Yadadri News: యాదాద్రి ఆలయంలో ముగ్గురు సీఎంలు పూజలు - దర్శనానికి రాని పినరయి విజయన్, రాజా
ముఖ్యమంత్రుల పర్యటన ఉండడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరి గుట్టలో దాదాపు 1,600 మంది పోలీసులను భద్రత కోసం ఉంచారు.
![Yadadri News: యాదాద్రి ఆలయంలో ముగ్గురు సీఎంలు పూజలు - దర్శనానికి రాని పినరయి విజయన్, రాజా KCR kejriwal bhagwant mann akhilesh yadav visits yadagirigutta temple Yadadri News: యాదాద్రి ఆలయంలో ముగ్గురు సీఎంలు పూజలు - దర్శనానికి రాని పినరయి విజయన్, రాజా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/18/26aa1852b8af0688c833019b6764c8e11674025483046234_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం నేడు ముగ్గురు ముఖ్యమంత్రులు, ఓ మాజీ ముఖ్యమంత్రితో సందడిగా మారింది. సీఎం కేసీఆర్ సహా ముగ్గురు సీఎంలు నేడు స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో అల్పాహారం ముగించుకొని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లలో సీఎంలు యాదాద్రి చేరుకున్నారు. అక్కడి ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి సీఎంలు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఆలయానికి చేరుకున్నారు. వీరికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వారితోపాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితర నేతలు కూడా ఉన్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రులకు వేదమంత్రోచ్ఛరణలతో అర్చకులు ఆశీర్వచనం పలికారు. స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయానికి రాని విజయన్, రాజా
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా మాత్రం ఆలయానికి వెళ్లలేదు. వారు సూట్‌లోనే ఉండిపోయారు. దర్శనం తర్వాత సీఎంలు నలుగురు ఖమ్మంలో జరగబోయే బీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్తారు. సీఎంల పర్యటన ఉండడంతో భద్రత కారణాల దృష్ట్యా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు దర్శనం, అర్జిత సేవలకు భక్తులకు అనుమతి లేదని ఆలయ ఈవో గీత ముందే తెలిపారు.
ముఖ్యమంత్రుల పర్యటన ఉండడంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరి గుట్టలో దాదాపు 1,600 మంది పోలీసులను భద్రత కోసం ఉంచారు.
ఉదయం ప్రగతి భవన్‌లో అల్పాహార విందు
బహిరంగ సభలో పాల్గొనేందుకు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, పలువురు జాతీయ నేతలు మంగళవారం (జనవరి 17) రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. నేడు ఉదయం (జనవరి 18) వారిని ప్రగతి భవన్‌కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్ అందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఆ విందు సమయంలో జాతీయ రాజకీయాలు, సంబంధిత జాతీయ అంశాలపై నేతలు చర్చించుకున్నారు. విందు అనంతరం బేగంపేట విమానాశ్రయానికి వారు వెళ్లారు. అక్కడి నుంచి రెండు హెలికాప్టర్లలో యాదగిరి గుట్ట ఆలయానికి బయలుదేరి వెళ్లారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనం అనంతనం అక్కడినుంచి ఖమ్మంకు ప్రత్యేక హెలికాప్టర్‌లోనే బయలుదేరి వెళ్లారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)