Komatireddy Rajgopal Reddy : మునుగోడు ప్రజల తీర్పును గౌరవిస్తా, నైతికంగా గెలుపు నాదే - కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Komatireddy Rajgopal Reddy : మునుగోడులో నైతికంగా తానే గెలిచానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రజల తీర్పును గౌరవిస్తానన్నారు.
Komatireddy Rajgopal Reddy : మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవిస్తున్నానని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అధికార టీఆర్ఎస్ దుర్మర్గంగా తనను ప్రచారం చేయకుండా అడ్డుకుందన్నారు. భారతదేశ చరిత్రలో ఎన్నికల మధ్యలో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయడం మొట్టమొదటిసారి జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేటీఆర్ బాగా ఒత్తిడి తీసుకొచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ తో బాగా తప్పులు చేపిస్తే సస్పెండ్ చేశారన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు మొత్తం 3వ తారీఖు సాయంత్రం వరకు మునుగోడులోనే ఉండి డబ్బు పంచి ప్రలోభాలు పెట్టి అధర్మంగా గెలిచే ప్రయత్నం చేశారన్నారు. తనను, తమ నాయకుల్ని పోలీసులు అష్టదిగ్బంధం చేశారని ఆక్షేపించారు. ఒక్కో గ్రామానికి ఎమ్మెల్యే, మంత్రిని కేటాయించి భారతదేశంలో కనివిని ఎరుగని విధంగా ప్రచారం చేయించారన్నారు. అవినీతి సొమ్ముతో మద్యం ఏరులై పారించి ఎన్నికల్లో అధర్మం గెలిచే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు.
నైతికంగా నేనే గెలిచా
"సింబల్స్ కూడా కరెక్టుగా అలాట్ చేయలేదు. 31వ తారీఖు వరకు బీజేపీకి అనుకూలంగా ఉంది. 1వ తేదీ సాయంత్రం ఎన్నికల నిబంధన ప్రకారం బయట నుంచి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లకుండా మునుగోడులో ఉండి ప్రచారం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి పక్షపాతం చూపించారు. మూడో తారీఖు సాయంత్రం వరకు డబ్బులు పంచుకుంటూ ప్రలోభాలకు గురిచేసి, బెదిరించి అడ్డదారుల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలాగా ప్రవర్తించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తీరును తెలంగాణ సమాజం గమనించాలి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని ఓడించేందుకు వంద మంది కౌరవ సైన్యం, అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం వచ్చాయి. వాళ్లకు అనుకూలమైన వ్యక్తుల్ని నామినేషన్ వేయడానికి ముందే పోస్టింగ్ ఇచ్చారు. మేము గట్టి పోటీ ఇచ్చాము. ఎన్నికల్లో నైతికంగా నేను గెలిచాను. ముఖ్యమంత్రి అడ్డదారులతో గెలిచిన అనుకుంటుండు గానీ అది ఓన్లీ నెంబర్ గేమ్ మాత్రమే. "- కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కమ్యూనిస్టులు అమ్ముడుపోయారు
8 ఏళ్లుగా అభివృద్ధి చేసినట్లయితే అంత మంది అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, అంత అధికార దుర్వినియోగం అవసరం లేదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు ప్రజల్ని ప్రలోభాలు పెట్టి అధర్మంగా గెలిచారన్నారు. తెలంగాణలో ఎక్కడ కూడా గొర్రె పంపిణీ చేయలేదు కానీ ఎన్నికలు వచ్చాయని మునుగోడులో చేశారని విమర్శించారు. గొల్ల కురుమలకు డబ్బులు వేయకుండా ఆపి బెదిరించడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మంత్రిని రెండు రోజులు ప్రచారానికి దూరంగా ఉంచిందన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజల పక్షాన కుటుంబ పాలన పోగొట్టడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి బీజేపీ పోరాడుతుందన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, యువత ఎంతో మంది తన గెలుపు కోసం కృషి చేశారన్నారు. ఒక వ్యక్తిని ఓడించేందుకు ప్రభుత్వమే కదిలి వచ్చిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ దుర్మార్గంగా గెలిచినా ప్రజల మనసులో తానే ఉన్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆరోజు తెలంగాణ కోసం పార్లమెంట్లో ఎలాగైతే కొట్లాడానో.. అలానే ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ పై పోరాటం కొనసాగుతుందన్నారు. కేసీఆర్ అవినీతి సొమ్ముకు కమ్యూనిస్టు నాయకులు అమ్ముడు పోయారని ధ్వజమెత్తారు. కమ్యూనిస్టులకు కనీసం ప్రగతి భవన్ లో అపాయింట్మెంట్ ఇవ్వని సీఎంకు బుద్ధి చెప్పాల్సింది పోయి ఆయన పంచన చేరారని విమర్శించారు.