Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకుని మోసపోయాను: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Congress MLA Rajagopal Reddy | కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నా తనకు ప్రయోజనం దక్కలేదని, అధిష్టానం తనను మోసం చేసిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు.

Telangana Politics | నల్గొండ: పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నా, ప్రయోజనం దక్కలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని కాపాడేందుకు ఆస్తులు అమ్ముకున్నాను కానీ పార్టీ తనను మోసం చేసిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన నలుగురికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చారు, కానీ తనకు మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. తనతో పాటు బీజేపీ నుండి వచ్చిన వివేక్ వెంకటస్వామిని కూడా మంత్రి పదవి వరించింది, వివేక్ కుమారుడు గడ్డం వంశీకి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చారు కానీ పార్టీ కోసం ఎంతో చేసిన తనను పక్కన పెట్టారని ఆరోపించారు.
పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపణలు
పార్టీ కోసం ఆస్తులు అమ్ముకుని ఎంతో కష్టపడ్డాను. అయినా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మంత్రి పదవి ఇస్తామని మాటిచ్చి మోసం చేశారు. ఎంపీ ఎన్నికల సమయంలోనూ భువనగిరి స్థానాన్ని గెలిపిస్తే మంత్రి పదవి అని మరోసారి హామీ ఇచ్చారు. నాకు మంత్రి రాకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారు. అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రయోజనాలు దక్కాలని’ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
వైన్‌షాప్ టెండర్స్ వేసేవారికి కండీషన్లు
ప్రతి రాష్ట్రంలో వైన్స్ షాపు (Wines Shop) నిర్వాహణకుగానూ ఎక్సైజ్ శాఖ నిబంధనలు పాటించాలి. అయితే మునుగోడు నియోజకవర్గంలో తాను చెప్పే విషయాలు పాటించాలంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సొంత నిబంధనలు ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారడం తెలిసిందే. నియోజకవర్గంలోని మునుగోడు, గట్టుప్పల్, నాంపల్లి, చండూరు, మర్రిగూడ, నాంపల్లి, చౌటుప్పల్, సంస్థన్ నారాయణపురం మండలాలలో వైన్ షాప్స్ టెండర్స్ వేసే ఆశావహులు టెండర్లు వేయాడానికి కొన్ని కండీషన్లు పెట్టారు. ముఖ్యంగా మండలానికి చెందినవారే మాత్రమే టెండర్లు వేయాలని, ఇతర మండలానికి చెందిన వారు టెండర్లు వేయవద్దని స్పష్టం చేశారు.
బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారతే లక్ష్యం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులకు టెండర్లు వేసే వారు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకే మద్యం విక్రయించాలి. వైన్ షాపులు ఊరి బయట ఉండాలి. వైన్స్ షాపుల్లో సిట్టింగ్ నడపకూడదు. బెల్ట్ షాపులకు వైన్స్ షాపులు మద్యం అమ్మకూడదు. అసలు టెండర్లు వేసే సమయంలో ఎలాంటి సిండికేట్ ఉండొద్దు అని కోమటిరెడ్డ రాజగోపాల్ రెడ్డి కండీషన్లు పెట్టారు. ప్రజలను ఆరోగ్యవంతులుగా చేయడం, జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు బెల్ట్ షాపుల నిర్మూలన, మహిళా సాధికారతే తన లక్ష్యమని ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. తన కండీషన్లు, సూచించిన విషయాలు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదని, మునుగోడు నియోజకవర్గ ప్రజలు, యువత మద్యం మత్తును వదిలాలి.. అందరూ ఆర్థికంగా ఎదగాలన్నది తన కోరిక అన్నారు.






















