Khammam Politics: ఖమ్మంలో రగులుతున్న రాజకీయాలు ! మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
పది నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తరుచూ ఏదో ఒక నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మద్య ఘర్షణ జరగడం పరిపాటిగా మారింది. తాజాగా పినపాక నియోజకవర్గంలో వివాదం తలెత్తింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. మొత్తం 10 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి జిల్లాలో తరుచూ ఏదో ఒక నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య విభేదాలు రావడం పరిపాటిగా మారింది. తాజాగా పినపాక నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో మరోమారు అధికార పార్టీ నేతల మధ్య విబేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగులో కొందరు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిలను ఆహ్వానించారు. అయితే ప్రభుత్వ విప్ రేగా వర్గీయులు ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఐ చేసిన ప్రయత్నాలు పలించలేదు. శుక్రవారం రాత్రి అశ్వాపురం వస్తున్న పొంగులేటిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మాత్రం పోలీసులు చెబుతున్నా వారించకుండా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో రేగా, పొంగులేటి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.
పార్టీ ఫిరాయింపులు.. పాత వారికి ప్రాధాన్యత లేకపోవడం..
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరుకు అసలు కారణంగా మారింది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉండగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ కేవలం ఓకే స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఆరు నియోజకవర్గాల్లో విజయం సాదించగా రెండు నియోజకవర్గాల్లో టీడీపీ, ఒక నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాదించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు, టీడీపీ నుంచి ఎన్నికైన ఇద్దరు, స్వతంత్ర అభ్యర్థి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన వారితోపాటు అప్పటి వరకు టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న నాయకులు, కొత్తగా చేరిన వారి మధ్య విబేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తరుచూ వర్గ విభేదాలు నెలకొంటున్నాయి.
మణుగూరులోనే అదే ఆదిపత్య పోరు..
పినపాక నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుపై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన రేగా కాంతారావు విజయం సాదించారు. పాయం వెంకటేశ్వర్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఈ రెండు వర్గాల మధ్య ఆదిపత్య పోరు నడుస్తూనే ఉంది. ఇటీవల కాలంలో పొంగులేటి సైతం ఉమ్మడి జిల్లాలో తరుచూ పర్యటనలు చేస్తున్నారు. అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు మాజీ ఎంపీ పొంగులేటితో పాటు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిని ఆహ్వానించడంతో ఆగ్రహం చెందిన రేగా వర్గీయులు ఈ కార్యక్రమానికి అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత విబేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందనే విషయంపై చర్చ సాగుతుంది.
Also Read: Karimnagar Smart City: కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు ముందుకు సాగేనా? బడ్జెట్ పెరుగుతున్నా లెక్కలు తప్పారా !
Also Read: Jaggareddy : ఇప్పుడే కాదు మార్చి 21న ప్రకటిస్తా - కాంగ్రెస్‌కు రాజీనామాపై జగ్గారెడ్డి !