అని.. తాను పార్టీ మారతాననేది ఊహాగానమేనన్నారు.
తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేయడం ఇప్పుడే కొత్త కాదన్నారు కోమిటిరెడ్డి. గతంలోనూ ఇలాంటి తప్పుడు ప్రచారాలను చేశారని గుర్తు చేశారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసి కొందరు లబ్ధి పొందాలని అనుకోవడం హుందాతనం అనిపించుకోదని హితవుపలికారు. కాంగ్రెస్‌లో 35 ఏళ్లుగా పని చేస్తున్నానని... తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు.
పార్టీ మార్పుపై ఎప్పటికప్పుడు కోమటి రెడ్డి వివరణ ఇస్తూనే వస్తున్నారు. అయినా ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే రాజకీయ లబ్ధి కోసం ప్రత్యర్థులే ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని కోమటిరెడ్డి గట్టిగా నమ్ముతున్నారు.