BRS Khammam Meeting: దేశ రాజకీయాలను మలుపు తిప్పనున్న ఖమ్మం సభ - మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
ఖమ్మంలో నిర్వహించనున్న ఈ సభకు 13 నియోజకవర్గాల నుంచి ఎక్కువ జన సమీకరణ చేస్తున్నాం. ప్రజల నుంచి స్పందన వస్తోందని, సభకు వాహనాలు దొరకడం లేదు అని మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ఈ నెల 18 న ఖమ్మంలో నిర్వహించనున్న సభ చారిత్రక సభ అని దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభ అని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వంద ఎకరాల్లో బహిరంగ సభ జరుగుతుందని, పార్కింగ్ 448 ఎకరాల్లో 20 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వెయ్యి మంది వాలంటీర్లు సభలో అందుబాటులో ఉంటారని, నియోజక వర్గాల వారీగా ఇన్ ఛార్జిలను నియమించి జన సమీకరణ చేస్తున్నాం అని చెప్పారు.
సభకు వాహనాలు దొరకడం లేదు..
ఖమ్మంలో నిర్వహించనున్న ఈ సభకు 13 నియోజకవర్గాల నుంచి ఎక్కువ జన సమీకరణ చేస్తున్నాం. ప్రజల నుంచి స్పందన వస్తోందని, సభకు వాహనాలు దొరకడం లేదు అని మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాల నుంచి బస్సులు, వాహనాలు సమకూరుస్తున్నాము. ముఖ్య అతిథులతో పాటు ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు వేదికపై ఉంటారని వెల్లడించారు. మంగళవారం రాత్రికి ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు హైదరాబాద్ చేరుకోనున్నారు. జనవరి 18వ తేదీన ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ముగ్గురు ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు చర్చలు జరుపుతారు.
‘యాదాద్రి దర్శనం చేసుకొని.. రెండు హెలి కాప్టర్ల లో ఖమ్మం చేరుకుంటారు. నూతన కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఖమ్మం కలెక్టరేట్ లో రెండవ విడత కంటి వెలుగు ప్రారంభిస్తారు. కంటి వెలుగు ప్రారంభం తర్వాత కలెక్టరేట్ లో నలుగురు ముఖ్యమత్రులు భోజనం చేస్తారు. సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది. కళా కారులకు ప్రత్యేక వేదిక ఉంటుంది.. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని’ మంత్రి హరీష్ రావు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి హరీష్ రావు సూచించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీష్ రావు, సీ.ఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ సమీక్ష నిర్వహిస్తూ.. పలు సూచనలు చేశారు. ఈ నెల 18 వ తేదీన ఖమ్మంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మధ్యాన్నం ఒంటి గంటకు కంటి వెలుగు - 2 కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆ మరుసటి రోజైన 19 వ తేదీన మిగతా అన్ని జిల్లాలలో ఉదయం 9 . 00 గంటలకు కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
మొదటి విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లుగానే... అదే తరహా స్పూర్తితో ప్రస్తుతం కంటి వెలుగు - 2 కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు చొరవ చూపాలని అన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా శిబిరాల్లో నాణ్యతతో కూడిన సేవలు అందించాలని, అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను అప్పటికప్పుడే అందించాలని చెప్పారు. శిబిరాల నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాలకు నిధులు కేటాయించడం జరిగిందని, ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని సూచించారు.